[1] నేను మైదానంలో కుంకుమ పువ్వును లోయలలో కస్తూరి పుష్పాన్ని.
[2] నా ప్రియురాలా, ఇతర స్త్రీల మధ్య నీవు ముళ్ల మధ్య కస్తూరి పుష్పంలా ఉన్నావు!
[3] నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య నీవు అడవి చెట్ల మధ్య ఆపిలు చెట్టులా ఉన్నావు! ఆనంద భరితనై నేనతని నీడన కూర్చుంటాను! నా ప్రియుని నీడలో కూర్చుని నేను ఆనందిస్తాను, అతని పండు నాకెంతో తియ్యగా వుంది.
[4] నా ప్రియుడు నన్ను మద్యగృహానికి తీసుకుని వెళ్లాడు, నా మీద అతని ఉద్దేశం ప్రేమ.
[5] ఎండు ద్రాక్షాలతో నాకు బలాన్నివ్వండి, ఆపిలు పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను ప్రేమతో బలహీనమయ్యాను.
[6] నా ప్రియుని ఎడమ చేయి నా తల కింద ఉంది, అతని కుడి చేయి నన్ను పట్టుకొంది,
[7] యెరూషలేము స్త్రీలారా, నాకు వాగ్దానం చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ్ల మీదా ఒట్టేసి, నేను సిద్ధపడేవరకూ. ప్రేమను లేపవద్దు, ప్రేమను పురికొల్పవద్దు.
[8] నా ప్రియుని గొంతు వింటున్నాను. అదిగో అతడు వస్తున్నాడు. పర్వతాల మీది నుంచి దూకుతూ కొండల మీది నుంచి వస్తున్నాడు.
[9] నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు లేదా లేడి పిల్లలా ఉన్నాడు. మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు, కిటికీలోనుంచి తేరి పార చూస్తూ, అల్లిక కిటికీలోనుంచి చూస్తూ
[10] నా ప్రియుడు నాతో అంటున్నాడు, “లే, నా బంగారు కొండా, నా సుందరాంగీ, మనం పోదాంపద!
[11] చూడు, శీతాకాలం వెళ్లిపోయింది, వానలు వచ్చాయి వెళ్లాయి.
[12] పొలాల్లో పూలు వికసిస్తున్నాయి ఇది పాడే సమయం! కోలాహలపు పావురాలు తిరిగి వచ్చాయి.
[13] అరటి చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి. పూలు పూస్తున్న ద్రాక్షా తీగల వాసన చూడు. లే, నా బంగారు కొండా, నా సుందరాంగీ, మనం పోదాం పద!”
[14] ఇక్కడ ఈ పర్వతం మీద కనపడని ఎత్తైన శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా! నిన్ను చూడనిమ్ము, నీ గొంతు విననిమ్ము, నీ గొంతు ఎంతో మధురం, నువ్వెంతో సుందరం!
[15] మాకోసం గుంటనక్కల్ని పట్టుకో ద్రాక్షాతోటల్ని పాడుసే చిన్న గుంటనక్కల్ని! మా ద్రాక్షాతోట ఇప్పుడు పూతమీద ఉంది.
[16] నా ప్రియుడు నావాడు, నేను అతని దానను! అతడు పద్మాల నడుమ గొర్రెలను మేపుతున్నాడు!
[17] రోజు తన చివరి శ్వాసను విడిచినప్పుడు నీడలు పరుగెత్తినప్పుడు, నా ప్రియుడా, చీలిన పర్వతాల మీద దుప్పిలా, లేడిపిల్లలా తిరుగు!