[1] ప్రజాసంఖ్యను బట్టి ఇది ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వాళ్ళ లెక్క గురించినది. అంటే ఏర్పాటైన వంతుల విషయంలో ప్రతి సంవత్సరం, ప్రతి నెలా రాజుకు సేవ చేసిన వాళ్ళ గురించినది. వీళ్ళ సంఖ్య ఇరవై నాలుగు వేలు.
[2] మొదటి నెల మొదటి గుంపు మీద జబ్దీయేలు కొడుకు యాషాబాము అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు.
[3] పెరెజు సంతానంలో ఒకడు మొదటి నెలలో సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉన్నాడు.
[4] రెండో నెల వంతు అహోహీయుడైన దోదై, అతని గుంపుదీ అయింది. అతని గుంపులో మిక్లోతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
[5] మూడో నెల యెహోయాదా కొడుకూ, సభాముఖ్యుడైన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరినవాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
[6] ఈ బెనాయా ఆ ముప్ఫై మంది పరాక్రమశాలుల్లో ఒకడై ఆ ముప్ఫైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో అతని కొడుకు అమ్మీజాబాదు ఉన్నాడు.
[7] నాలుగో నెల యోవాబు సహోదరుడు అశాహేలు నాలుగో అధిపతిగా ఉన్నాడు. అతని కొడుకు జెబద్యా అతని తరువాత అధిపతి అయ్యాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
[8] అయిదో నెల ఇశ్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
[9] ఆరో నెల తెకోవీయుడైన ఇక్కేషుకు పుట్టిన ఈరా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
[10] ఏడో నెల ఎఫ్రాయిము సంతతివాడూ, పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
[11] ఎనిమిదో నెల జెరహీయుల బంధువూ, హుషాతీయుడు అయిన సిబ్బెకై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
[12] తొమ్మిదో నెల బెన్యామీనీయుల బంధువూ, అనాతోతీయుడు అయిన అబీయెజెరు అధిపతిగా ఉన్నాడు, అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
[13] పదో నెల జెరహీయుల బంధువూ, నెటోపాతీయుడు అయిన మహరై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
[14] పదకొండో నెల ఎఫ్రాయిము సంతానం వాడూ, పిరాతోనీయుడు అయిన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
[15] పన్నెండో నెల ఒత్నీయేలు బంధువూ, నెటోపాతీయుడు అయిన హెల్దయి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
[16] ఇంకా, ఇశ్రాయేలీయుల గోత్రాల మీద ఉన్నవాళ్ళ వివరం, జిఖ్రీ కొడుకు ఎలీయెజెరు రూబేనీయులకు అధిపతిగా ఉన్నాడు, మయకా కొడుకు షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉన్నాడు,
[17] కెమూయేలు కొడుకు హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉన్నాడు, సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉన్నాడు.
[18] దావీదు సహోదరుల్లో ఎలీహు అనే ఒకడు యూదా వాళ్లకు అధిపతిగా ఉన్నాడు. మిఖాయేలు కొడుకు ఒమ్రీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉన్నాడు,
[19] ఓబద్యా కొడుకు ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉన్నాడు. అజ్రీయేలు కొడుకు యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉన్నాడు.
[20] అజజ్యాహు కొడుకు హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉన్నాడు. మనష్షే అర్థగోత్రం వాళ్లకు పెదాయా కొడుకు యోవేలు అధిపతిగా ఉన్నాడు.
[21] గిలాదులో ఉన్న మనష్షే అర్థగోత్రం వాళ్లకు జెకర్యా కొడుకు ఇద్దో అధిపతిగా ఉన్నాడు. బెన్యామీనీయులకు అబ్నేరు కొడుకు యహశీయేలు అధిపతిగా ఉన్నాడు.
[22] దానీయులకు యెరోహాము కొడుకు అజరేలు అధిపతిగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు.
[23] ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా చెప్పాడు గనుక ఇరవై సంవత్సరాలు మొదలుకుని, అంతకు తక్కువ వయస్సు ఉన్నవాళ్ళను దావీదు ప్రజాసంఖ్యలో చేర్చలేదు.
[24] ప్రజాసంఖ్య చూసే విషయంలో ఇశ్రాయేలీయుల మీదికి ఉగ్రత వచ్చిన కారణంగా సెరూయా కొడుకు యోవాబు దాన్ని చెయ్యడం ఆరంభించాడు గాని దాన్ని ముగించలేదు. కాబట్టి ప్రజాసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంత గ్రంథాల్లో చేర్చలేదు.
[25] రాజు గిడ్డంగుల మీద అదీయేలు కొడుకు అజ్మావెతు నియామకం జరిగింది. అయితే పొలాల్లో, పట్టణాల్లో గ్రామాల్లో, దుర్గాల్లో ఉన్న ఆస్తి మీద ఉజ్జియా కొడుకు యెహోనాతాను నియామకం జరిగింది.
[26] పొలాల్లో పనిచేసే వాళ్ళ మీద, భూమి దున్నే వాళ్ళ మీద కెలూబు కొడుకు ఎజ్రీ నియామకం జరిగింది.
[27] ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమీ, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షామధురసం నిలువ చేసే కొట్ల మీద షిష్మీయుడైన జబ్ది నియామకం జరిగింది.
[28] షెఫేలా ప్రదేశంలో ఉన్న ఒలీవ చెట్ల మీద, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్ హనాను నియామకం జరిగింది. నూనె కొట్ల మీద యోవాషు నియామకం జరిగింది.
[29] షారోనులో మేసే పశువుల మీద షారోనీయుడైన షిట్రయి, లోయల్లో ఉన్న పశువుల మీద అద్లయి కొడుకు షాపాతు నియామకం జరిగింది.
[30] ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు నియామకం జరిగింది.
[31] గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు.
[32] దావీదు పినతండ్రి యోనాతాను వివేకం కలిగిన ఆలోచనకర్తగా ఉన్నాడు గనుక అతన్ని ప్రధానమంత్రిగా నియమించారు. హక్మోనీ కొడుకు యెహీయేలు రాకుమారుల దగ్గర ఉండడానికి నియమించారు.
[33] అహీతోపెలు రాజుకు మంత్రి. అర్కీయుడైన హూషై రాజుకు అంతరంగిక సలహాదారు.
[34] అహీతోపెలు చనిపోయిన తరువాత బెనాయా కొడుకు యెహోయాదా, అబ్యాతారు మంత్రులయ్యారు. రాజు సేనకు యోవాబు సర్వసైన్యాధ్యక్షుడు.