[1] యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారుడికి మహిమ కలిగించు.
[2] నువ్వు నీ కుమారుడికి అప్పగించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు.
[3] ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం.
[4] నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేసి, భూమి మీద నీకు మహిమ కలిగించాను.
[5] తండ్రీ, ఈ ప్రపంచం ఆరంభానికి ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో, ఇప్పుడు నీ సముఖంలో ఆ మహిమ మళ్లీ నాకు కలిగించు.
[6] లోకంలోనుంచి నువ్వు నాకు అప్పగించిన వారికి నిన్ను వెల్లడి చేశాను. వారు నీ వారు. నువ్వు వారిని నాకు అప్పగించావు. వారు నీ వాక్కు పాటించారు.
[7] నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీ దగ్గర నుంచి వచ్చినవే అని ఇప్పుడు వారికి తెలుసు.
[8] ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన వాక్కులు నేను వారికి ఇచ్చాను. వారు వాటిని స్వీకరించి, నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చాననీ, నీవే నన్ను పంపావనీ నమ్మారు.
[9] “నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకం కోసం కాదు గాని, నువ్వు నాకు అప్పగించిన వారు నీ వారు కాబట్టి, వారి కోసమే ప్రార్థన చేస్తున్నాను.
[10] నావన్నీ నీవి, నీవన్నీ నావి. వారిలో నాకు మహిమ కలిగింది.
[11] నేనింక ఈ లోకంలో ఉండను గాని ఈ ప్రజలు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, నువ్వు నాకిచ్చిన నీ నామాన్ని బట్టి, మనం ఏకంగా ఉన్నట్టే వారూ ఏకంగా ఉండేలా వారిని కాపాడు.
[12] నేను వారితో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నీ నామాన్ని బట్టి వారిని కాపాడాను. లేఖనం నెరవేరేలా, నాశనానికి తగినవాడు తప్ప ఏ ఒక్కరూ నశించకుండా, వారిని సంరక్షించాను.
[13] ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆనందం వారిలో సంపూర్తి కావాలని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెబుతున్నాను.
[14] వారికి నీ వాక్కు ఇచ్చాను. నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే, వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు కాబట్టి ఈ లోకం వారిని ద్వేషించింది.
[15] నువ్వు ఈ లోకంలో నుంచి వారిని తీసుకు వెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు గాని, దుర్మార్గుని నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను.
[16] నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు.
[17] సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం.
[18] “నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపినట్టే, నేను వారిని ఈ లోకంలోకి పంపించాను.
[19] వారు సత్యం ద్వారా పవిత్రులు కావాలని వారి కోసం నన్ను నేను పవిత్రం చేసుకుంటున్నాను.
[20] నువ్వు నన్ను పంపావని లోకం నమ్మేలా, తండ్రీ, నాలో నువ్వు, నీలో నేను ఉన్నట్టే,
[21] వారు మనలో ఏకమై ఉండాలని వారి కోసం మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు. వారి మాటవల్ల నాలో నమ్మకం ఉంచే వారంతా ఏకమై ఉండాలని వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను.
[22] మనం ఏకమై ఉన్నట్టే, వారు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను.
[23] వారిలో నేను, నాలో నువ్వు ఉన్న కారణంగా వారు పరిపూర్ణులుగా ఏకంగా ఉన్న దాన్ని బట్టి, నువ్వు నన్ను పంపావని, నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించావని, లోకం తెలుసుకొనేలా నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చాను.
[24] “తండ్రీ, నేను ఎక్కడ ఉంటానో, నువ్వు నాకిచ్చిన వారు నాతో కూడా అక్కడ ఉండాలని, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే భూమికి పునాది వేయక ముందు నుంచే నువ్వు నన్ను ప్రేమించావు.
[25] నీతిన్యాయాలు గల తండ్రీ, లోకం నిన్ను తెలుసుకోలేదు, కాని నువ్వు నాకు తెలుసు. నువ్వు నన్ను పంపావని వీరికి తెలుసు.
[26] నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ వారిలో ఉండాలనీ, నేను వారిలో ఉండాలనీ, నీ నామాన్ని వారికి తెలియజేశాను. ఇంకా తెలియజేస్తాను.”