[1] దావీదు సంవత్సరాలు నిండిన వృద్ధుడయ్యాడు. కాబట్టి అతడు తన కొడుకు సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.
[2] ఇంకా అతడు ఇశ్రాయేలీయుల నాయకులందరినీ, యాజకులనూ, లేవీయులనూ సమావేశపరచాడు.
[3] అప్పుడు లేవీయులు ముప్ఫై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్న వాళ్ళను లెక్కలో చేర్చారు. వాళ్ళ సంఖ్య ముప్ఫై ఎనిమిది వేలు.
[4] వాళ్ళల్లో ఇరవై నాలుగు వేలమంది యెహోవా మందిరం పని పర్యవేక్షించే వారుగా, ఆరు వేల మంది అధికారులుగా న్యాయం తీర్చేవారుగా ఉన్నారు.
[5] నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమితులయ్యారు. మరో నాలుగు వేలమందిని దావీదు చేయించిన వాయిద్యాలతో యెహోవాను స్తుతించేవాళ్ళుగా నియమించారు.
[6] వారిని దావీదు గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు, అనే లేవీయుల గుంపులుగా దావీదు భాగించాడు.
[7] గెర్షోనీయుల్లో లద్దాను, షిమీ అనే వాళ్ళు ఉన్నారు. లద్దాను కొడుకులు ముగ్గురు.
[8] వాళ్ళు యెహీయేలు, జేతాము, యోవేలు.
[9] షిమీ కొడుకులు ముగ్గురు. వాళ్ళు షెలోమీతు, హజీయేలు, హారాను. వీళ్ళు లద్దాను వంశానికి నాయకులు.
[10] యహతు, జీనా, యూషు, బెరీయా అనే నలుగురూ షిమీ కొడుకులు.
[11] యహతు పెద్దవాడు, జీనా రెండోవాడు. యూషుకూ బెరీయాకూ కొడుకులు ఎక్కువ మంది లేరు గనుక తమ పూర్వీకుల యింటివారిలో వారిని ఒక్క వంశంగా లెక్కించారు.
[12] కహాతు కొడుకులు నలుగురు. వాళ్ళు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
[13] అమ్రాము కొడుకులు అహరోను, మోషే. అహరోనునూ, అతని కొడుకులనూ నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికీ, యెహోవా సన్నిధిలో ధూపం వెయ్యడానికీ, ఆయన సేవ జరిగించడానికీ, ఆయన పేరునుబట్టి ప్రజలను దీవించడానికీ ప్రత్యేకించారు.
[14] దైవసేవకుడు మోషే సంతతిని లేవి గోత్రం వాళ్ళల్లో లెక్కించారు.
[15] మోషే కొడుకులు గెర్షోము, ఎలీయెజెరు.
[16] గెర్షోము కొడుకుల్లో షెబూయేలు పెద్దవాడు.
[17] ఎలీయెజెరుకు సంతానం రెహబ్యా. అతనికి ఇంకెవ్వరూ కొడుకులు లేరు. అయితే రెహబ్యాకు చాలా మంది కొడుకులున్నారు.
[18] ఇస్హారు కొడుకుల్లో షెలోమీతు పెద్దవాడు.
[19] హెబ్రోను కొడుకుల్లో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండోవాడు, యహజీయేలు మూడోవాడు, యెక్మెయాము నాలుగోవాడు.
[20] ఉజ్జీయేలు కొడుకుల్లో మీకా పెద్దవాడు, యెషీయా రెండోవాడు.
[21] మెరారి కొడుకులు మహలి, మూషి. మహలి కొడుకులు ఎలియాజరు, కీషు.
[22] ఎలియాజరు చనిపోయినప్పుడు అతనికి కూతుళ్ళు ఉన్నారు గాని కొడుకులు లేరు. కీషు కొడుకులూ, వాళ్ళ సహోదరులూ వాళ్ళను పెళ్లి చేసుకున్నారు.
[23] మూషి కొడుకులు ముగ్గురు. వాళ్ళు మహలి, ఏదెరు, యెరీమోతు.
[24] వీళ్ళు తమ పూర్వికుల వంశాల ప్రకారం లేవీయులుగా లెక్కించారు. పూర్వీకుల ఇళ్ళకు పెద్దలైన వీళ్ళు ఇరవై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు గలవారు తమ తమ పేర్ల లెక్క ప్రకారం ఒక్కొక్కరుగా లెక్కకు వచ్చి, యెహోవా మందిరపు సేవ పని చేసేవారయ్యారు.
[25] అప్పుడు దావీదు “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా తన ప్రజలకు నెమ్మది దయచేశాడు గనుక వాళ్ళు నిత్యం యెరూషలేములో నివాసం చేస్తారు.
[26] లేవీయులు కూడా ఇక మీదట గుడారాన్నైనా, దాని సేవకొరకైన ఉపకారణాలనైనా మోసే పని లేదు” అని చెప్పాడు.
[27] దావీదు ఇచ్చిన చివరి ఆజ్ఞను బట్టి లేవీయుల్లో ఇరవై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్నవాళ్ళు లెక్కలోకి వచ్చారు.
[28] వీళ్ళు అహరోను సంతతివాళ్ళ చేతి కింద పనిచెయ్యాలి. వాళ్ళ వశంలో ఉన్న యెహోవా మందిర సేవ కోసం శాలల్లో, గదుల్లో ఉంచిన ప్రతిష్ఠిత వస్తువులు అన్నీ శుద్ధి చెయ్యడానికీ, దేవుని మందిర సేవ కొరకైన పనిని పర్యవేక్షించడానికీ వారు ఉన్నారు.
[29] సన్నిధి రొట్టెలు, నైవేద్యం కోసం కావలసిన మెత్తని పిండి, పులియని అప్పడం, పెనంలో కాల్చిన దాన్నీ, నూనెలో వేయించిన దాన్నీ, నానారకాలైన పరిమాణాల, కొలతల చొప్పున సిద్ధపరచడం వారి పని.
[30] ప్రతిరోజూ ఉదయ సాయంకాలాల్లో యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికీ కొందరు ఉన్నారు. విశ్రాంతి దినాల్లో, అమావాస్యల్లో, పండగల్లో, యెహోవాకు దహనబలులను అర్పించాల్సిన సమయాలన్నిట్లో లెక్క ప్రకారం తమ వంతు ప్రకారం నిత్యం యెహోవా సన్నిధిలో సేవ జరిగించడానికి వారిని నియమించారు.
[31] సమాజపు గుడారాన్ని, పరిశుద్ధ స్థలాన్ని కాపాడడం,
[32] యెహోవా మందిరపు సేవతో సంబంధం ఉన్న పనుల్లో తమ సహోదరులైన అహరోను సంతతి వాళ్లకు సాయం చెయ్యడం, వాళ్లకు నియమించిన పని.