Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:22

[1] ఈ విధంగా వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చి, దావీదు దాని కోసం వేయించిన గుడారం మధ్యలో దాన్ని ఉంచి, దేవుని సన్నిధిలో దహన బలులు, సమాధాన బలులు అర్పించారు.

[2] దహన బలులు, సమాధాన బలులు దావీదు అర్పించడం ముగించిన తరువాత అతడు యెహోవా పేరట ప్రజలను దీవించాడు.

[3] పురుషులైనా, స్త్రీలైనా ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికీ ఒక రొట్టె, ఒక మాంసపు ముద్ద, ఒక ఎండిన ద్రాక్షపళ్ళ గుత్తిని పంచిపెట్టాడు.

[4] అతడు యెహోవా మందసం ముందు సేవ చేస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాను ఘనపరచడానికీ, కృతజ్ఞత చెల్లించడానికీ, ఆయనకు స్తోత్రాలు చెల్లించడానికీ లేవీయుల్లో కొందరిని నియమించాడు.

[5] వాళ్ళల్లో అధిపతి అయిన ఆసాపు, అతని తరువాతి వాడు జెకర్యా, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళు స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయించడానికి నిర్ణయంయామకం జరిగింది. ఆసాపు కంచు తాళాలు వాయించేవాడు.

[6] బెనాయా, యహజీయేలు అనే యాజకులు ఎప్పుడూ దేవుని నిబంధన మందసం ముందు బాకాలు ఊదడానికి నియామకం అయ్యారు.

[7] ఆ రోజు దావీదు మొదటిగా ఆసాపునూ, అతని బంధువులనూ, యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞత అర్పించడానికి ఈ పాట పాడాలని నియమించాడు.

[8] యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన పేరును ప్రకటన చెయ్యండి. ఆయన కార్యాలను ప్రజల్లో తెలియజెయ్యండి.

[9] ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.

[10] ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి. యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక.

[11] యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్ని ఆశ్రయించండి. ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.

[12] ఆయన దాసులైన ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొన్న యాకోబు సంతతి వారలారా,

[13] ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన సూచక క్రియలను ఆయన నోట పలికిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.

[14] ఆయన మన దేవుడు యెహోవా. ఆయన తీర్పులు లోకమంతటా జరుగుతున్నాయి.

[15] ఆయన తను చేసిన నిబంధనను తాను పలికిన ఆజ్ఞలను వెయ్యి తరాలు జ్ఞాపకం ఉంచుకుంటాడు.

[16] ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని మనస్సుకు తెచ్చుకుంటాడు.

[17] యాకోబుకు కట్టడగా ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా ఆయన స్థిరపరిచింది దీనినే.

[18] ఆయన మాట ఇచ్చాడు. “నేను కనాను భూమిని మీకు వారసత్వంగా ఇస్తాను.”

[19] మీరు లెక్కకు కొద్ది మందిగా ఉన్నప్పుడే, అల్ప సంఖ్యాకులుగా, దేశంలో పరాయివారుగా ఉన్నపుడే ఇలా చెప్పాను.

[20] వాళ్ళు జనం నుంచి జనానికి, రాజ్యం నుంచి రాజ్యానికి తిరుగుతున్నప్పుడు,

[21] ఆయన ఎవరినీ వాళ్లకు హాని చేయనివ్వలేదు. వారి నిమిత్తం రాజులను గద్దించాడు.

[22] నేను అభిషేకించిన వాళ్ళను ముట్టవద్దనీ, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనీ చెప్పాడు.

[23] సర్వలోక నివాసులారా, యెహోవాను సన్నుతించండి ప్రతిరోజూ ఆయన రక్షణను ప్రకటించండి.

[24] అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి. సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి.

[25] యెహోవా మహా ఘనత వహించినవాడు. ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు. సమస్త దేవుళ్ళకంటే ఆయన పూజార్హుడు.

[26] జాతుల దేవుళ్ళన్నీ వట్టి విగ్రహాలే. యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు.

[27] ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలం, సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి.

[28] జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి. మహిమను బలాన్నీ యెహోవాకు ఆపాదించండి.

[29] యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి. నైవేద్యాలు చేత పట్టుకుని ఆయన సన్నిధిలో చేరండి. పవిత్రత అనే ఆభరణాలు ధరించుకుని ఆయన ముందు సాగిలపడండి.

[30] భూజనులారా, ఆయన సన్నిధిలో వణకండి. అప్పుడు భూలోకం కదలకుండా ఉంటుంది. అప్పుడది స్థిరంగా ఉంటుంది.

[31] యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి. ఆకాశాలు ఆనందించు గాక. భూమి సంతోషించు గాక

[32] సముద్రం, దాని సంపూర్ణత ఘోషిస్తుంది గాక. పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయి గాక. యెహోవా వస్తున్నాడు.

[33] భూజనులకు తీర్పు చెప్పడానికి యెహోవా వస్తున్నాడు. వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేస్తాయి.

[34] యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. ఆయనను స్తుతించండి.

[35] దేవా మా రక్షకా, మమ్మల్ని రక్షించు. మమ్మల్ని సమకూర్చు.

[36] మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు అని ఆయన్ను బతిమాలుకోండి. ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా యుగాలన్నిట్లో స్తోత్రం పొందుతాడు గాక. ఈ విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించారు.

[37] అప్పుడు మందసం ముందు నిత్యమూ జరగవలసిన అనుదిన సేవ జరిగించడానికి దావీదు అక్కడ యెహోవా నిబంధన మందసం దగ్గర ఆసాపునూ అతని బంధువులనూ నియమించాడు. ఓబేదెదోమునూ, వాళ్ళ బంధువులైన అరవై ఎనిమిదిమందినీ,

[38] యెదూతూను కొడుకు ఓబేదెదోమునూ, హోసానూ ద్వారపాలకులుగా నియమించాడు.

[39] గిబియోనులోని ఉన్నత స్థలం లో ఉన్న యెహోవా గుడారం మీద, అక్కడ ఉన్న బలిపీఠం మీద, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మవిధుల్లో రాసి ఉన్న ప్రకారం,

[40] ఉదయం, సాయంత్రాల్లో ప్రతిరోజూ నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించడానికి అక్కడ అతడు యాజకుడైన సాదోకును, అతని బంధువులైన యాజకులను నియమించాడు.

[41] యెహోవా కృప నిత్యమూ ఉంటుందని ఆయనను స్తుతించడానికి వీళ్ళతోపాటు హేమానునూ, యెదూతూనునూ, పేర్ల క్రమంలో ఉదాహరించిన మరి కొందరిని నియమించాడు.

[42] బాకాలు ఊదడానికి, కంచు తాళాలను వాయించడానికి, దేవుని గూర్చి పాడదగిన పాటలను వాద్యాలతో వినిపించడానికి వీళ్ళల్లో ఉండే హేమానునూ, యెదూతూనునూ అతడు నియమించాడు. ఇంకా యెదూతూను కొడుకులను అతడు ద్వారపాలకులుగా నియమించాడు.

[43] తరువాత ప్రజలందరూ తమతమ ఇళ్ళకు వెళ్లిపోయారు. దావీదు తన ఇంటివాళ్ళను దీవించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.

1 దినవృత్తాంతాలు — Chapters