[1] మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు:
[2] “ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను గదేశానికి వస్తున్నారు. ఈ దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా మీరు స్వాధీనం చేసుకొంటారు.
[3] దక్షిణాన ఎదోము దగ్గర సీను అరణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది. మృత సముద్రపు దక్షిణ కొనలో మీ దక్షిణాది సరిహద్దు మొదలవుతుంది.
[4] అక్రబ్బీము దక్షిణాన్ని అది దాటిపోతుంది. సీను అరణ్యంనుండి కాదేషు, బర్నేయ, అక్కడ్నుండి హసరద్దారు మళ్లీ అక్కడ్నుండి అస్మోను వరకు ఉంటుంది.
[5] అస్మోను నుండి ఈజిప్టు నది వరకు పోయి, మధ్యధరా సముద్రం దగ్గర సరిహద్దు ముగిస్తుంది.
[6] మీ పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం.
[7] మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ప్రారంభమై, హోరు కొండవరకు ఉంటుంది. (లెబానోనులో.)
[8] హోరు కొండ నుండి లెబోహమత్ వరకు, అక్కడ నుండి సెదాదు వరకు ఉంటుంది.
[9] తర్వాత జిప్రోను వరకు వ్యాపించి, హసరేనాన్ దగ్గర అయిపోతుంది. కనుక అది మీ ఉత్తర సరిహద్దు.
[10] మీ తూర్ఫు సరిహద్దు ఎనాను దగ్గర ప్రారంభమై షెపాము వరకు వ్యాపిస్తుంది.
[11] షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పుగా వ్యాపించి రిబ్లావరకు ఉంటుంది. కిన్నెరెతు సముద్రం (గలలీయ సముద్రం) పక్కగా కొండల వెంబడి సరిహద్దు సాగిపోతుంది.
[12] తర్వాత సరిహద్దు యొర్దాను నదీ తీరం వెంబడి కొనసాగుతుంది. మృత సముద్రం దగ్గర అది అయిపోతుంది. అవి మీ దేశం చుట్టూ సరిహద్దులు.”
[13] కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “అది మీకు లభించే దేశం. పది వంశాలు, మనష్షే వంశంలో సగం మంది కలసి చీట్లు వేసుకొని ఆ దేశాన్ని పంచుకోవాలి.
[14] రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగంమంది ముందే వారి భూమిని తీసుకున్నారు.
[15] ఆ రెండున్నర వంశాల వారు యొర్దాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్లో భూమి తీసుకున్నారు.”
[16] అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు:
[17] “దేశాన్ని భాగాలు చేసేందుకు యాజకుడైన ఎలీయాజరు, నూను కుమారుడు యెహోషువ నీకు సహయపడతారు. వీరు
[18] అన్ని వంశాల నాయకులు. ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉంటాడు. వారు దేశాన్ని భాగిస్తారు.
[19] ఆ నాయకుల పేర్లు ఇవి: యూదా వంశంనుండి — యెపున్నె కుమారుడు కాలేబు;
[20] షిమ్యోను వంశంనుండి — అమ్మిహూదు కుమారుడు షెమూయేలు;
[21] బెన్యామీను వంశంనుండి — కిస్లోను కుమారుడు ఎలీదాదు
[22] దాను వంశంనుండి — యొగ్లి కుమారుడు బుక్కి
[23] మనష్షే (యోసేపు కుమారుడు) వంశంనుండి ఏఫోదు కుమారుడు హన్నీయేలు
[24] ఎఫ్రాయిము (యోసేపు కుమారుడు) వంశంనుండి — షిఫ్తాను కుమారుడు కెమూయేలు
[25] జెబూలూను వంశంనుండి — పర్నాకు కుమారుడు ఎలీషాపాను
[26] ఇశ్శాఖారు వంశంనుండి — అజ్ఞాను కుమారుడు పల్తీయేలు
[27] ఆషేరు వంశంనుండి — షెలోమి కుమారుడు అహీహోదు
[28] నఫ్తాలి వంశంనుండి — అమ్మీహోదు కుమారుడు పెదహేలు.”
[29] ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని పంచేందుకు ఆ మనుష్యులను యెహోవా ఏర్పరచుకొన్నాడు.