Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:45

[1] సున్నతి పొందిన వాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి?

[2] ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్ళకు తన సందేశాన్ని అప్పగించాడు.

[3] మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగని వాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగని వాడని అనగలమా?

[4] అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినాసరే, దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు! ఈ విషయమై ఇలా వ్రాయబడివుంది: “నీవు మాట్లడినప్పుడు నిజం చెప్పావని ఋజువౌతుంది. నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు!”

[5] మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను.

[6] ఎన్నటికీ కాదు. అలాగైనట్లైతే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు?

[7] “నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లైతే, నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు?

[8] మంచి కలగటానికి మనం పాపంచేద్దాం” అని అనకూడదు. మేమీవిధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్ళకు తగిన శిక్ష లభిస్తుంది.

[9] మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైన వాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకాని వాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే ఋజువు చేసాను.

[10] ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది: “నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు!

[11] అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు. దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు.

[12] అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అందరూ కలిసి పనికిరాని వాళ్ళైపోయారు. మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!”

[13] “వాళ్ళనోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి. వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి;” “వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!”

[14] “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!”

[15] “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి.

[16] వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశ నాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు.

[17] వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!”

[18] “వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.”

[19] ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన వారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, అంటే యూదులు కాని వాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు.

[20] ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము.

[21] కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేసాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది.

[22] దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది.

[23] అందరూ పాపం చేసారు, కనుక దేవుని తేజస్సు పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు.

[24] కాని, దేవుడు వాళ్ళను తన ఉచితమైన కృపవల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసు క్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది.

[25] దేవుడు ఇది వరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసు క్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయనను కరుణాపీఠంగా చేసాడు.

[26] అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం.

[27] మరి, మనం గర్వించటానికి కారణం ఉందా? ఖచ్చితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంభందించిన న్యాయంవల్ల కారణం లేదని చెపుతున్నాము. కాని క్రియా న్యాయం వల్లకాదు.

[28] మనిషిలో ఉన్న విశ్వాసం అతణ్ణి నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదేశించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను.

[29] దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు కాని వాళ్ళకు కూడా దేవుడే.

[30] దేవుడు సున్నతి పొందిన వాళ్లను వాళ్ళలో విశ్వాసం ఉంది కనుక నీతిమంతులుగా పరిగణిస్తాడు. సున్నతి పొందని వాళ్ళను కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు.

[31] మరి అలాగైతే, ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? కాదు. దాని విలువను ఎత్తి చూపిస్తున్నాము.

రోమీయులకు వ్రాసిన లేఖ — Chapters