Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:29

[1] కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా?

[2] ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు.

[3] ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు?

[4] దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా?

[5] నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు.

[6] ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు.

[7] మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు.

[8] అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి.

[9] చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి బాధ, వేదన కలుగుతాయి.

[10] అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి మహిమ, ఘనత, శాంతిసమాధానాలు కలుగుతాయి.

[11] ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు.

[12] ధర్మశాస్త్రం ఉండి పాపం చేసినవారు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారు కూడా ధర్మశాస్త్రం లేకపోయినా నాశనం అవుతారు.

[13] ధర్మశాస్త్రం వినే వారిని కాదు, దాన్ని అనుసరించి ప్రవర్తించే వారినే దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు.

[14] ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వాభావికంగా ధర్మశాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటే వారికి ధర్మశాస్త్రం లేకపోయినా, తమకు తామే ధర్మశాస్త్రంలాగా ఉంటారు.

[15] అలాటి వారి మనస్సాక్షి కూడా సాక్షమిస్తుంది. వారి ఆలోచనలు వారిపై తప్పు మోపడమో లేక తప్పులేదని చెప్పడమో చేస్తాయి. అలాటివారి హృదయాలపై ధర్మశాస్త్ర సారం రాసినట్టే ఉంటుంది రాసినట్టే ఉంటుంది.

[16] నా సువార్త ప్రకారం దేవుడు యేసు క్రీస్తు ద్వారా మానవుల రహస్యాలను విచారించే రోజున ఈ విధంగా జరుగుతుంది.

[17] నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవుని విషయంలో అతిశయిస్తున్నావు కదా?

[18] ఆయన చిత్తం తెలిసి, ధర్మశాస్త్రంలో ఉపదేశం పొంది ఏది మంచిదో తెలిసి దాన్ని మెచ్చుకొంటావు కదా?

[19] జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలిగిఉండి, “నేను గుడ్డివారికి దారి చూపేవాణ్ణి, చీకటిలో ఉండేవారికి వెలుగు చూపేవాణ్ణి,

[20] బుద్ధిలేని వారిని సరిదిద్దే వాణ్ణి, చిన్న పిల్లలలకు అధ్యాపకుణ్ణి అని” అని నిశ్చింతగా ఉన్నావు కదా?

[21] ఎదుటి మనిషికి ఉపదేశించే వాడివి, నీకు నీవు బోధించుకోవా? దొంగతనం చేయకూడదని చెప్పే నీవే దొంగతనం చేస్తావా?

[22] వ్యభిచారం చేయవద్దని చెప్పే నీవే వ్యభిచారం చేస్తావా? విగ్రహాలను అసహ్యించుకుంటూ నీవే గుడులను దోచుకుంటావా?

[23] ధర్మశాస్త్రంలో గొప్పలు చెప్పుకునే నీవు ధర్మశాస్త్రం మీరి, దేవునికి అవమానం తెస్తావా?

[24] “మిమ్మల్ని బట్టే గదా దేవుని పేరు యూదేతరుల మధ్య దూషణ పాలవుతున్నది?” అని రాసి ఉంది కదా.

[25] నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడివైతే నీకు సున్నతి ప్రయోజనం వర్తిస్తుంది గాని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడివైతే, నీ సున్నతి సున్నతి కానట్టే.

[26] కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తే సున్నతి లేకపోయినా సున్నతి పొందినవాడుగా ఎంచబడతాడు గదా?

[27] సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవాడు, లేఖనాలూ, సున్నతి కలిగి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే నీకు తీర్పు తీరుస్తాడు కదా?

[28] పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు.

[29] అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయానికి చెందింది. అది ఆత్మలో జరిగేదే గాని అక్షరార్ధమైనది కాదు. అలాటి వాణ్ణి మనుషులు కాదు, దేవుడే మెచ్చుకుంటాడు.

రోమీయులకు రాసిన పత్రిక — Chapters