[1] ఆ చేప కడుపులో ఉండి యోనా తన దేవుడు యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు:
[2] “నా ఆపదలో నేను కంఠమెత్తి యెహోవాకు మొరపెట్టాను. ఆయన నాకు జవాబిచ్చాడు. మృత్యులోకంలో ఉండి సహాయంకోసం నిన్ను ప్రాధేయ పడ్డప్పుడు నా ప్రార్థన అంగీకరించావు.
[3] నీవు నన్ను అగాధంలో సముద్ర గర్భంలో పడవేశావు. ప్రవాహాలు నన్ను ఆవరించాయి. నీ అలలూ తరంగాలూ నన్ను ముంచి వేశాయి.
[4] అప్పుడు నేను నీ సన్నిధానం నుంచి త్రోసి వేయబడ్డాను. అయినా నీ పవిత్రాలయంవైపు తిరిగి చూస్తాను అనుకొన్నాను.
[5] నీళ్ళు నన్ను చుట్టుకోవడం మూలంగా నేను కొనప్రాణంతో ఉన్నాను. అగాధం నన్ను ఆవరించింది. సముద్రం నాచు నా తలకు చుట్టుకొంది.
[6] పర్వతాల పునాదులవరకు నేను దిగాను. నేను ఇంకెన్నడూ పైకి రాకుండా భూమి గడియలు నన్ను మూసివేశాయి. అయితే, నా దేవా, యెహోవా! నీవు నా ప్రాణం నాశనకరమైన అగాధంలో నుంచి పైకి తీసుకువచ్చావు.
[7] నా ప్రాణం కృశిస్తూ ఉంటే, యెహోవా, నిన్ను జ్ఞాపకం చేసుకొన్నాను. నా ప్రార్థన నీ పవిత్ర ఆలయానికీ నీ సన్నిధానానికీ చేరింది.
[8] మోసకరమైన వట్టి విగ్రహాలను పూజించేవాళ్ళు తాము పొందగల అనుగ్రహం వదలివేస్తున్నారు.
[9] నేను నీకే స్తుతిపాట పాడుతూ బలి సమర్పిస్తాను, నేను మొక్కుకొన్నదాన్ని తప్పక చెల్లిస్తాను. రక్షణ యెహోవాదే.”
[10] అప్పుడు యెహోవా ఆ చేపతో ఒక మాట చెప్పాడు. చేప యోనాను ఎండిన నేలమీద కక్కివేసింది.