Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:23

[1] మనం దేవుని పిల్లలమని అనిపించుకొనేలా తండ్రి మనమీద చూపిన ప్రేమ ఎలాంటిదో చూడండి! ఈ కారణం చేత లోకం మనలను ఎరగదు. ఎందుకంటే అది ఆయనను ఎరగలేదు.

[2] ప్రియ సోదరులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. అయితే మనమిక ఏమవుతామో అది ఇంకా వెల్లడి కాలేదు గాని ఆయన వెల్లడి అయ్యేటప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం గనుక ఆయనలాగా ఉంటామని మనకు తెలుసు.

[3] ఆయన మీద ఈ ఆశాభావం ఉన్న ప్రతి ఒక్కరూ, ఆయన పవిత్రుడై ఉన్నట్టు తనను పవిత్రం చేసుకొంటారు.

[4] అపరాధం చేయడం అభ్యసించే ప్రతి ఒక్కరూ న్యాయం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అపరాధమంటే న్యాయం లేనట్టు ప్రవర్తించడం.

[5] మన అపరాధాలు తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడని మీకు తెలుసు. ఆయనలో అపరాధమేమీ లేదు.

[6] ఆయనలో నిలిచి ఉండే వ్యక్తి ఎవరూ అపరాధం చేస్తూ ఉండరు. అపరాధం చేస్తూ ఉండే వ్యక్తి ఎవరూ ఆయనను చూడలేదు, ఆయనను తెలుసుకోలేదు.

[7] చిన్న పిల్లలారా, మిమ్ములను ఎవరూ తప్పు దారి పట్టించకుండా చూచుకోండి. ఆయన న్యాయవంతుడై ఉన్నట్టు న్యాయంగా ప్రవర్తించే ప్రతి ఒక్కడూ న్యాయవంతుడే.

[8] అపరాధం చేస్తూ ఉండేవాడు అపనింద పిశాచానికి చెందినవాడు. అపనింద పిశాచం మొదటినుంచి పాపం చేస్తూ ఉన్నాడు. అపనింద పిశాచం పనులు నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు.

[9] దేవునివల్ల జన్మించిన వ్యక్తి ఎవరూ అపరాధం చేస్తూ వుండడు. ఎందుకంటే దేవుని విత్తనం అతనిలో నిలిచి ఉంటుంది. అతడు దేవునివల్ల జన్మించినవాడు గనుక అపరాధం చేస్తూ ఉండలేడు.

[10] దీన్నిబట్టి దేవుని పిల్లలెవరో అపనింద పిశాచం పిల్లలెవరో తేటతెల్లమవుతుంది. న్యాయంగా ప్రవర్తించనివాడు దేవునికి చెందినవాడు కాడు. తన సోదరుణ్ణి ప్రేమతో చూడనివాడు కూడా అంతే.

[11] మనం ఒకరినొకరు ప్రేమతో చూడాలి అనేది మొదటినుంచి మీరు విన్న సందేశమే గదా.

[12] మనం కయీనులాగా ఉండకూడదు. అతడు దుర్మార్గుడికి చెందినవాడై తన సోదరుణ్ణి చంపాడు. అతణ్ణి ఎందుకు చంపాడు? తన పనులు చెడ్డవి, తోబుట్టువు పనులు న్యాయమైనవి, అందుచేతే.

[13] సోదరులారా, మీరంటే లోకానికి ద్వేషం ఉంటే ఆశ్చర్యపడకండి.

[14] మనం సోదరులను ప్రేమతో చూస్తున్నాం గనుక మరణంలో నుంచి జీవంలోకి దాటామని మనకు తెలుసు. తన సోదరుణ్ణి ప్రేమతో చూడనివాడైతే మరణంలోనే ఆగిపోతున్నాడు.

[15] తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతి ఒక్కడూ హంతకుడే! ఏ హంతకుడిలోనూ శాశ్వత జీవం లేదని మీకు తెలుసు.

[16] యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణం ధారపోశాడు. ప్రేమ అంటే ఎలాంటిదో దీన్నిబట్టే మనకు తెలుసు. మనమూ సోదరులకోసం మన ప్రాణాలను ధారపోయడానికి బాధ్యతగలవారం.

[17] అయితే ఈ లోకం బ్రతుకుదెరువు గలవాడెవడైనా తన సోదరుడు అక్కరలో ఉండడం చూస్తూ అతనిమీద ఏమీ జాలి చూపకపోతే అతడిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది?

[18] నా చిన్న పిల్లలారా, మాటతో భాషతో గాక వాస్తవంగా, క్రియతో ప్రేమ చూపుదాం.

[19] అలా చేయడంవల్ల మనం సత్యానికి చెందినవారమని మనకు తెలుసు. ఆయన ఎదుట మన హృదయాలను శాంతిపరచుకొంటాం.

[20] మన హృదయం మనమీద నింద మోపుతూ ఉంటే దేవుడు మన హృదయంకంటే అధికుడు. సమస్తమూ ఆయనకు తెలుసు.

[21] ప్రియ సోదరులారా, మన హృదయం మనమీద నింద మోపకపోతే దేవుని సన్నిధానంలో మనకు ధైర్యం ఉంటుంది.

[22] అప్పుడు, ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తూ ఆయనకిష్టమైన వాటిని జరిగిస్తూ ఉండడంచేత, మనం ఏమి అడిగినా సరే అది ఆయన మనకిస్తాడు.

[23] ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు పేరు మీద మనం నమ్మకముంచాలి. ఆయన మనకు ఆజ్ఞాపించినట్టే ఒకరినొకరం ప్రేమతో చూడాలి.

[24] ఆయన ఆజ్ఞలను శిరసావహించేవాడు ఆయనలో నిలిచి ఉంటాడు, ఆయన ఆ వ్యక్తిలో నిలిచి ఉంటాడు. ఆయన మనలో నిలిచి ఉంటున్నాడని ఆయన మనకిచ్చిన తన ఆత్మ ద్వారా మనకు తెలుసు.

1 యోహాను లేఖ — Chapters