[1] నీవు ఆకాశాలను చీల్చుకొని భూమి మీదికి దిగివస్తే అప్పుడు సమస్తం మారిపోతుంది. పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.
[2] మండుతున్న పొదల్లా, పర్వతాలు అగ్ని జ్వాలల్లో కాలిపోతాయి. నిప్పుమీది నీళ్లలా పర్వతాలు కాగిపోతాయి. అప్పుడు నీ శత్రువులు నిన్ను గూర్చి తెలుసుకొంటారు. అప్పుడు రాజ్యాలన్ని నిన్ను చూడగా భయంతో వణుకుతాయి.
[3] (కానీ నీ ఈ సంగతులు జరిగించాలని మేము నిజంగా కోరటంలేదు. పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.)
[4] నీ ప్రజలు నిజంగా ఎన్నడూ నీ మాట వినలేదు. నీవు చెప్పిన విషయాలను నీ ప్రజలు నిజంగా ఎన్నడూ వినలేదు. నీవంటి దేవుణ్ణి ఏ మనిషీ ఎన్నడూ చూడలేదు. నీవు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు. ప్రజలు సహనంతో నీకొరకు కనిపెట్టివుంటే అప్పుడు నీవు వారికోసం గొప్ప కార్యాలు చేస్తావు.
[5] మేలు చేయటంలో ఆనందించే మనుష్యులతో నీవు ఉన్నావు. నీ జీవన విధానాలను ఆ మనుష్యులు జ్ఞాపకం చేసుకొంటారు. కానీ చూడు, గతంలో మేము నీకు విరోధంగా పాపం చేశాము అందుచేత నీవు మా మీద కోపగించావు.
[6] మేమందరం పాపంతో మైలపడ్డాం. మా “నీతి” అంతా పాత మైల గుడ్డల్లాంటిదే. మేమందరం ఎండిపోయిన ఆకుల్లా ఉన్నాము. మా పాపాలు మమ్మల్ని గాలిలా కొట్టుకుపోయాయి.
[7] మేము నిన్ను ఆరాధించటం లేదు, నీ నామం మేము విశ్వసించలేదు. నిన్ను వెంబడించాలనే సంబరం మాలో ఎవ్వరికీ లేదు. అందుచేత నీవు మా వద్దనుండి తిరిగిపోయావు. మేము పాపంతో నిండిపోయాం గనుక నీ ఎదుట మేము నిస్సహాయులం.
[8] కానీ, యెహోవా, నీవు మా తండ్రివి. మేము మట్టిలాంటి వాళ్లం. నీవు కుమ్మరివి. నీ చేతులే మమ్మల్ని అందర్ని చేశాయి.
[9] యెహోవా, మా మీద ఇంకా కోపంతోనే ఉండకు. మా పాపాలను శాశ్వతంగా జ్ఞాపకం చేసుకోవద్దు. దయచేసి మమ్మల్ని చూడు, మేము నీ ప్రజలము.
[10] నీ పవిత్ర పట్టణాలు శూన్యంగా ఉన్నాయి. ఆ పట్టణాలు ఇప్పుడు అరణ్యాలవలె ఉన్నాయి. సీయోను ఒక అరణ్యం. యెరూషలేము నాశనం చేయబడింది.
[11] మా పవిత్ర ఆలయం అగ్నిచేత కాల్చి వేయబడింది. ఆ ఆలయం మాకు ఎంతో గొప్పది. మా తండ్రులు అక్కడ నిన్ను ఆరాధించారు. మాకు ఉండిన మంచి వస్తువులన్నీ ఇప్పుడు నాశనం చేయబడ్డాయి.
[12] నీవు నీ ప్రేమను ఎన్నటికీ మాకు చూపకుండా ఉంచుతాయా ఈ వస్తువులు? నీవు ఏమీ పలుకకుండనే కొనసాగుతావా? శాశ్వతంగా నీవు మమ్మల్ని శిక్షిస్తావా?