Skip to content
Opens in a new window

[1] ఆ తరువాత రెండోసారి యెహోవానుంచి యోనాకు ఈ వాక్కు వచ్చింది:

[2] “నీవు లేచి నీనెవె మహా నగరానికి వెళ్ళి నేను నీకు ఇవ్వబోయే సందేశం దానికి చాటించు.”

[3] యోనా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ శిరసావహించి నీనెవెకు వెళ్ళాడు. ఆ నగరం దేవుని అంచనాలో గొప్పది. అది మూడు రోజుల ప్రయాణమంత పెద్దది.

[4] యోనా నగరంలో రోజు ప్రయాణమంత దూరం వెళ్ళి “ఇంకా నలభై రోజులకు నీనెవె నాశనం అవుతుంది” అంటూ ప్రకటన చేశాడు.

[5] నీనెవె నగరవాసులు దేవుణ్ణి నమ్మారు. ఉపవాసం కోసం సమయం నిర్ణయించి చాటించారు. అందరూ - ఘనులు గానీ అల్పులు గానీ - గోనె పట్ట కట్టుకొన్నారు.

[6] ఆ సంగతి నీనెవె రాజుకు వినబడ్డప్పుడు అతడు సింహాసనం దిగి రాజ వస్త్రాన్ని తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు.

[7] అప్పుడతడు నీనెవెలో ఒక ప్రకటన చేయించాడు: “రాజూ, రాజ మంత్రులూ ఆజ్ఞాపించేదేమంటే, ఎవ్వరూ దేనినీ తినకూడదు, త్రాగకూడదు. పశువులూ ఎద్దులూ గొర్రెలూ మేత మేయకూడదు, అవి కూడా నీళ్ళు త్రాగకూడదు.

[8] మనుషులూ పశువులూ గోనెపట్టతో కప్పబడాలి. అందరూ తమ దుర్మార్గాలను విడిచిపెట్టి దౌర్జన్యం చేయడం మాని మనసారా దేవునికి ప్రార్థన చేయాలి.

[9] ఒకవేళ దేవునికి మనసు కరుగుతుందేమో. ఎవరికి తెలుసు? ఒకవేళ ఆయన జాలిపడి తన కోపాగ్ని చల్లార్చి మనల్ని నాశనం చేయకుండా ఉంటాడేమో.”

[10] నీనెవెవారు ఇలా చేయడం - వారి చెడు ప్రవర్తన వదలిపెట్టడం - చూచి దేవుడు వారిమీద జాలిపడ్డాడు, వారికి చేస్తానన్న కీడు చేయలేదు.

యోనా — Chapters