[1] “రండి, మనం తరిగి యెహోవా దగ్గరకు వెళ్దాం. ఆయన మనల్ని గాయపరిచాడు. కాని ఆయనే మనలను బాగుచేస్తాడు. ఆయన మనలను గయపర్చాడు. కాని ఆయనే మనకు కట్టుకడతాడు.
[2] తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు. మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు. అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట జీవించగలం.
[3] మనం యెహోవాను గూర్చి నేర్చుకొందాము. ప్రభువును తెలుసుకొనేందుకు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం. సూర్యోదయం వస్తుందని మనకు తెలిసినట్లే ఆయన వస్తున్నాడని మనకు తెలుసు. యెహోవా వర్షంలాగ మన దగ్గరకు వస్తాడు. నేలను తడిపే వసంతకాలపు వర్షంలాగ ఆయన వస్తాడు.”
[4] “ఎఫ్రాయిమూ, నిన్ను నేను (యెహోవా) ఏమి చేయాలి? యూదా, నిన్ను నేను ఏమి చేయాలి? నీ నమ్మకత్వం ఉదయపు మంచులాగ ఉంది. వేకువనే ఉండకుండా పోయే హిమంలాగ నీ నమ్మకత్వం ఉంది.
[5] నేను ప్రవక్తలను ఉపయోగించి ప్రజల కోసం న్యాయచట్టం చేశాను. నా ఆజ్ఞచేతనే ప్రజలు చంపబడ్డారు. కానీ ఆ నిర్ణయాల మూలంగానే మంచి విషయాలు వస్తాయి.
[6] ఎందుచేతనంటే నాకు కావల్సింది నమ్మకమైన ప్రేమయే. అంతేగాని బలిఅర్పణకాదు. ప్రజలు నన్ను తెలుసుకోవాలని నా కోరిక దహనబలులు తీసుకొని వచ్చేందుకు కాదు.
[7] అయితే ఆదాము చేసినట్టు ప్రజలు నా ఒడంబడికను ఉల్లంఘించారు. వారి దేశంలో వారు నాకు అపనమ్మకంగా ఉన్నారు.
[8] గిలాదు పాపాలు చేసే ప్రజల పట్టణం. ఆ ప్రజలు ఇతరులను ఉపాయం చేసి చంపేశారు.
[9] బందిపోటు దొంగలు దాగుకొని, ఎవరిమీదనైనా పడేందుకు వేచిఉంటారు. అదే విధంగా యాజకులు షెకెము వెళ్లే మార్గంలో పొంచి ఉండి, ఆ మార్గంలో వేళ్లేవారిని వారు చంపుతారు. వారు దుర్మార్గపు పనులు చేశారు.
[10] ఇశ్రాయేలు రాజ్యంలో ఒక దారుణ విషయం నేను చూశాను. ఎఫ్రాయిము దేవునకి అపనమ్మకస్తుడు. ఇశ్రాయేలు తన పాపంతో అశుద్ధమయింది.
[11] యూదా, నీకు కూడా ఒక కోతకాలం ఉంది. బానిసత్వం నుండి నా ప్రజలను నేను వెనుకకు తీసుకొని వచ్చునప్పుడు అది సంభవిస్తుంది.”