Skip to content
Opens in a new window

[1] “ఎవరైనా యెహోవాకు ధాన్యార్పణ పెట్టేటప్పుడు అది శ్రేష్ఠమైన పిండిగా ఉండాలి. ఆ వ్యక్తి ఆ పిండిమీద నూనెపోసి, సాంబ్రాణి వేయాలి.

[2] అప్పుడు దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు అతడు తీసుకొని రావాలి. సాంబ్రాణిని, నూనె కలిపిన పిండిలో ఒక గుప్పెడు ఆ వ్యక్తి తీసుకోవాలి. అప్పుడు యాజకుడు బలిపీఠపు అగ్నితో ఆ పిండిని జ్ఞాపకార్థ అర్పణగా దహించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది.

[3] మిగిలిపోయిన ధాన్యార్పణ అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమములు అన్నింటిలో ఇది అతి పవిత్రం.

[4] “పొయ్యిమీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు పెట్టేటప్పుడు అది నూనె కలిపిన శ్రేష్ఠమైన పిండితో చేయబడ్డ పొంగని రొట్టెలు, లేక నూనె రాయబడ్డ పొంగని అప్పడాలు కావాలి.

[5] పెనం మీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు తెస్తే అది నూనెతో కలిపిన పొంగని మంచి పిండి కావాలి.

[6] దానిని నీవు ముక్కలు చేసి, దాని మీద నూనెపోయాలి. అది ధాన్యార్పణ.

[7] నీవు వంట గిన్నెలో వండిన ధాన్యార్పణ తెస్తే అది నూనెతో కలుపబడిన మంచి పిండికావాలి.

[8] “ఈ పదార్థాలతో చేయబడిన ధాన్యార్పణను నీవు యెహోవాకు తీసుకొని రావాలి. నీవు వాటిని యాజకుని దగ్గరకు తీసుకొనివెళ్లాలి, అతడు వాటిని బలిపీఠం మీద ఉంచుతాడు.

[9] ఇది జ్ఞాపకార్థమైన అర్పణ. అది బలిపీఠం మీద దహించబడాలి. అగ్నిమీద అది దహించ బడుతుంది. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.

[10] మిగిలిపోయిన ధాన్యార్పణలు అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమాలలో ఇది అతి పవిత్రం.

[11] “పులిసిన పదార్థం ఉన్న ధాన్యార్పణ ఏదీ మీరు యెహోవాకు తీసుకొని రాకూడదు. పులిసిన పదార్థంగాని, తేనెగాని యెహోవాకు అర్పణగా అగ్నిమీద దహించకూడదు.

[12] మొదటి పంటలో నుండి పులిసిన పదార్థాన్ని, తేనెను యెహోవాకు అర్పణగా మీరు తీసుకొని రావచ్చును. కానీ బలిపీఠం మీద ఇష్టమైన సువాసనగా ఉండేందుకు పులిసిన పదార్థం, తేనె దహించబడకూడదు.

[13] నీవు తీసుకొని వచ్చే ప్రతి ధాన్యార్పణలో ఉప్పు తప్పక వేయాలి. నీవు అర్పించు ధాన్యార్పణలో ఉప్పు వేయవలెను.

[14] “మొదటి పంటలో నుండి నీవు యెహోవాకు ధాన్యార్పణ అర్పిస్తే, వాటిని పేల్చి తీసుకురావాలి. కొత్త ధాన్యం నుండి వాటిని ఒలిచి తీసుకొని రావాలి. ఇది మొదటి పంటలోనుండి నీ కొరకైన ధాన్యార్పణ అవుతుంది.

[15] దానిమీద నూనెను, సాంబ్రాణిని నీవు వేయాలి. అది ధాన్యార్పణ అవుతుంది.

[16] ఒలిచిన ధాన్యాన్ని, నూనెలోనుండి కొంతభాగాన్ని, సాంబ్రాణి మొత్తాన్ని జ్ఞాపకార్థ అర్పణగా యాజకుడు దహించాలి. ఇది యెహోవాకు హోమమైయుండును.

లేవీయకాండము — Chapters