Skip to content
Opens in a new window

[1] మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:

[2] “కనాను దేశాన్ని తరచి చూడ్డానికి కొందరు మనుష్యుల్ని పంపించు. ఇదే నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చే దేశం. పన్నెండు వంశాల్లో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్కరిని పంపించు.”

[3] కనుక యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. పారాను అరణ్యంలోనికి నాయకులను అతడు పంపించాడు.

[4] వారి పేర్లు ఇవి: రూబేను వంశంనుండి జక్కూరు కుమారుడైన షమ్మూయ.

[5] షిమ్యోను వంశంనుండి హోరీ కుమారుడైన షాపాతు.

[6] యూదా వంశంనుండి యెపున్నె కుమారుడైన కాలేబు.

[7] ఇఖారు వంశంనుండి యోసేపు కుమారుడైన ఇగాలు.

[8] ఎఫ్రాయిము వంశంనుండి నూను కుమారుడైన హోషేయ.

[9] బెన్యామీను వంశంనుండి రాఫు కుమారుడైన పల్తీ.

[10] జెబూలూను వంశంనుండి సోరీ కుమారుడైన గదీయేలు.

[11] మనష్షే (యెసేపు వంశాల్లో ఒకటి) వంశంనుండి సూసీ కుమారుడైన గదీ.

[12] దాను వంశంనుండి గెమలి కుమారుడైన అమ్మీయేలు.

[13] ఆషేరు వంశంనుండి మిఖాయేలు కుమారుడైన సెతూరు.

[14] నఫ్తాలి వంశంనుండి వాపెసీ కుమారుడైన నహబీ.

[15] గాదు వంశంనుండి మాకీ కుమారుడైన గెయువేలు.

[16] ఆ దేశాన్ని చూచి పరిశీలించేందుకు మోషే పంపించిన వారి పేర్లు అవి. (నూను కుమారుడైన హోషేయను మోషే యెహోషువ అని మరో పేరు పెట్టి పిలిచేవాడు.)

[17] కనాను దేశాన్ని కనుక్కొనేందుకు మోషే వారిని పంపించినప్పుడు అతడు ఇలా చెప్పాడు: “నెగెవు ఎడారిలోనుండి వెళ్లండి, తర్వాత ఆ కొండల దేశంలోకి వెళ్లండి.

[18] ఆ దేశం ఎలా ఉందో చూడండి. అక్కడ నివసిస్తున్న ప్రజలనుగూర్చి తెలుసుకోండి. వారు బలవంతులా? బలహీనులా? వారు కొద్ది మందేనా? చాలమంది ఉన్నారా?

[19] వారు నివసిస్తున్న దేశాన్ని గూర్చి తెలుసుకోండి. ఆ భూమి మంచిదా కాదా? వారు నివసించే పట్టణాలు ఎలాంటివి? ఆ పట్టణాలకు గోడలు ఉన్నాయా? ఆ పట్టణాలకు బలీయమైన కాపుదల ఉందా?

[20] ఆ దేశాన్ని గూర్చి ఇతర విషయాలు కూడ తెలుసుకోండి. ఆ భూమి, సారమైనదా కాదా? ఆ భూమి మీద చెట్లు ఉన్నాయా? అక్కడనుండి కొన్ని పండ్లు తీసుకుని రావటానికి ప్రయత్నించండి.” (ద్రాక్ష ప్రథమ ఫలాల కాలం ఇది).

[21] అప్పుడు వారు ఆ దేశాన్ని పరిశీలించి చూసారు. వారు సీను అరణ్యం నుండి రెహోబు, లెబ్రోహమాతు వరకు వెళ్లారు.

[22] నెగెవు ద్వారా ప్రయాణించి హెబ్రోను పట్టణం చేరుకొన్నారు. (ఈజిప్టులోని సోయను పట్టణం కంటె హెబ్రోను ఏడేండ్లు ముందు నిర్మించబడింది.) అక్కడ అహీమాను, షేషయి, తల్మయి నివసించారు. వీరు అనాకీ ప్రజలు.

