Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:10

[1] పరలోక దేవుని పిలుపులో పాలివారైన సోదరులారా! మీరు పవిత్రత గలవాళ్ళు. మనం బహిరంగంగా విశ్వసిస్తున్న ప్రధాన యాజకుడు, దేవుని అపొస్తలుడు అయినటువంటి యేసు పట్ల మీ మనస్సు లగ్నం చెయ్యండి.

[2] మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాగే యేసు కూడా తనను నియమించిన దేవునియందు నమ్మకస్తుడుగా ఉండెను.

[3] ఇంటికంటే, ఇల్లు కట్టిన వానికి ఎక్కువ గౌరవముంటుంది. అలాగే మోషే కన్నా యేసు ఎక్కువ గౌరవవానికి అర్హుడనిపించుకొన్నాడు.

[4] ఎందుకంటే, ప్రతి ఇంటిని ఎవరో ఒకడు కడతాడు, కాని దేవుడు అన్నిటినీ నిర్మించాడు.

[5] దేవుని ఇల్లంతటిలో మోషే సేవకునిగా విశ్వాసంతో పని చేసాడు. ఆ కారణంగా, చాలా కాలం తర్వాత మోషే జరుగబోవువాటికి సాక్షిగా ఉండెను.

[6] కాని క్రీస్తు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడైన కుమారుడు. మనం అతిశయించే నిరీక్షణ, ధైర్యంను గట్టిగా పట్టుకొన్న వారమైతే మనం ఆయన ఇల్లౌతాం. అందువల్ల మనం అశిస్తున్న దానికోసం, విశ్వాసంతో ధైర్యంగా ఉంటే ఆ యింటికి చెందిన వాళ్ళమౌతాము.

[7] అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు: “ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు. ఆయన సహనాన్ని పరీక్షించారు. కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు.

[9] నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా మీ పూర్వీకులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు.

[10] ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది, ‘వాళ్ళ హృదయాలు పెడదారులు పట్టాయి, నేను చూపిన దారుల్ని వాళ్ళు చూడ లేదు’ అని అన్నాను.

[11] అందుకే, ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వనని కోపంతో ప్రమాణం చేశాను.’”

[12] సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయంకాని, విశ్వాసంలేని హృదయంకాని, మీలో ఉండకుండా జాగ్రత్త పడండి.

[13] ఆ “నేడు” అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీలో మూర్ఖత్వం ఉండదు.

[14] మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం.

[15] ఇంతకు ముందు చెప్పబడినట్లు: “ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు కాని, నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.”

[16] వీళ్ళందరూ ఈజిప్టు దేశంనుండి మోషే పిలిచుకొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్ళే కదా!

[17] నలభై సంవత్సరాలు దేవుడు కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయిన వాళ్ళమీదనే కదా!

[18] “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తించిన వాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా?

[19] వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము.

హెబ్రీయులకు వ్రాసిన లేఖ — Chapters