Skip to content
Opens in a new window

[1] మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలను వంశాలవారీగా ఈజిప్టునుండి బయటకు నడిపించారు. వారు ప్రయాణం చేసిన స్థలాలు ఇవి.

[2] ఆ ప్రయాణాలను గూర్చి మోషే ఇలా వ్రాశాడు. యెహోవా కోరిన విషయాలను మోషే వ్రాశాడు. ఆ ప్రదేశాలు ఇవి:

[3] మొదటి నెల 15వ తేదిన వారు రామెసేసు నుండి బయల్దేరారు. పస్కా మరునాటి ఉదయం ఇశ్రాయేలు ప్రజలు జయనినాదాలు చేస్తూ ఈజిప్టునుండి బయటకు వచ్చారు. ఈజిప్టు ప్రజలంతా వారిని చూశారు.

[4] యెహోవా చంపిన తమ వారందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూఉన్నారు. తమ పెద్ద కుమారులందరినీ వారు పాతిపెడ్తూ ఉన్నారు. ఈజిప్టు దేవతల మీద యెహోవా తన తీర్పు తీర్చాడు.

[5] ఇశ్రాయేలు ప్రజలు రామెసేసును విడిచి సుక్కోతుకు ప్రయాణం చేసారు.

[6] సుక్కోతు నుండి వారు ఏతాముకు ప్రయాణం చేసారు. అక్కడ అరణ్య శివార్లలో ప్రజలు నివాసం చేసారు.

[7] వారు ఏతాము విడిచి పీహహీరోతు వెళ్లారు. ఇది బయల్సెపోను దగ్గర ఉంది. మిగ్దోలు దగ్గర ప్రజలు నివాసం చేసారు.

[8] ప్రజలు సీహహీరోతు విడిచి, సముద్రం మధ్య నుంచి నడిచారు. వారు అరణ్యంవైపు వెళ్లారు. అప్పుడు వారు ఏతాము అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేసారు. మారా దగ్గర ప్రజలు నివాసం చేసారు.

[9] ప్రజలు మారామ విడిచి ఏలీము వెళ్లి అక్కడ నివాసం చేసారు. అక్కడ 12 నీటి ఊటలు, 70 ఈతచెట్లు ఉన్నాయి.

[10] ప్రజలు ఏలీము విడిచిపోయి ఎర్ర సముద్రం దగ్గర నివాసం చేసారు.

[11] ప్రజలు ఎర్ర సముద్రం విడిచిపోయి సీను అరణ్యంలో నివాసంచేసారు.

[12] ప్రజలు సీను అరణ్యం విడిచి వెళ్లి దోపకాలో నివాసం చేసారు.

[13] ప్రజలు దోపకా విడిచి వెళ్లి ఆలూషులో నివాసం చేసారు.

[14] ప్రజలు ఆలూషు విడిచి వెళ్లి, రెఫీదీములో నివాసం చేసారు. ఆ స్థలంలోనే ప్రజలు తాగేందుకు నీరు దొరకలేదు.

[15] ప్రజలు రెఫీదీము విడిచివెళ్లి, సీనాయి అరణ్యంలో నివాసం చేసారు.

[16] ప్రజలు సీనాయి అరణ్యం విడిచివెళ్లి, కిబ్రోతు హత్తావాలో నివాసం చేసారు.

[17] ప్రజలు కిబ్రోతు హేత్తావా విడిచివెళ్లి హజేరోతులో నివాసం చేసారు.

[18] ప్రజలు హేజేరోతు విడిచివెళ్లి, రిత్మాలో నివాసం చేసారు.

[19] ప్రజలు రిత్మా విడిచివెళ్లి రిమ్మోను పారెసులో నివాసం చేసారు.

[20] ప్రజలు రిమ్మోను పారెసు విడిచివెళ్లి, లిబ్నాలో నివాసం చేసారు.

[21] ప్రజలు లిబ్నా విడిచివెళ్లి రీసాలో నివాసం చేసారు.

[22] ప్రజలు రీసా విడిచి వెళ్లి కెహెలాతాలో నివాసం చేసారు.

[23] ప్రజలు కెహేలాతా విడిచివెళ్లి షాపెరు కొండ దగ్గర నివాసం చేసారు.

[24] ప్రజలు షాపెరు కొండ విడిచివెళ్లి హరాదాలో నివాసం చేసారు.

[25] ప్రజలు హరాదా విడిచివెళ్లి మకెలోతులో నివాసం చేసారు.

[26] ప్రజలు మకెలోతు విడిచివెళ్లి తాహతులో నివాసం చేసారు.

[27] ప్రజలు తాహతు విడిచివెళ్లి తారహులో నివాసం చేసారు.

[28] ప్రజలు తారహు విడిచివెళ్లి మిత్కాలో నివాసం చేసారు.

[29] ప్రజలు మిత్కా విడిచివెళ్లి హష్మోనాలో నివాసం చేసారు.

[30] ప్రజలు హష్మోనా విడిచివెళ్లి మొసెరోతులో నివాసం చేసారు.

[31] ప్రజలు మొసేరోతు విడిచివెళ్లి బెనే యాకానులో నివాసం చేసారు.

[32] ప్రజలు బెనేయాకాను విడిచివెళ్లి హోర్ హగ్గిద్గాదులో నివాసం చేసారు.

