Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:23

[1] “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అలా చేస్తే ఇతర్లు కూడ మీపై తీర్పు చెబుతారు.

[2] మీరు ఇతర్లపై తీర్పు చెప్పినట్లే ఇతర్లు మీపై కూడా తీర్పు చెబుతారు. మీరు కొలిచిన కొలతతో ఇతర్లు మీకు కొలిచి ఇస్తారు.

[3] “మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు. కాని మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించరెందుకు?

[4] మీ కంట్లో దూలం పెట్టుకొని ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు!’ అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు?

[5] కపటీ! మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయనీ! అప్పుడు నీవు స్పష్టంగా చూడకలిగి, నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును తీయకలుగుతావు.

[6] “పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి. అలా చేస్తే అవి తిరగబడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. ముత్యాలను పందుల ముందు వేయకండి. వేస్తే అవి వాటిని కాళ్ళ క్రింద త్రొక్కి పాడుచేస్తాయి.

[7] “అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది.

[8] ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది.

[9] “రొట్టె నడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా?

[10] లేక చేపనడిగితే పామునెవరైనా యిస్తారా?

[11] దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలోకంలోవున్న మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా యిస్తాడు.

[12] “ప్రతి విషయంలో యితర్లు మీకోసం ఏం చెయ్యాలని మీరు ఆశిస్తారో మీరు యితర్ల కోసం అదే చెయ్యాలి. ఇదే మోషే ధర్మశాస్త్రం యొక్క, ప్రవక్తలు ప్రవచించిన వాటి యొక్క అర్థం.

[13] “నరకానికి వెళ్ళే మార్గము సులభంగా ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలా మంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్ళే మార్గము కష్టంగా ఉంటుంది. దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు. ఇది గమనించి, ఇరుకైన ద్వారాన్నే ప్రవేశించండి.

[15] “కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొఱ్ఱె తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. కాని లోపల క్రూరమైన తోడేళ్ళలా ఉంటారు.

[16] వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షాపండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా?

[17] మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి. పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి.

[18] మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు. పులువు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు.

[19] దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు.

[20] అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు.

[21] “నన్ను ప్రభూ! ప్రభూ! అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారం నడచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు.

[22] ఆ రోజు చాలా మంది నాతో, ‘ప్రభూ! ప్రభూ! నీపేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా? దయ్యాల్ని పారద్రోలలేదా? ఎన్నో అద్భుతాలు చెయ్యలేదా?’ అని అంటారు.

[23] అప్పుడు నేను వాళ్ళతో, ‘మీరెవరో నాకు తెలియదు. పాపాత్ములారా! నా ముందు నుండి వెళ్లిపొండి’ అని స్పష్టంగా చెబుతాను.

[24] “అందువల్ల నా మాటలు విని వాటిని ఆచరించే ప్రతి ఒక్కడూ బండపై తన యింటిని కట్టుకొన్న వానితో సమానము.

[25] ఆ ఇల్లు రాతి బండపై నిర్మించబడింది. కనుక వర్షాలుపడి, వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టినా ఆయిల్లు పడిపోలేదు.

[26] “కాని నా మాటలు విని వాటిని ఆచరించని ప్రతి ఒక్కడూ యిసుకపై తన యింటిని నిర్మించుకొన్న మూర్ఖునితో సమానము.

[27] వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టాయి. ఆ యిల్లు కూలి నేలమట్టమైపోయింది” దాని పతనం భయంకరమైనది.

[28] యేసు చెప్పటం ముగించాడు. ఆయన వాళ్ళ శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలాగ బోధించాడు. కనుక ప్రజలు ఆయన ఉపదేశాలు విని ఆశ్చర్యపడ్డారు.

మత్తయి సువార్త — Chapters