[1] మనుష్యుని నుండియైనను, మనుష్యుని ద్వారానైనను కాక, యేసు క్రీస్తు ద్వారాను, ఆయనను మరణములో నుండి లేపిన తండ్రియైన దేవుని ద్వారాను అపొస్తలుడైన పౌలు నుండియు,
[2] మరియు నాతో ఉన్న యితర సోదరుల నుండియు, గలతీయలో ఉన్న సంఘాలకు:
[3] మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని కనికరించి మీకు శాంతి ప్రసాదించుగాక!
[4] ప్రస్తుతం మనము అనుభవిస్తున్న చెడుకాలం నుండి రక్షించటానికి మన పాపాలకోసం క్రీస్తు బలి అయ్యాడు. తద్వారా మన తండ్రియైన దేవుని యిచ్ఛను పూర్తి చేసాడు.
[5] దేవునికి మహిమ చిరకాలం ఉండుగాక! ఆమేన్.
[6] తనలో దయ వుండటం వల్ల దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఆయన్ని యింత త్వరలో వదిలివేయటం, మరొక సువార్తవైపు మళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
[7] నిజానికి మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త లేనేలేదు. కొందరు మిమ్మల్ని కలవరపెట్టటానికి క్రీస్తు సువార్తను మార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు.
[8] నేను గాని, లేక పరలోకం నుండి వచ్చిన దేవదూత గాని మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను ప్రకటిస్తున్నట్లయితే అలాంటి వాడు నిత్యనాశనానికి గురియగుగాక.
[9] మేము యిదివరకు చెప్పినదాన్ని యిప్పుడు నేను మళ్ళీ చెపుతున్నాను. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొక సువార్తను ఎవడైనా మీకు భోధిస్తున్నట్లయితే వాడు నిరంతరము శాపగ్రస్తుడవును గాక!
[10] నేనిప్పుడు మానవుని మెప్పు పొందటానికి ప్రయత్నిస్తున్నానా లేక దేవుని మెప్పునా? మానవుణ్ణి నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మానవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు సేవకుణ్ణి కాదు.
[11] సోదరులారా! నేను ప్రకటించిన సువార్త మానవుడు కల్పించింది కాదు. అది మీరు గమనించాలి.
[12] నేను ఆ సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరూ బోధించనూ లేదు. దాన్ని నాకు యేసు క్రీస్తు తెలియచేసాడు.
[13] నేను యూదునిగా ఎట్లా జీవించానో మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన విషయం మీకు తెలుసు. దాన్ని ఏ విధంగా నాశనం చెయ్యాలని చూసానో మీకు తెలుసు.
[14] నేను యూదునిగా నా వయస్సులో ఉన్న వాళ్ళందరికన్నా చురుకైనవాడను. నా పూర్వీకుల సాంప్రదాయాల విషయంలో నాకు చాలా పట్టుదల ఉంది.
[15] కాని దేవుడు తన దయతో నేను పుట్టినప్పుడే నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. నన్ను పిలిచి తన కూమారుణ్ణి తెలియ చెయ్యటానికి నిశ్చయించుకొన్నాడు.
[16] నేను యూదులు కానివాళ్ళకు తన కుమారుని గూర్చిన సువార్తను బోధించాలని ఆయన ఉద్దేశ్యం. నేనీ విషయంలో మరొక వ్యక్తిని సంప్రదించ లేదు.
[17] నాకన్నా ముందునుండి అపొస్తలులుగా ఉన్న వాళ్ళను చూడటానికి నేను యెరూషలేము కూడా వెళ్ళలేదు. దానికి మారుగా నేను వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి ఆ తర్వాత డెమాస్కసుకు తిరిగి వచ్చాను.
[18] మూడు సంవత్సరాలు గడిచాక పేతురును పరిచయం చేసుకోవటానికి యెరూషలేము వెళ్ళాను. అతనితో పదిహేను రోజులు గడిపాను.
[19] ఆ సమయంలో ప్రభువు సోదరుడైన యాకోబు తప్ప మిగతా అపొస్తలులెవరూ నాకు కనిపించలేదు.
[20] నేను అబద్ధం వ్రాయటంలేదని దేవునిపై ప్రమాణం చేసి చెపుతున్నాను.
[21] ఆ తర్వాత నేను సిరియ, కిలికియ దేశాలకు వెళ్ళాను.
[22] యూదయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలు నన్ను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు.
[23] “ఇదివరలో మన వాళ్ళను హింసించిన వ్యక్తి యిప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు సువార్తను నాశనం చెయ్యాలని చూసాడు” అని యితర్లు అనగా వాళ్ళు విన్నారు.
[24] మరియు నా గురించి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.