[1] చూడండి, యెహోవా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు. దేశంలోంచి పూర్తిగా సమస్తం యెహోవా శుద్ధి చేస్తాడు. యెహోవా ప్రజలను బలవంతంగా దూరం వెళ్లగొడతాడు.
[2] ఆ కాలంలో సామాన్య ప్రజలు యాజకులు ఒక్కటే, బానిసలు, యజమానులు ఒక్కటే. ఆడ బానిసలు, యజమానురాండ్రు ఒక్కటే. అమ్మేవారు కొనేవారు ఒక్కటే. అప్పు ఇచ్చే వాళ్లు, పుచ్చుకొనే వాళ్లు ఒక్కటే. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీకి తీసుకొనేవారు ఒక్కటే.
[3] ప్రజలంతా దేశంలో నుండి వెళ్లగొట్టబడతారు. సంపద దోచుకోబడుతుంది. యెహోవా ఆదేశించాడు గనుక ఇది జరుగుతుంది.
[4] దేశం ఖాళీగా దుఃఖంగా ఉంటుంది. ప్రపంచం ఖాళీగా బలహీనంగా ఉంటుంది. ఈ దేశంలోని గొప్ప ప్రజానాయకులు బలహీనులు అవుతారు.
[5] దేశంలోని ప్రజలు దేశాన్ని మైల చేసారు. ఇది ఎలా జరిగింది? ప్రజలు దేవుని ఉపదేశాలకు విరోధంగా తప్పుడు పనులు చేశారు. దేవుని చట్టాలకు ప్రజలు విధేయులు కాలేదు. ప్రజలు చాలాకాలం క్రిందట దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నారు. కానీ ఆ ప్రజలే దేవునితో గల ఒడంబడికను ఉల్లంఘించారు.
[6] ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలు తప్పుచేసిన అపరాధులు. అందుచేత దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు. ప్రజలు శిక్షించబడతారు. కొద్దిమంది ప్రజలు మాత్రమే బతుకుతారు.
[7] ద్రాక్ష వల్లులు చస్తున్నాయి. కొత్త ద్రాక్షరసం చెడి పోయింది. గతంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలు విచారంగా ఉన్నారు.
[8] ప్రజలు వారి ఆనందం ప్రదర్శించటం మానివేశారు. ఆనంద ధ్వనులన్నీ ఆగిపోయాయి. సితారా, మృదంగ సంగీత సంతోషం సమసిపోయింది.
[9] ప్రజలు వారి ద్రాక్షరసం తాగేటప్పుడు సంతోషంగా పాటలు పాడారు. మద్యం తాగేవాడికి దాని రుచి ఇప్పుడు చేదుగా ఉంది.
[10] “పూర్తి గందరగోళం” అనేది ఈ పట్టణానికి సరిపోయే మంచి పేరు. పట్టణం నాశనం చేయబడింది. ప్రజలు ఇళ్లలో ప్రవేశించలేరు. ద్వారాలు బంధించబడ్డాయి.
[11] ప్రజలు ఇంకా బజారుల్లో ద్రాక్షరసం కోసం అడుగుతున్నారు. కానీ సంతోషం అంతా పోయింది. ఆనందం దూరంగా తీసుకుపోబడింది.
[12] పట్టణానికి నాశనం మాత్రమే మిగిలింది. చివరికి తలుపులు కూడా చితుక గొట్టబడ్డాయి.
[13] కోతకాలంలో ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు. కానీ చెట్లకు కొన్ని ఒలీవ పండ్లే మిగిలి ఉన్నాయి. రాజ్యాల మధ్య ఈ దేశానికి గూడ అలానే ఉంటుంది.
[14] విడిచి పెట్టబడిన ప్రజలు కేకలు వేయటం మొదలు పెడ్తారు. ప్రజలు సముద్ర ఘోషకంటె గట్టిగా కేకలు వేస్తారు యెహోవా గొప్పతనంవల్ల ప్రజలు సంతోషిస్తారు.
[15] ఆ ప్రజలు అంటారు: “తూర్పు దిశనున్న ప్రజలారా యెహోవాను స్తుతించండి! దూర దేశాల ప్రజలారా, యెహోవాను స్తుతించండి! యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు.”
[16] భూలోకంలో ప్రతి చోటనుండి యెహోవాకు స్తుతి కీర్తనలు మనం వింటాము. ఈ కీర్తనలు మంచి దేవుణ్ణి స్తుతిస్తాయి. కానీ నేనంటాను: “చాలు, నాకు సరిపోయింది! నేను చూస్తున్న సంగతులు భయంకరం. దేశ ద్రోహులు ప్రజలమీద తిరుగబడి వారిని బాధిస్తున్నారు.”
[17] దేశంలో నివసిస్తున్న ప్రజలకు ప్రమాదం నాకు కనబడుతోంది. వారికి భయం, గుంటలు, ఉచ్చులు నాకు కనబడుతున్నాయి.
[18] ప్రమాదాన్ని గూర్చి ప్రజలు వింటారు. వారు భయపడిపోతారు. కొంతమంది ప్రజలు పారిపోతారు. కానీ వారు గుంటల్లో, ఉచ్చుల్లో పడిపోతారు వాళ్లలో కొంతమంది ఆ గుంటల్లో నుండి ఎక్కి బయటపడ్తారు. కానీ వారు మరోఉచ్చులో పట్టుబడతారు. పైన ఆకాశంలో తూములు తెరచుకొంటాయి. వరదలు మొదలవుతాయి. భూమి పునాదులు వణకటం ప్రారంభం అవుతుంది.
[19] భూకంపాలు వస్తాయి. భూమి పగిలి తెరచుకొంటుంది.
[20] లోకంలో పాపాలు చాలా భారంగా ఉన్నాయి. అందుచేత భూమి ఆ భారం కింద పడిపోతుంది. ప్రాచీన గృహంలా భూమి వణుకుతుంది తాగుబోతు వాడిలా భూమి పడిపోతుంది. భూమి ఇక కొనసాగలేదు.
[21] ఆ సమయంలో, పరలోక సైన్యాలకు పరలోకంలోను భూరాజులకు భూలోకంలోను యెహోవా తీర్పు తీరుస్తాడు.
[22] ఎందరెందలో ప్రజలు ఒకటిగా సమావేశం చేయబడతారు. కొంతమంది ప్రజలు గోతిలో బంధించబడ్డారు. వీరిలో కొంతమంది చెరలో ఉన్నారు. కానీ చివరికి, చాలా కాలం తర్వాత వీరికి తీర్పు తీర్చబడుతుంది.
[23] యెహోవా యెరూషలేములో సీయోను కొండమీద రాజుగా పాలిస్తాడు. పెద్దల యెదుట ఆయన మహిమ ఉంటుంది. చంద్రుడు సిగ్గుపడి, సూర్యుడు అవమానం పొందే అంత ప్రకాశమానంగా ఉంటుంది ఆయన మహిమ.