Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:24

[1] యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిసమిస్తున్నాడని పరిసయ్యులు విన్నారని ప్రభువుకు తెలిసింది.

[2] నిజానికి యేసు తానే బాప్తిసం ఇవ్వలేదు, ఆయన శిష్యులు ఇస్తూ ఉన్నారు.

[3] అప్పుడు ఆయన యూదయ దేశం నుండి ప్రయాణమై గలిలయ దేశానికి వెళ్ళాడు.

[4] మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది.

[5] అలా ఆయన సమరయలో ఉన్న సుఖారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు.

[6] యాకోబు బావి అక్కడ ఉంది. యేసు ప్రయాణంలో అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం.

[7] ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నీళ్ళు ఇస్తావా?” అని అడిగాడు.

[8] ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు.

[9] ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, “నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?” ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు.

[10] దానికి యేసు, “నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు” అన్నాడు.

[11] అప్పుడా స్త్రీ, “అయ్యా, ఈ బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది?

[12] మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?” అంది.

[13] దానికి యేసు, “ఈ నీళ్ళు తాగే ప్రతి ఒక్కరికీ మళ్ళీ దాహం వేస్తుంది.

[14] కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వారికిచ్చే నీళ్ళు అయితే వారిలో నిత్య జీవానికి ఊరుతూ ఉండే ఊట అవుతాయి” అన్నాడు.

[15] అప్పుడు ఆమె ఆయనతో, “అయ్యా, నీళ్ళు చేదుకోడానికి నేను ఇంత దూరం రానవసరం లేకుండా ఆ నీళ్ళు నాకివ్వు” అంది.

[16] యేసు ఆమెతో, “నువ్వు వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసుకురా” అన్నాడు.

[17] దానికి ఆ స్త్రీ, “నాకు భర్త లేడు” అంది. యేసు ఆమెతో, “‘భర్త లేడని సరిగ్గానే చెప్పావు.

[18] ఎందుకంటే నీకు ఐదుగురు భర్తలున్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు” అన్నాడు.

[19] అప్పుడా స్త్రీ, “అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవి అని నాకు అర్థమౌతున్నది.

[20] మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు. కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందనీ అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలనీ మీరు అంటారు” అంది. అందుకు యేసు ఇలా చెప్పాడు.

[21] “అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము.

[22] మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది.

[23] నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాటివారే కావాలని తండ్రి చూస్తున్నాడు.

[24] దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.”

[25] అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు అని పిలిచే మెస్సీయ వస్తున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు అంతా వివరిస్తాడు” అంది.

[26] అది విని యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అని చెప్పాడు.

[27] ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉండడం చూసి ‘ఎందుకు మాట్లాడుతున్నాడా’ అని ఆశ్చర్యపడ్డారు. కానీ ‘నీకేం కావాలని’ గానీ ‘ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు’ అని గానీ ఎవరూ అడగలేదు.

[28] ఇక ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళింది.

[29] ఆ ఊరి వారితో, “మీరు నాతో వచ్చి నేను చేసిన పనులన్నిటినీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయన క్రీస్తు కాడా?” అంది.

[30] వారంతా ఊరి నుండి బయలు దేరి ఆయన దగ్గరికి వచ్చారు.

[31] ఆలోగా శిష్యులు, “బోధకా, భోజనం చెయ్యి” అని ఆయనను బతిమాలారు.

[32] దానికి ఆయన, “తినడానికి మీకు తెలియని ఆహారం నాకుంది” అని వారితో చెప్పాడు.

[33] “ఆయన తినడానికి ఎవరైనా భోజనం ఏదైనా తెచ్చారా ఏమిటి?” అని శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

[34] యేసు వారిని చూసి, “నన్ను పంపించిన వాని ఇష్టాన్ని చేయడం, ఆయన పని చేసి ముగించడమే నా ఆహారం.

[35] పంట కోయడానికి కోతకాలం రావాలంటే ఇంకా నాలుగు నెలలు ఉన్నాయని మీరు చెబుతారు కదా! మీ తలలెత్తి పొలాలను చూడండి. అవి ఇప్పటికే పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్నాయని మీతో చెబుతున్నాను.

[36] విత్తనాలు చల్లేవాడూ పంట కోసేవాడూ కలసి సంతోషించేలా కోసేవాడు జీతం తీసుకుని శాశ్వత జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు.

[37] ఈ విషయంలో “విత్తనాలు చల్లేది ఒకరు, పంట కోసేది మరొకరు, అనే మాట నిజమే.

[38] మీరు దేని కోసం ప్రయాస పడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు చాకిరీ చేశారు. వారి కష్టఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు” అన్నాడు.

[39] ‘నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు’ అంటూ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ పట్టణంలోని అనేక మంది సమరయులు ఆయనలో విశ్వాసముంచారు.

[40] ఆ సమరయ వారు ఆయన దగ్గరికి వచ్చి తమతో ఉండమని ఆయనను వేడుకున్నారు. కాబట్టి ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నాడు.

[41] ఆయన మాటలు విని ఇంకా చాలా మంది ఆయనలో విశ్వాసముంచారు. వారు ఆ స్త్రీతో, “మేము విశ్వసించింది కేవలం నీ మాట మీదే కాదు.

[42] మేము కూడా ఆయన మాటలు విన్నాం. ఇప్పుడు ఈయన నిజంగా ఈ లోక రక్షకుడని తెలుసుకున్నాం” అన్నారు.

[43] ఆ రెండు రోజులయ్యాక ఆయన గలిలయకు ప్రయాణమై వెళ్ళాడు.

[44] ఎందుకంటే ఏ ప్రవక్తా తన స్వదేశంలో గౌరవం పొందడని ఆయనే స్వయంగా ప్రకటించాడు.

[45] ఆయన గలిలయకు వచ్చినప్పుడు గలిలయులు ఆయనకు స్వాగతం పలికారు. పండగ ఆచరించడం కోసం గలిలయులు కూడా యెరూషలేముకు వెళ్తారు. అక్కడ ఆయన చేసిన పనులన్నీ వారు చూశారు.

[46] యేసు గలిలయలోని కానా అనే ఊరికి వచ్చాడు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చింది ఇక్కడే. అదే సమయంలో కపెర్నహూములో ఒక అధికారి కొడుకు జబ్బుపడి ఉన్నాడు.

[47] యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడనీ వచ్చి బాగుచేయాలనీ ఆయనను వేడుకున్నాడు.

[48] యేసు అతడితో ఇలా అన్నాడు, “సూచనలూ అద్భుతాలూ చూడందే మీరు నమ్మనే నమ్మరు.”

[49] అందుకా అధికారి, “ప్రభూ, నా కొడుకు చావక ముందే రా” అని వేడుకున్నాడు.

[50] యేసు అతడితో, “నువ్వు వెళ్ళు. నీ కొడుకు బతుకుతాడు” అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు వెళ్ళి పోయాడు.

[51] అతడు దారిలో ఉండగానే అతడి సేవకులు ఎదురొచ్చారు. అతని కొడుకు బతికాడని తెలియజేశారు.

[52] “ఏ సమయంలో వాడు బాగవ్వడం ప్రారంభమైంది” అని అతడు వారిని అడిగాడు. వారు, “నిన్న ఒంటి గంటకు జ్వరం తగ్గడం మొదలైంది” అని చెప్పారు.

[53] ‘నీ కొడుకు బతికి ఉన్నాడు’ అని యేసు తనతో చెప్పిన సమయం సరిగ్గా అదేనని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అతడూ, అతని ఇంట్లో అందరూ నమ్మారు.

[54] ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.

యోహాను రాసిన సువార్త — Chapters