Skip to content
Opens in a new window

[1] అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకొన్నాడు. ఆయన కొత్త భార్య పేరు కెతూరా.

[2] కెతూరాకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు పుట్టారు.

[3] యొక్షాను, షేబ, దెదానులకు తండ్రి. అష్షూరు, లెయుమీ మరియు లెతూషీ ప్రజలు దెదాను సంతానము.

[4] మిద్యాను కుమారులు ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. అబ్రాహాము కెతూరా, వివాహం మూలంగా ఈ కుమారులంతా పుట్టారు.

[5] అబ్రాహాము చనిపోక ముందు తన దాసీల కుమారులందరికి అతడు కొన్ని కానుకలు ఇచ్చాడు. ఆ కుమారులను అబ్రాహాము తూర్పునకు పంపాడు. అతడు వారిని ఇస్సాకుకు దూరంగా పంపించి వేసాడు. అప్పుడు అబ్రాహాము తన ఆస్తి సర్వస్వం ఇస్సాకుకు ఇచ్చాడు.

[7] అబ్రాహాము 175 సంవత్సరాలు వయస్సు వరకు జీవించాడు.

[8] అప్పుడు అబ్రాహాము బలము తగ్గిపోయి చనిపోయాడు. సుదీర్ఘ సంతృప్తికర జీవతం అతడు జీవించాడు. అతడు మరణించి తనవారి దగ్గరకు చేర్చబడ్డాడు.

[9] అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు కలసి మక్పేలా గుహలో అతణ్ణి పాతిపెట్టారు. సోహరు కుమారుడు ఎఫ్రోను పొలంలో ఈ గుహ ఉంది. అది మమ్రేకు తూర్పున ఉంది.

[10] హిత్తీ ప్రజల దగ్గర్నుండి అబ్రాహాము కొన్న గుహ ఇదే. అబ్రాహాము తన భార్య శారాతో అక్కడ పాతిపెట్టబడ్డాడు.

[11] అబ్రాహాము చనిపోయిన తరువాత, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. మరియు ఇస్సాకు బేయేర్ లహాయిలోనే నివాసం కొనసాగించాడు.

[12] ఇష్మాయేలు వంశంవారి జాబితా ఇది. అబ్రాహాము హాగరుల కుమారుడు ఇష్మాయేలు. (శారాకు ఈజిప్టు దాసి హాగరు.)

[13] ఇష్మాయేలు కుమారుల పేర్లు ఇవి: మొదటి కుమారుని పేరు సేబాయోతు, తర్వాత కేదారు పుట్టాడు, తర్వాత అద్బయేలు, మిబాశిము,

[14] మిష్మా, దమారమశ్శా,

[15] హదరు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా పుట్టారు.

[16] అవి ఇష్మాయేలు కుమారుల పేర్లు. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత శిబిరం ఉండేది, అదే ఒక చిన్న పట్టణం అయింది. పన్నెండు మంది కుమారులు, వారి స్వంత ప్రజలతో, పన్నెండు మంది యువరాజుల్లా ఉన్నారు.

[17] ఇష్మాయేలు 137 సంవత్సరాలు బతికాడు. తరువాత అతను చనిపోయి, అతని పూర్వీకులతో చేర్చబడ్డాడు.

[18] ఇష్మాయేలు సంతానం వారు ఎడారి ప్రాంతమంతా బసచేసారు. ఈ ప్రాంతం ఈజిప్టు దగ్గర హవీలా, షూరు నుండి ఉత్తరపు చివరన అష్షూరు వరకు విస్తరించి ఉంది. ఇష్మాయేలు సంతానము తరచూ అతని సోదరుని ప్రజలను ఎదుర్కొన్నారు.

[19] ఇస్సాకు కుటుంబం చరిత్ర ఇది. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు.

[20] ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను అతడు వివాహం చేసుకొన్నాడు. రిబ్కా పద్దనరాముకు చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె, అరామీయుడగు లాబానుకు సోదరి.

[21] ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను గర్భవతి కానిచ్చాడు.

[22] రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భంలో కవల పిల్లలు పెనుగులాడారు. రిబ్కా యెహోవాను ప్రార్థించి, “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని అడిగింది.

[23] ఆమెతో యెహోవా చెప్పాడు: “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి. రెండు వంశాల పాలకులు నీలోనుండి పుడతారు. కాని వారు విభజించబడతారు. ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుని సేవిస్తాడు.”

[24] తగిన సమయం రాగానే రిబ్కా కవల పిల్లల్ని కన్నది.

[25] మొదట శిశువు ఎరుపు. వాని చర్మం బొచ్చు అంగీలా ఉంది. కనుక వానికి ఏశావు అని పేరు పెట్టబడింది.

[26] రెండవ శిశువు పుట్టినప్పుడు వాడు ఏశావు మడిమను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కనుక ఆ శిశువుకు యాకోబు అని పేరు పెట్టబడింది. యాకోబు, ఏశావు పుట్టినప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు.

[27] అబ్బాయిలు పెద్దవాళ్లయ్యారు. ఏశావు నిపుణతగల వేటగాడయ్యాడు. బయట పొలాల్లో ఉండటం అంటే అతనికి చాలా ఇష్టం. అయితే యాకోబు నెమ్మదిపరుడు. అతను తన గుడారంలోనే ఉన్నాడు.

[28] ఇస్సాకు ఏశావును చాలా ప్రేమించాడు. ఏశావు వేటాడిన జంతువులను తినటం అతనికి ఇష్టం. కాని రిబ్కాకు యాకోబు మీద ప్రేమ.

[29] ఒకసారి ఏశావు వేటనుండి తిరిగి వచ్చాడు. అతను అలసిపోయి, ఆకలితో బలహీనంగా ఉన్నాడు. యాకోబు వంట పాత్రలో చిక్కుడుకాయలు వండుతున్నాడు.

[30] కనుక ఏశావు, “నేను ఆకలితో నీరసం అయిపోయాను ఆ ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు” అని యాకోబును అడిగాడు. (అందుకే ప్రజలు అతణ్ణి ఏదోం అని పిలిచేవాళ్లు.)

[31] అయితే యాకోబు, “నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని ఈ వేళ నాకు అమ్మివేయాలి” అన్నాడు.

[32] ఏశావు “నేను ఆకలితో దాదాపు చచ్చాను. నేను చనిపోతే, నా తండ్రి ఐశ్వర్యారన్నీ నాకు సహాయపడవు. కనుక నా వాటా నీకు ఇచ్చేస్తాను” అన్నాడు.

[33] కానీ యాకోబు దాన్ని, “నాకు ఇస్తావని ముందు ప్రమాణం చేయాలి” అన్నాడు. కనుక ఏశావు యాకోబుకు ప్రమాణం చేసాడు. తన తండ్రి ఐశ్వర్యంలో తన వాటాను ఏశావు యాకోబుకు అమ్మివేసాడు.

[34] అప్పుడు యాకోబు రొట్టె, భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని, తాగి వెళ్లిపోయాడు. కనుక ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కులను లక్ష్యపెట్ట లేదని వ్యక్తం చేసాడు.

ఆదికాండము — Chapters