Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:06

[1] కెంక్రేయలో ఉన్న మన సోదరి, సంఘ పరిచారిక అయిన ఫీబేను పవిత్రులకు తగిన విధంగా ప్రభువులో చేర్చుకోండి.

[2] మీ దగ్గర ఆమెకు అవసరమైనది ఏదైనా ఉంటే సహాయం చేయమని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె నాకు, ఇంకా చాలామందికి సహాయం చేసింది.

[3] క్రీస్తు యేసులో నా సహ పనివారు ప్రిస్కిల్లకు, అకులకు నా అభివందనాలు చెప్పండి.

[4] వారు నా ప్రాణం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి తెగించారు. వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘానికి కూడా అభివందనాలు చెప్పండి. నేను ఒక్కడినే కాదు, యూదేతర సంఘాలన్నీ వీరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాయి.

[5] ఆసియలో క్రీస్తుకు మొదటి ఫలం, నాకిష్టమైన ఎపైనెటుకు అభివందనాలు.

[6] మీకోసం అధికంగా కష్టపడిన మరియకు అభివందనాలు.

[7] నాకు బంధువులు, నా తోటి ఖైదీలు అంద్రొనీకు, యూనీయలకు అభివందనాలు. వీరు అపొస్తలుల్లో పేరు పొందినవారు, నాకంటే ముందు క్రీస్తులో విశ్వసించినవారు.

[8] ప్రభువులో నాకు ప్రియమైన అంప్లీయతుకు అభివందనాలు.

[9] క్రీస్తులో మన జత పనివాడైన ఊర్బానుకు, నాకు ఇష్టుడైన స్టాకుకు అభివందనాలు.

[10] క్రీస్తులో యోగ్యుడైన అపెల్లెకు అభివందనాలు. అరిస్టొబూలు కుటుంబానికి అభివందనాలు.

[11] నా బంధువు హెరోదియోనుకు అభివందనాలు. నార్కిస్సు కుటుంబంలో ప్రభువును ఎరిగిన వారికి అభివందనాలు.

[12] ప్రభువులో ప్రయాసపడే త్రుపైనాకు, త్రుఫోసాకు అభివందనాలు. ప్రియమైన పెర్సిసుకు అభివందనాలు. ఆమె ప్రభువులో ఎంతో కష్టపడింది.

[13] ప్రభువు ఎన్నుకున్న రూఫుకు అభివందనాలు, అతని తల్లికి వందనాలు. ఆమె నాకు కూడా తల్లి.

[14] అసుంక్రితు, ప్లెగో, హెర్మే, పత్రొబ, హెర్మా, వారితో కూడా ఉన్న సోదరులకు అభివందనాలు.

[15] పిలొలొగుకు, యూలియాకు, నేరియకు, అతని సోదరికీ, ఒలుంపాకు వారితో కూడా ఉన్న పవిత్రులు అందరికీ అభివందనాలు.

[16] పవిత్రమైన ముద్దుతో ఒకడికొకడు అభివందనాలు చెప్పుకోండి. క్రైస్తవ సంఘాలన్నీ మీకు అభివందనాలు చెబుతున్నాయి.

[17] సోదరులారా, నేను వేడుకునేదేమంటే, మీరు నేర్చుకొన్న బోధకు వ్యతిరేకంగా విభజనలు, ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టి చూడండి. వారికి దూరంగా తొలగిపొండి.

[18] అలాటివారు ప్రభు యేసు క్రీస్తుకు కాదు, తమ కడుపుకే దాసులు. వారు వినసొంపైన మాటలతో, ఇచ్చకాలతో అమాయకులను మోసం చేస్తారు.

[19] మీ విధేయత మంచి ఆదర్శంగా అందరికీ వెల్లడైంది. అందుకు మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషంగా ఉండాలి.

[20] సమాధాన కర్త అయిన దేవుడు త్వరలో సాతానును మీ కాళ్ళ కింద చితకదొక్కిస్తాడు. మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక.

[21] నా సహ పనివాడు తిమోతి, నా బంధువులు లూకియ, యాసోను, సోసిపత్రు మీకు అభివందనాలు చెబుతున్నారు.

[22] ఈ పత్రికను చేతితో రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు అభివందనాలు చెబుతున్నాను.

[23] నాకు, సంఘమంతటికీ ఆతిథ్యమిచ్చే గాయి మీకు అభివందనాలు చెబుతున్నాడు. ఈ పట్టణానికి కోశాధికారి ఎరస్తు, సోదరుడు క్వర్తు, మీకు అభివందనాలు చెబుతున్నారు.

[24] మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక.

[25] యూదేతరులంతా విశ్వాసానికి లోబడేలా, దేవుడు ప్రారంభం నుండి దాచి ఉంచి, ఇప్పుడు వెల్లడి చేసిన రహస్య సత్యం శాశ్వతుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం, ప్రవక్తల ద్వారా వారికి వెల్లడైంది.

[26] నా సువార్త ప్రకారం, యేసు క్రీస్తును గురించిన ప్రవచన ప్రకటన ప్రకారం, దేవుడు మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తిశాలి.

[27] ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి, యేసు క్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్‌.

రోమీయులకు రాసిన పత్రిక — Chapters