[1] “ఇశ్రాయేలు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను (యెహోవా) వానిని ప్రేమించాను. మరియు ఈజిప్టు నుండి నా కుమారుని బయటకు పిలిచాను.
[2] కాని ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను పిలిస్తే అంత ఎక్కువగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టారు. బయలు దేవతలకు ఇశ్రాయేలీయులు బలులు అర్పించారు. విగ్రహాలకు వారు ధూపం వేశారు.
[3] “అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్పింది నేనే! ఇశ్రాయేలీయులను నేను నా చేతులతో ఎత్తు కొన్నాను! నేను వారిని స్వస్థపరిచాను. కాని అది వారికి తెలియదు.
[4] తాళ్లతో నేను వారిని నడిపించాను. కాని అవి ప్రేమ బంధాలు. నేను వారిని విడుదల చేసిన వ్యక్తిలాగవున్నాను. నేను వంగి వారికి భోజనం పెట్టాను.
[5] “ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు మళ్లుకొనుటకు నిరాకరించారు. కనుక వారు ఈజిప్టు వెళ్తారు! అష్షూరు రాజు వారికి రాజు అవుతాడు.
[6] వారి పట్టణాలకు విరోధంగా ఖడ్గం విసరబడుతుంది. బలమైన వారి మనుష్యులను అది చంపుతుంది. వారి నాయకులను అది నాశనం చేస్తుంది.
[7] “నేను తిరిగిరావాలని నా ప్రజలు కోరుకుంటున్నారు. పైనున్న దేవున్ని వాళ్లు వేడుకుంటారు. కాని, దేవుడు వాళ్లకు సహాయం చేయడు.”
[8] “ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకులేదు. ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె. నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు! నిన్ను జెబొయీములాగ చెయ్యాలనీ లేదు! నేను నా మనసు మార్చు కుంటున్నాను, నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.
[9] నేను నా కోపాగ్నిని అణచుకొంటాను. నేను మరోమారు ఎఫ్రాయిమును నాశనం చేయను. నేను మనిషిని కాను, నేను పవిత్రమైన దేవుణ్ణి. నేను నీతోవున్నాను కాబట్టి నేను నీపై నా కోపం చూపను.
[10] నేను సింహంలాగ గర్జిస్తాను. నేను గర్జించగానే, నా బిడ్డలు వచ్చి నన్ను అనుసరిస్తారు. భయంతో కంపిస్తూ నా బిడ్డలు పశ్చిమ దిశ నుంచి వస్తారు.
[11] వాళ్లు ఈజిప్టు నుంచి పక్షుల్లా వణుకుతూ వస్తారు. వాళ్లు అష్షూరు దేశంనుంచి పావురాలవలె కదులుతూ వస్తారు నేను వాళ్లని తిరిగి ఇంట చేరుస్తాను” అని యెహోవా చెప్పాడు.
[12] “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టు ముట్టాడు. ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా తిరిగారు. మరియు వాళ్లు నశింపజేయబడ్డారు! కాని, యూదా యింకా ఎల్-తోనే నడుస్తున్నాడు. యూదా అపవిత్రలకు నమ్మ కస్తుడుగా ఉన్నాడు.”