[1] ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు.
[2] ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు.
[3] ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.
[4] ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు.
[5] క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో, “నీవు నా కుమారుడవు. నేడు నేను నీకు తండ్రినయ్యాను” అని చెప్పి మహిమ పరచెను.
[6] మరొక చోట, ఇలా అన్నాడు: “నీవు మెల్కీసెదెకు వలె చిరకాలెం యాజకుడవై వుంటావు.”
[7] యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు.
[8] యేసు దేవుని కుమారుడైనా, తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో ఉండటం నేర్చుకొన్నాడు.
[9] పరిపూర్ణత పొందాక, తన పట్ల విధేయతగా ఉన్న వాళ్ళందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించ గలవాడయ్యాడు.
[10] దేవుడు మెల్కీ సెదెకు యొక్క క్రమంలో యేసును ప్రధానయాజకునిగా నియమించాడు.
[11] ఈ విషయాన్ని గురించి మేము చెప్పవలసింది ఎంతో ఉంది. కాని మీలో గ్రహించే శక్తి తక్కువగా ఉండటంవల్ల, విడమర్చి చెప్పటానికి చాలా కష్టమౌతుంది.
[12] నిజం చెప్పాలంటే, మీకిదివరకే భోధించి ఉండవలసింది. కాని దైవసందేశంలోని ప్రాథమిక సత్యాలను మీకు మళ్ళీ నేర్పించవలసిన అవసరం కలుగుతోంది. అంటే, మీరు పాలు త్రాగగలరు కాని, ఆహారం తినగల శక్తి మీకింకా కలుగలేదు.
[13] పాలతో జీవించేవాళ్ళు యింకా పసికందులే కనుక వాళ్ళకు మంచి చెడులను గురించి తెలియదు.
[14] కాని, ఆహారం ఎదిగిన వాళ్ళు తినగలుగుతారు. అంటే, వాళ్ళు జీవితానికి అలవాటు పడి మంచి చెడులను గుర్తించటంలో నేర్పు సంపాదించారన్న మాట.