Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:54

[1] నేను చెప్పేదేమిటంటే వారసుడు చిన్నవానిగా ఉన్నంత కాలం, అతడు ఆస్తికంతా వారసుడైనా అతనికి, బానిసకు వ్యత్యాసం లేదు.

[2] అతని తండ్రి నియమించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుల ఆధీనంలో ఉండవలసిందే.

[3] అదే విధంగా మనము పిల్లలంగా ఉండినప్పుడు ప్రపంచం యొక్క నియమాలకు బానిసలమై జీవించాము.

[4] కాని సరైన సమయం రాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు ఒక స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు.

[5] మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి కలిగించాడు.

[6] మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ “ అబ్బా! తండ్రీ!” అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు.

[7] కనుక మీరు బానిసలు కారు. మీరు దేవుని సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తనకు వారసులను చేసుకొన్నాడు.

[8] ఇదివరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలియదు. కనుక మీరు వట్టి దేవుళ్ళకు బానిసలై జీవించారు.

[9] కాని యిప్పుడు మీకు దేవుడెవరో తెలుసు. లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిస్సారమైన, నిరర్థకమైన ఆ శక్తుల వైపు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు?

[10] మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను యింకా పాటిస్తున్నారు.

[11] మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది.

[12] సోదరులారా! నేను మీలా అయ్యాను. కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధమూ చెయ్యలేదు.

[13] నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది.

[14] నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు. విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతనైనట్లు, నేను యేసు క్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు.

[15] మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను.

[16] నిజం చెప్పటంవల్ల యిప్పుడు నేను మీ శత్రువునయ్యానా?

[17] వాళ్ళు మిమ్మల్ని లోబరచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. మానుండి మిమ్మల్ని వేరు చెయ్యాలని వాళ్ళ ప్రయత్నం. మీరు వాళ్ళను మాత్రమే అనుసరించాలని వాళ్ళ ఉద్దేశ్యం.

[18] ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి.

[19] నా ప్రియమైన బిడ్డలారా! క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకూ నేను మీకోసం మళ్ళీ ఈ ప్రసవవేదనపడ్తూ ఉండవలసిందే.

[20] మీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది.

[21] ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా?

[22] అబ్రాహాముకు ఇద్దరు పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు స్వంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి వుంది.

[23] బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు.

[24] ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ యిరువురు స్త్రీలు రెండు ఒడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక ఒడంబడిక వచ్చింది. దీని వల్ల జన్మించిన వాళ్ళు బానిసలు కావాలని ఉంది. “హాగరు”ను ఆ మొదటి ఒడంబడికతో పోల్చవచ్చును.

[25] అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో కూడా “హాగరు”ను పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు.

[26] కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి.

[27] దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఓ గొడ్రాలా! పిల్లల్ని కననిదానా! ఆనందించు, పురిటి నొప్పులు పడనిదానా! గట్టిగా కేకలు వేయి! ఎందుకనగా భర్త వున్న స్త్రీకన్నా భర్త లేని స్త్రీకి పిల్లలు ఎక్కువ.”

[28] కనుక సోదరులారా! మీరు ఇస్సాకువలే వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు.

[29] ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది.

[30] కాని ధర్మశాస్త్రం ఏమి చెపుతున్నది? “బానిస స్త్రీ కుమారుడు, స్వంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి” అని వ్రాయబడి ఉంది.

[31] సోదరులారా! మనము స్వంత స్త్రీకి జన్మించిన బిడ్డలం. బానిస స్త్రీకి జన్మించిన బిడ్డలం కాము.

గలతీయులకు వ్రాసిన లేఖ — Chapters