Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:24

[1] కాబట్టి బలమైన విశ్వాసం కలిగిన మనం, మనలను మనమే సంతోషపెట్టుకోకుండా, విశ్వాసంలో బలహీనుల లోపాలను భరించాలి.

[2] మన సాటిమనిషికి క్షేమాభివృద్ధి కలిగేలా మనలో ప్రతివాడూ మంచి విషయాల్లో అతణ్ణి సంతోషపరచాలి.

[3] క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. “నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి” అని రాసి ఉన్నట్టు ఆయనకు జరిగింది.

[4] ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం.

[5] మీరు ఒకే మనసుతో ఏక స్వరంతో అందరూ కలిసి, మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచడానికి,

[6] ఓర్పుకు, ఆదరణకు కర్త అయిన దేవుడు క్రీస్తు యేసును అనుసరించి మీ మధ్య ఐకమత్యం కలుగజేయు గాక.

[7] కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే దేవునికి మహిమ కలిగేలా మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి.

[8] నేను చెప్పేదేమిటంటే పితరులకు చేసిన వాగ్దానాల విషయం దేవుడు సత్యవంతుడని నిరూపించడానికీ, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి దేవుని మహిమపరచడానికీ క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు.

[9] దీని గురించి, “ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను” అని రాసి ఉంది.

[10] ఇంకా ఏమని ఉన్నదంటే, “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ,

[11] “యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.”

[12] యెషయా ఇలా అన్నాడు, “యెష్షయిలో నుండి వేరు చిగురు యూదేతరులను ఏలడానికి వస్తాడు. ఆయనలో యూదేతరులు తమ నమ్మకం పెట్టుకుంటారు.”

[13] మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.

[14] సోదరులారా, మీరు మంచివారు, సంపూర్ణ జ్ఞాన సంపన్నులు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగల సమర్థులని నేను గట్టిగా నమ్ముతున్నాను.

[15] అయినా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని మరింత ధైర్యం తెచ్చుకుని రాస్తున్నాను.

[16] ఎందుకంటే యూదేతరులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పవిత్రమై, దేవునికి ఇష్టమయ్యేలా, నేను సువార్త విషయం యాజక ధర్మం జరిగిస్తూ, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి యూదేతరులకు యేసుక్రీస్తు సేవకుడినయ్యాను.

[17] కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని సేవ విషయాల్లో నాకు అతిశయ కారణం ఉంది.

[18] అదేమిటంటే యూదేతరులు లోబడేలా, వాక్కు చేతా, క్రియల చేతా, సూచనల బలం చేతా, అద్భుతాల చేతా, పరిశుద్ధాత్మ శక్తి చేతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాత్రమే తప్ప మరి ఇతర విషయాలు మాట్లాడను.

[19] కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను.

[20] నేను వేరొకడు వేసిన పునాది మీద కట్టకూడదని క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని బహు ఆశతో అలా ప్రకటించాను.

[21] దీన్ని గురించి ఇలా రాసి ఉంది, “ఆయన గూర్చి ఎవరికి సమాచారం అందలేదో వారు చూస్తారు, ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”

[22] ఈ కారణం వల్లనే నేను మీ దగ్గరికి రాకుండా నాకు చాలా సార్లు ఆటంకం కలిగింది.

[23] ఇక ఈ ప్రాంతాల్లో నేను వెళ్ళవలసిన స్థలం మిగిలి లేదు కాబట్టి, అనేక సంవత్సరాలుగా మీ దగ్గరికి రావాలని ఎంతో ఆశతో ఉన్నాను.

[24] కాబట్టి నేను స్పెయిను దేశానికి ప్రయాణించినప్పుడు దారిలో ముందు మిమ్మల్ని చూసి, మీ సహవాసంలో కొద్ది సమయం ఆనందించిన తరువాత, మీరు నన్ను అక్కడికి సాగనంపుతారని ఎదురు చూస్తున్నాను.

[25] అయితే ఇప్పుడు పరిశుద్ధుల పరిచర్య నిమిత్తం యెరూషలేము వెళ్తున్నాను.

[26] ఎందుకంటే యెరూషలేములోని పరిశుద్ధుల్లో పేదల కోసం మాసిదోనియ, అకయ విశ్వాసులు కొంత చందా పంపడానికి ఇష్టపడ్డారు.

[27] అవును, వీరు చాలా ఇష్టంగా ఆ పని చేశారు. నిజానికి వీరు వారికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు వారి ఆధ్యాత్మిక విషయాల్లో భాగం పంచుకున్నారు కాబట్టి శరీర సంబంధమైన విషయాల్లో వారికి సహాయం చేయడం సబబే.

[28] నేను ఈ ఫలాన్ని వారికప్పగించి నా పని ముగించిన తరువాత, మీ పట్టణం మీదుగా స్పెయినుకు ప్రయాణం చేస్తాను.

[29] నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు, క్రీస్తు సంపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.

[30] సోదరులారా, మీరు దేవునికి చేసే ప్రార్థనల్లో నా కోసం నాతో కలిసి పోరాడమని మన ప్రభు యేసు క్రీస్తును బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను.

[31] ఎందుకంటే నేను యూదయలోని అవిధేయుల చేతుల్లో నుండి తప్పించుకోగలిగేలా, యెరూషలేములో చేయవలసిన నా పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమయ్యేలా,

[32] దేవుని చిత్తమైతే నేను సంతోషంతో మీ దగ్గరికి వచ్చి, మీతో కలిసి సేద దీరడానికి వీలు కలిగేలా ప్రార్ధించండి.

[33] సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడుగా ఉండు గాక. ఆమేన్‌.

రోమీయులకు రాసిన పత్రిక — Chapters