[23] వాళ్లు ఎష్కోలు లోయలో ఒక ద్రాక్ష కొమ్మ కోసారు. ఆ కొమ్మకు ఒక ద్రాక్ష గెల ఉంది. ఇద్దరు మనుష్యులు ఆ గెలను ఒక కర్రకు కట్టి మోసుకొచ్చారు. కొన్ని దానిమ్మ, అంజూరపు పండ్లు కూడ వారు తెచ్చారు.

[24] అక్కడ ఇశ్రాయేలు మనుష్యులు ద్రాక్ష గుత్తిని కోసినందుచేత ఆ చోటు ఎష్కోలు అని పిలువబడింది.

[25] 40 రోజుల పాటు వారు ఆ దేశాన్ని పరిశీలించారు. అప్పుడు వారు తిరిగి వారి నివాసమునకు వచ్చారు.

[26] ఆ మనుష్యులు కాదేషు దగ్గర మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తిరిగి వచ్చారు. ఇది పారాను అరణ్యంలో ఉంది. అప్పుడు వారు చూచిన విషయాలన్నింటినీ మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలు అందరితో చెప్పారు. వారు ఆ దేశపు పండ్లను వారికి చూపించారు.

[27] ఆ మనుష్యులు మోషేతో ఇలా చెప్పారు: “నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి మేము వెళ్లాము. ఆ దేశం చాలా బాగుంది. అక్కడ పాలు, తేనెలు ప్రవహిస్తున్నాయి! అక్కడ మేము చూచిన పండ్లు ఇవిగో.

[28] కానీ అక్కడ నివసిస్తున్న మనుష్యులు చాలా బలము, శక్తి ఉన్న వాళ్లు. వారి పట్టణాలు బలంగా కాపుదలలో ఉన్నాయి. ఆ పట్టణాలు చాల పెద్దవి. అనాకు కుటుంబానికి చెందిన కొందరు మనుష్యుల్ని కూడ మేము అక్కడ చూశాము.

[29] అమాలేకీ ప్రజలు నెగెవు లోయలో నివసిస్తున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండల ప్రాంతంలో నివసిస్తున్నారు. కనానీ ప్రజలు సముద్రతీర ప్రాంతంలోను, యోర్దాను నదీతీరంలోను నివసిస్తున్నారు.”

[30] అప్పుడు మోషే దగ్గర ఉన్న వాళ్లను నిశ్శబ్దంగా ఉండమన్నాడు కాలేబు. అప్పుడు కాలేబు, “మనం వెళ్లి ఆ దేశాన్ని మనకోసం స్వాధీనం చేసుకోవాలి. తేలికగా మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు” అని చెప్పాడు.

[31] కానీ అతనిలో కూడ వెళ్లినవారు, “ఆ మనుష్యులతో మనం పోరాడలేం. వాళ్లు మనకంటె చాల బలంగలవాళ్లు అన్నారు.

[32] మనం ఆ దేశ ప్రజలను జయించేందుకు తగిన బలవంతులం కాదు” అని ఇశ్రాయేలు ప్రజలందరితో వారు చెప్పారు. వారు ఇలా చెప్పారు: “మేము చూచిన దేశంనిండా బలాఢ్యులు ఉన్నారు. అక్కడికి వెళ్లిన ఎవరినైనాసరే తేలికగా జయించ గలిగినంత బలంగలవాళ్లు వారు.

[33] అక్కడ మేము నెఫీలీ ప్రజలకు చూసాం (నెఫీలీ ప్రజలవాడగు అనాకు సంతానం.) వాళ్ల ముందు నిలబడితే మేము మిడుతల్లా ఉన్నట్టు అనుపించింది. మేమేదో మిడుతలంత చిన్నవాళ్లంగా మమ్మల్ని చూసారు.”

సంఖ్యాకాండము — Chapters