[33] ప్రజలు హోర్ హగ్గిద్గాదు విడిచివెళ్లి యొత్బాతాలో నివాసం చేసారు.

[34] ప్రజలు యొత్బాతా విడిచివెళ్లి ఎబ్రొనాలో నివాసం చేసారు.

[35] ప్రజలు ఎభ్రోనా విడిచివెళ్లి ఎసోన్గెబెరులో నివాసం చేసారు.

[36] ప్రజలు ఎసోన్గెబెరులో విడిచివెళ్లి సీను అరణ్యంలోని కాదేషులో నివాసం చేసారు.

[37] ప్రజలు కాదేషు విడిచి వెళ్లి హోరులో నివాసం చేసారు. ఇది ఎదోము సరిహద్దు దగ్గర కొండ.

[38] యాజకుడు అహరోను యెహోవా మాటకు విధేయుడై హోరు కొండ మీదికి వెళ్లాడు. ఆ స్థలంలోనే అహరోను మరణించాడు. ఐదో నెల మొదటి రోజున అహరోను చనిపోయాడు. అది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన 40 వ సంవత్సరం.

[39] అహరోను హోరు కొండ మీద చనిపోయినప్పుడు అతని వయస్సు 123 సంవత్సరాలు. కనాను దేశంలోని నెగెవు ప్రాంతంలో అరాదు ఒక పట్టణం.

[40] ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారని అక్కడ వున్న కనానీ రాజు విన్నాడు.

[41] ప్రజలు హోరు కొండ విడిచి సల్మానాలో నివాసం చేసారు.

[42] ప్రజలు సల్మానా విడిచివెళ్లి పూనొనులో నివాసం చేసారు.

[43] ప్రజలు పూనొను విడిచివెళ్లి ఓబోతులో నివాసం చేసారు.

[44] ప్రజలు ఓబోతు విడిచివెళ్లి ఈయ్యె అబారీములో నివాసం చేసారు. ఇది మోయాబు దేశ సరిహద్దులో ఉంది.

[45] ప్రజలు ఈయ్యె అబారీము విడిచివెళ్లి దీబోను గాదులో నివాసం చేసారు.

[46] ప్రజలు దీబోను గాదు విడిచివెళ్లి అల్మోను దిబ్లాతాయిములో నివాసం చేసారు.

[47] ప్రజలు అల్మోను దిబ్లాతాయిములో విడిచివెళ్లి నెబో దగ్గర అబారీము కొండల మీద నివాసం చేసారు.

[48] ప్రజలు అబారీము కొండలు విడిచి వెళ్లి యొర్దాను నది దగ్గర అర్బత్ మోయాబులో నివాసం చేసారు. ఇది యెరికో దగ్గర, యొర్దానుకు సమీపంలో వారు నివాసం చేసారు.

[49] బెత్యేషిమోతు నుండి తుమ్మ పొలంవరకు వారి నివాసం ఆక్రమించుకొంది. ఇది అర్బత్ మోయాబు అనే చోట ఉంది.

[50] అర్బత్ మోయాబు వద్ద మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన అన్నాడు:

[51] “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు. వారితో ఈ విషయాలు చెప్పు: మీరు యొర్దాను నది దాటుతారు. కనాను దేశంలోనికి మీరు వెళతారు.

[52] అక్కడ మీరు చూసే మనుష్యుల దగ్గరనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. చెక్కబడిన వారి ప్రతిమలను విగ్రహాలను అన్నింటినీ మీరు నాశనం చేయాలి. వారి ఉన్నత స్థలాలు అన్నింటినీ మీరు నాశనం చేయాలి.

[53] ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొని, మీరు అక్కడ స్థిరపడతారు. ఎందు కనగా ఈ దేశాన్ని నేనే మీకు ఇస్తున్నాను. అది మీ కుటుంబాలకు చెందుతుంది.

[54] మీ కుటుంబాలు ప్రతి ఒక్కదానికీ ఆ దేశంలో భాగం ఉంటుంది. దేశంలోని ఒక్కోభాగం ఏ కుటుంబానికి వస్తుందో తెలుసు కొనేందుకు మీరు చీట్లు వేయాలి. పెద్ద కుటుంబాలకు ఆ దేశంలో పెద్ద భాగం ఇవ్వవలెను. చిన్న కుటుంబాలకు ఆ దేశంలో చిన్న భాగం ఇవ్వవలెను. చీట్లు చేసిన నిర్ణయం ప్రకారమే ప్రజలకు భూమి ఇవ్వబడుతుంది. ప్రతి వంశానికి తమ వంతు భూమి ఇవ్వబడుతుంది.

[55] “ఆ ఇతర మనుష్యులు దేశాన్ని వదలి పోయేటట్టుగా మీరు చేయాలి. ఆ ప్రజలను మీరు దేశంలో ఉండనిస్తే, వారు మీకు ఎన్నో కష్టాలు కలిగిస్తారు. వారు మీ కళ్లలో పొడుచుకొనే ముళ్లలా, పక్కలో ముళ్లుగాను ఉంటారు. మీరు నివసించబోయే దేశానికి వారు చాల కష్టాలు తెస్తారు.

[56] నేను ఏమి చేస్తానో మీకు చూపించాను. ఆ ప్రజలను మీ దేశంలో గనుక మీరు ఉండనిస్తే దానిని నేను మీకు చేస్తాను.”

సంఖ్యాకాండము — Chapters