Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:56

[1] మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.

[2] ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి.

[3] అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.

[4] తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.

[5] వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి.

[6] యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు.

[7] అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే.

[8] నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు.

[9] నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు.

[10] దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

[11] నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.

[12] జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది.

[13] జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు.

[14] నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు.

[15] నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను.

[16] ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.

[17] నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.

[18] నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.”

[19] ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి.

[20] వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు.

[21] ఇంకొంతమంది, “ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?” అన్నారు.

[22] ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది. అది చలికాలం.

[23] అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా

[24] యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో. “ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహంలో ఉంచుతావు? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు.

[25] అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.

[26] అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు.

[27] నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి.

[28] నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని ఎవరూ నా చేతిలోనుంచి లాగేసుకోలేరు.

[29] వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవరూ వాటిని లాగేసుకోలేరు.

[30] నేను, నా తండ్రి, ఒకటే!”

[31] అప్పుడు యూదులు ఆయనను కొట్టడానికి రాళ్ళు పట్టుకున్నారు.

[32] యేసు వారితో, “తండ్రి నుంచి ఎన్నో మంచి పనులు మీకు చూపించాను. వాటిలో ఏ మంచి పనినిబట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?” అన్నాడు.

[33] అందుకు యూదులు, “నువ్వు మనిషివై ఉండి నిన్ను నీవు దేవుడుగా చేసుకుంటున్నావు. దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాం. మంచి పనులు చేసినందుకు కాదు” అని ఆయనతో అన్నారు.

[34] యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “‘మీరు దేవుళ్ళని నేనన్నాను’ అని మీ ధర్మశాస్త్రంలో రాసి లేదా?

[35] లేఖనం వ్యర్థం కాదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వారిని ఆయన దేవుళ్ళని పిలిస్తే,

[36] తండ్రి పవిత్రంగా ఈ లోకంలోకి పంపినవాడు ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అంటే ‘నువ్వు దేవదూషణ చేస్తున్నావు’ అని మీరు అంటారా?

[37] నేను నా తండ్రి పనులు చెయ్యకపోతే నన్ను నమ్మకండి.

[38] అయితే, నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”

[39] వారు మళ్ళీ ఆయనను పట్టుకోవాలనుకున్నారు గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకున్నాడు.

[40] యేసు మళ్ళీ యొర్దాను నది అవతలికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. యోహాను మొదట బాప్తిసం ఇస్తూ ఉన్న స్థలం ఇదే.

[41] చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. వారు, “యోహాను ఏ సూచక క్రియలూ చేయలేదు గాని ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ నిజమే” అన్నారు.

[42] అక్కడ చాలా మంది యేసుని నమ్మారు.

యోహాను రాసిన సువార్త — Chapters