[1] అప్పుడు యాకోబు తన కుమారులందరినీ తన దగ్గరకు పిలిచాడు. అతడు చెప్పాడు: “నా కుమారులందరూ ఇక్కడ నా దగ్గరకు రండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను మీకు చెబతాను.
[2] “యాకోబు కుమారులారా, మీరంతా కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాటలు వినండి.
[3] “రూబేనూ, నీవు మొట్టమొదటి కుమారుడవు. పురుషునిగా నా శక్తికి మొదటి ఋజువు నీవే. నా కుమారులందరిలోను గౌరవించదగిన మహా బలశాలివి నీవు. నీవు నా ప్రథమ సంతానం. నా కుమారులందరిలో నీవు మహా బలవంతుడవు, అతిశయాస్పదమైన వాడవు.
[4] కానీ నీవు ఉద్రేకంతో అదుపుదప్పిన ప్రవాహం వలే ఉన్నావు. కాబట్టి నీవు ఎక్కువ గౌరవించదగిన కుమారుడవు కావు నీ తండ్రికి చెందిన స్త్రీతో నీవు శయనించావు నీ తండ్రి పడకను నీవు ఎక్కావు. నీవు నా పడకకు అవమానం తెచ్చావు.
[5] “షిమ్యోను, లేవీ సోదరులు. తమ ఖడ్గములతో పోరాడటం అంటే వారికి ప్రీతి.
[6] రహస్యమందు వారు చెడు కార్యాలను తలస్తారు. వారి పథకాలలో నా ఆత్మ భాగాన్ని కోరటం లేదు, వారి రహస్య సమావేశాలను నేను అంగీకరించను, వారు వారి పగవారిని కోపంతో చంపారు వారు కేవలం సరదాలకు పశువులకు హాని చేసారు.
[7] వారి కోపం శాపం అది చాల బలీయమయింది. వారికి కోపం వచ్చినప్పుడు వారు చాలా క్రూరులు యాకోబు దేశంలో వారి వంశాలకు వారి స్వంత భూమి వారికి ఉండదు ఇశ్రాయేలు అంతటిలో వారు చెదరి ఉంటారు.
[8] “యూదా, నీ సోదరులు నిన్ను పొగడుదురు. నీవు నీ శత్రువులను ఓడిస్తావు. నీ సోదరులు నీకు సాగిలపడ్తారు.
[9] యూదా సింహంలాంటివాడు. కుమారుడా, తాను చంపిన జంతువు దగ్గర నిలిచిన సింహం వంటి వాడవు నీవు. యూదా సింహంవంటి వాడు. అతడు విశ్రాంతికోసం పండుకొంటాడు. అతణ్ణి లేపుటకు ఎవరూ సాహసించరు.
[10] యూదా వంశపు పురుషులు రాజులుగా ఉంటారు. అతని కుటుంబం పరిపాలిస్తుంది, అనే సూచన అసలైన రాజు వచ్చేంతవరకు అతని కుటుంబాన్ని విడువదు. అప్పుడు అనేక మంది అతనికి విధేయులై అతణ్ణి సేవిస్తారు.
[11] అతడు ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు. అతడు తన బట్టలు ఉదుకుటకు శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు.
[12] ద్రాక్షారసం తాగి అతని కళ్లు ఎరుపెక్కి ఉంటాయి. పాలు తాగి అతని పళ్లు తెల్లగా ఉంటాయి.
[13] “జెబూలూను సముద్రానికి సమీపంగా జీవిస్తాడు. అతని తీరం ఓడలకు క్షేమ స్థలంగా ఉంటుంది. అతని భూమి సీదోను వరకు విస్తరిస్తుంది.
[14] “ఇశ్శాఖారు చాలా ప్రయాసపడిన గాడిదల వలె ఉంటాడు భారమైన బరువు మోసినందుచేత అతడు పండుకొని ఉంటాడు.
[15] అతడు తన విశ్రాంతి స్థలం మంచిదిగా ఉండేటట్టు చూసుకొంటాడు తన భూమి రమ్యమైనదిగా ఉండేటట్టు అతడు చూసుకొంటాడు. తర్వాత అతడు బరువులు మోయుటకు ఒప్పుకొంటాడు. బానిసగా పని చేసేందుకు అతడు ఒప్పుకొంటాడు.
[16] “ఇతర ఇశ్రాయేలు వంశస్థుల్లాగే దాను తన ప్రజలకు తర్పు తీరుస్తాడు.
