Skip to content
Opens in a new window

[1] మోషేతో యెహోవా ఇలా చెప్పాడు

[2] “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను యెహోవాను, మీ దేవుణ్ణి.

[3] గతంలో మీరు ఈజిప్టులో జీవించారు. ఆ దేశంలో జరిగించిన వాటిని మీరు ఇప్పుడు చేయకూడదు. నేను మిమ్మల్ని కనానుకు నడిపిస్తున్నాను. ఆ ప్రజల ఆచారాలను పాటించవద్దు.

[4] మీరు నా నియమాలకు విధేయులై, నా ఆజ్ఞలను పాటించాలి. ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక.

[5] అందుచేతనే మీరు నా ఆజ్ఞలను నియమాలను పాటించాలి. నా ఆజ్ఞలకు నియమాలకు విధేయుడయ్యే వ్యక్తి జీవిస్తాడు! నేనే యెహోవాను.

[6] “నీ రక్తసంబంధులతో నీవు ఎన్నడూ లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. నేను యెహోవాను.

[7] “నీ తండ్రితో, నీ తల్లితో నీవు ఎన్నడూ లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. ఆమె నీ తల్లి, ఆమెతో నీవు లైంగిక సంబంధము కలిగి ఉండకూడదు.

[8] నీ తండ్రి యొక్క ఏ భార్యతో check brackets (ఆమె నీ తల్లి కానప్పటికీ) నీవు లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. నీ తండ్రి యొక్క ఏ భార్యతోనైనా నీ తండ్రికి మాత్రమే లైంగిక సంబంధాలు ఉండాలి.

[9] “నీ తండ్రి కుమార్తె లేక నీ తల్లి కుమార్తె నీకు సోదరి, ఆమెతో నీకు లైంగిక సంబంధాలు ఉండ కూడదు. నీ సోదరి నీ యింట పుట్టినా, లేక మరోచోట పుట్టినా సరే.

[10] “నీ మనుమరాలితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆ పిల్లలు నీలో ఒక భాగం.

[11] “నీ తండ్రికి తల్లికి ఒక కుమార్తె ఉంటే, ఆమె నీ సోదరి. ఆమెతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు.

[12] “నీ తండ్రి సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధీకురాలు.

[13] నీ తల్లి సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధీకురాలు.

[14] నీ తండ్రి సోదరుని భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. అనగా నీ పినతండ్రి భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ పినతల్లి.

[15] “నీ కోడలితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ కుమారుని భార్య. ఆమెతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు.

[16] “నీ సోదరుని భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. నీ సోదరుడు మాత్రమే తన భార్యతో లైంగిక సంబంధాలు కలిగి ఉండాలి.

[17] “తల్లి, కూతుళ్లతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆ తల్లి మనుమరాలితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఈ మనుమరాలు ఆ తల్లి కుమారుని బిడ్డ కావచ్చు, కుమార్తె బిడ్డ కావచ్చు. ఆమె మనుమరాళ్లు ఆమె రక్తసంబంధీకులు. వారితో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం తప్పు.

[18] “నీ భార్య బతికి ఉండగా, ఆమె సోదరిని నీకు మరో భార్యగా చేసుకోకూడదు. దీని మూలంగా అక్క చెల్లెళ్లు విరోధులవుతారు. నీ భార్య సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు.

[19] “మరియు ఒక స్త్రీకి నెలసరి రక్తస్రావం అవుతున్నప్పుడు, లైంగిక సంబంధాలకోసం నీవు ఆమె చెంతకు పోకూడదు. ఈ సమయంలో ఆమె అపవిత్రంగా ఉంటుంది.

[20] “నీ పొరుగువాని భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. దీని మూలంగా నీవు అపవిత్రం అవుతావు.

[21] “మోలెకు కోసం నీ పిల్లల్లో ఎవరినీ అగ్నిగుండం దాటనియ్యకూడదు. ఒకవేళ నీవు అలా చేస్తే, నీ దేవుని నామం అంటే నీకు గౌరవం లేదని నీవు చూపించినట్టే, నేనే యెహోవాను.

[22] “ఒక స్త్రీతో ఉన్నట్టు పురుషునితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. అది భయంకర పాపం!

[23] “ఏ జంతువుతోను నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. దీని మూలంగా నీవు అపవిత్రం అవుతావు. అలాగే స్త్రీ జంతువుతో లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదు. అది సృష్టి విరుద్ధం!

[24] “అలాంటి వాటిలో దేనిమూలంగాను మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. నేను జనాలను వారి దేశాలనుండి వెళ్లగొట్టి, వారి దేశాలను నేను మీకు యిస్తున్నాను. ఎందుచేతనంటే ఆ ప్రజలు ఆ చెడుకార్యాలు చేసారు.

[25] కనుక దేశం మైలపడిపోయింది. అలాంటి కార్యాలతో ఇప్పుడు దేశం రోగభూయిష్టమయింది. మరియు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం ఇప్పుడు వెళ్లగొడుతుంది!

[26] “కనుక మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలు ఏవీ మీరు చేయకూడదు. ఇశ్రాయేలు పౌరులకు, మీ మధ్య నివసించే ప్రజలకు నియమాలు యివి.

[27] ఆ దేశంలో మీకు ముందు నివసించిన ప్రజలు ఆ భయంకర సంగతులన్నీ జరిగించారు. అందుచేత దేశం మైలపడింది.

[28] మీరూ ఈ పనులు చేస్తే, మీరూ ఆ దేశాన్ని మైల చేస్తారు. మరియు మీకంటె ముందు అక్కడ ఉన్న వాళ్ళను వెళ్ళగొట్టినట్లు అది మిమ్మల్ని కూడ వెళ్ళగొడుతుంది.

[29] ఏ వ్యక్తి గాని ఈ దారుణ పాపాలలో దేనినైనా జరిగిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి.

[30] ఇతరులు ఆ భయంకర పాపాలు చేశారు. కాని మీరు మాత్రం నా ఆజ్ఞలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలేవీ మీరు చేయకూడదు. ఆ భయంకర పాపాలతో మిమ్మల్ని మీరు మైల చేసుకోవద్దు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”

లేవీయకాండము — Chapters