Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:18

[1] బాప్తిస్మము యిచ్చే యోహాను, ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు.

[2] అతడు, “దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించాడు.

[3] ఇతణ్ణి గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పాడు: “‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చెయ్యమని, తిన్నని మార్గాన్ని వెయ్యమని’ ఎడారిలో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది.”

[4] యోహాను ఒంటె వెంట్రుకలతో చెయ్యబడిన వస్త్రాల్ని ధరించి, నడుముకు తోలు దట్టి కట్టుకొని, మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు.

[5] యెరూషలేము నుండి, యూదయ దేశము నుండి యోర్దాను నదీ ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్ళి,

[6] తాము చేసిన పాపాల్ని ఒప్పుకొనే వాళ్ళు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మమునిచ్చేవాడు.

[7] పరిసయ్యులు సద్దూకయ్యులు యోహాను బాప్తిస్మమునిస్తున్న ప్రాంతానికి వచ్చారు. అతడు వాళ్ళను చూసి, “మీరు సర్పసంతానం. దేవుని కోపం నుండి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?

[8] మీరు మారుమనస్సు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి.

[9] ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు గర్వించకండి. ఈ రాళ్ళ నుండి దేవుడు అబ్రాహాముకు సంతానాన్ని సృష్టించ గలడని నేను చెబుతున్నాను.

[10] చెట్ల వేర్ల మీద గొడ్డలి సిద్ధంగా ఉంది. దేవుడు మంచి ఫలమివ్వని చెట్లను నరికి మంటల్లోకి వేస్తాడు.

[11] “మీరు మారుమనస్సు పొందారు కనుక నేను మీకు బాప్తిస్మము నిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నా కన్నా శక్తి కలవాడు! ఆయన చెప్పుల్ని మోయటానికి కూడా నేను తగను. ఆయన మీకు పవిత్రాత్మతో, అగ్నితో, బాప్తిస్మము నిస్తాడు.

[12] తూర్పార బట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును శుభ్రం చేసి తన గోధుమల్ని ధాన్యపు కొట్టులో వేసుకొంటాడు. పొట్టును ఆరని మంటల్లో వేసి కాలుస్తాడు” అని అన్నాడు.

[13] గలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాప్తిస్మము పొందటానికి యొర్దాను నదీ ప్రాంతానికి వచ్చాడు.

[14] కాని యోహాను ఆయనతో, “నీ ద్వారా నేను బాప్తిస్మము పొందాలి కాని, నీవు నా ద్వారా బాప్తిస్మము పొందటానికి రావటమా?” అని అంటూ యేసును ఆపటానికి ప్రయత్నించాడు.

[15] యేసు సమాధానంగా, “ప్రస్తుతానికి ఇది జరుగనివ్వుము. నీతిని నిలబెట్టటానికి మనమిలా చెయ్యటం సమంజసమే!” అని అన్నాడు. దీనికి యోహాను అంగీకరించాడు.

[16] యేసు బాప్తిస్మము పొంది, నీళ్ళ నుండి వెలుపలికి రాగానే అదే క్షణంలో ఆకాశం తెరుచుకొంది. దేవుని ఆత్మ ఒక పాపురంలాగ తన మీదికి రావటం యేసు చూసాడు.

[17] పరలోకంనుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు. ఇతని పట్ల నాకెంతో ఆనందం” అని అన్నది.

మత్తయి సువార్త — Chapters