[17] దారి ప్రక్కన ఉండే పామువలె దాను ఉండునుగాక త్రోవ దగ్గర పొంచి ఉండే కట్లపామువలె అతడు ఉండుగాక. ఆ పాము గుర్రపు మడిమెను కాటు వేస్తుంది. ఆ గుర్రంమీద స్వారీ చేసే మనిషి గుర్రం మీదనుండి పడిపోతాడు.
[18] “యెహోవా, నీ రక్షణకోసం నేను కనిపెట్టకొని ఉన్నాను.
[19] “దొంగల గుంపు గాదు మీద పడ్తారు. కానీ గాదు వారిని తరిమివేస్తాడు.
[20] “ఆషేరు భూమి మంచి ఆహారాన్ని సమృధ్ధిగా పండిస్తుంది ఒక రాజుకు సరిపోయేలాంటి భోజనం అతనికి ఉంటుంది.
[21] “స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు. నఫ్తాలి దాటి అందమైన పిల్లల్లా అతని మాటలు ఉంటాయి.
[22] “యోసేపు చాలా విజయశాలి నీళ్ల ఊట దగ్గర ఎదిగే ద్రాక్షావల్లిలా కంచెమీద అల్లుకొనే ద్రాక్షా తీగెలా అతడు ఫలిస్తాడు
[23] చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రువులయ్యారు.
[24] అయితే తన మహత్తర విల్లుతోను, నైపుణ్యంగల తన చేతులతోను పోరాటం గెల్చాడు అతడు తన శక్తిని యాకోబు యొక్క శక్తిమంతుని నుండి గొర్రెల కాపరినుండి ఇశ్రాయేలు బండనుండి
[25] నీ తండ్రి దేవునినుండి పొందుతాడు. “దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సర్వశక్తిమంతుడగు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! పైన ఆకాశంనుండి ఆశార్వాదములను, అగాధ స్థలముల నుండి ఆశీర్వాదములను ఆయన నీకు అనుగ్రహించుగాక స్తనముల దీవెనలు గర్భపు దీవెనలు ఆయన నీకు ఇచ్చుగాక.
[26] నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేళ్లు జరిగాయి. మరియు నీ తండ్రినైన నేను అంతకంటె ఎక్కువగ ఆశీర్వదించబడ్డాను నీ సోదరులు నీకు ఏమీ లేకుండా నిన్ను విడిచిపెట్టి వేసేందుకు ప్రయత్నించారు అయితే ఇప్పుడు నా ఆశీర్వాదములన్నీ కొండంత ఎత్తుగా నీమీద క్రుమ్మరించబడతాయి.
[27] “బెన్యామీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు ఉదయాన అతడు చంపుకొని తింటాడు మిగిలిన దానిని అతడు సాయంకాలం పంచుకొంటాడు.”
[28] అవి ఇశ్రాయేలు పండ్రెండు కుటుంబాలు. మరియు వారి తండ్రి వారితో చెప్పిన విషయాలు అవి. వారిలో ప్రతి కుమారునికి తగిన ఆశీర్వాదం అతడు వారికి ఇచ్చాడు.
[29] తర్వాత ఇశ్రాయేలు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అతడు ఇలా చెప్పాడు, “నేను మరణించినప్పుడు నా ప్రజలతో ఉండాలని నేను కోరుచున్నాను. హిత్తీయుడగు ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకులతో బాటు పాతిపెట్టబడాలని కోరుతున్నాను.
[30] ఆ గుహ మమ్రే దగ్గర మక్ఫేలా పొలంలో ఉంది. అది కనాను దేశంలో ఉంది. అబ్రాహాము తనను పాతిపెట్టేందుకు స్థలం ఉండాలని ఎఫ్రోను దగ్గర ఆ భూమి కొన్నాడు.
[31] అబ్రాహాము, అతని భార్య శారా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. ఇస్సాకు, అతని భార్య రిబ్కా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. నా భార్య లేయాను నేను ఆ గుహలోనే పాతిపెట్టాను.
[32] హిత్తీ మనుష్యుల దగ్గర కొన్న పొలంలో ఉంది ఆ గుహ.”
[33] యాకోబు తన కుమారులతో మాట్లాడటం ముగించిన తర్వాత అతడు పండుకొని, పడకమీద తన కాళ్లు చాపుకొని మరణించాడు.