[1] హగ్గయి ప్రవక్త, ఇద్దో మనుమడైన జెకర్యా ప్రవక్త యూదాలో, జెరుసలంలో ఉన్న యూదులకు, వారికి తోడుగా ఉన్న ఇస్రాయేల్ ప్రజల దేవుని పేర పరవశులై ప్రకటించారు.
[2] అప్పుడు షయల్‌తీయేల్ కొడుకు జెరుబ్బాబెల్, యోజాదాక్ కొడుకు యేషూవ సిద్ధపడి, జెరుసలంలో ఉన్న దేవుని ఆలయాన్ని మళ్ళీ కట్టించడం మొదలు పెట్టారు. దేవుని ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేస్తూ వచ్చారు.
[3] అప్పుడు యూఫ్రటీసునది ఇవతల అధిపతి తత్తెనయి, షెతర్‌బోజనయి, వాళ్ళ సహోద్యోగులు వారిదగ్గరికి వచ్చి ఇలా అడిగారు: “ఈ ఆలయాన్ని కట్టడానికి ఈ గోడ నిలపడానికి ఎవరు మీకు అనుమతి ఇచ్చారు?”
[4] కట్టడాన్ని చేయించిన వారి పేర్లు మేము వాళ్ళతో చెప్పాం.
[5] యూదుల దేవుడు వారి పెద్దలను చూచి కాపాడాడు, గనుక దర్యావేషు చక్రవర్తికి ఈ సంగతి వ్రాసి, అతడి దగ్గరనుంచి జాబు వచ్చే వరకు అధికారులు యూదులను పని చేయకుండా ఆపలేదు.
[6] నది ఇవతల అధిపతి తత్తెనయి షెతర్‌బోజనయి, నది ఇవతల వాళ్ళ సహోద్యోగులైన అధికారులు దర్యావేషు చక్రవర్తికి పంపిన లేఖ నకలు ఇది,
[7] వాళ్ళు అతడికి తెలియజేసిన సంగతి ఇది: “దర్యావేషు చక్రవర్తికి సర్వ క్షేమం ప్రాప్తిస్తుంది గాక!
[8] చక్రవర్తికి మేము తెలియజేయవలసినది ఏమంటే, యూదా ప్రదేశానికి, గొప్ప దేవుని ఆలయం దగ్గరికి వెళ్ళాం. ఆ ఆలయాన్ని వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మిస్తున్నారు, గోడలలో మ్రానులను వేస్తున్నారు. ఆ పని జాగ్రత్తగా జరుగుతూ ఉంది, వాళ్ళ చేతిలో త్వరగా సాగుతూ ఉంది.
[9] ‘ఈ ఆలయాన్ని కట్టడానికి, ఈ గోడ నిలపడానికి ఎవరు మీకు అనుమతి ఇచ్చారు?’ అని మేము అక్కడ ఉన్న పెద్దలను అడిగాం.
[10] వాళ్ళ పేర్లను కూడా అడిగాం.
[11] వాళ్ళు ఇలా జవాబిచ్చారు: ‘మేము భూమ్యాకాశాల దేవుని సేవకులం. చాలా సంవత్సరాల క్రిందట ఇస్రాయేల్‌లో గొప్ప రాజు ఒకడు ఈ ఆలయాన్ని కట్టించి ముగించాడు. ఈ ఆలయాన్ని మేము మళ్ళీ కట్టిస్తూవున్నాం.
[12] మా పూర్వీకులు పరలోక దేవునికి కోపం రేపినందుచేత ఆయన వారిని కల్దీయవాడూ బబులోనురాజూ అయిన నెబుకద్‌నెజరు చేతికి అప్పగించాడు. నెబుకద్‌నెజరు ఈ ఆలయాన్ని నాశనం చేసి ప్రజలను బబులోనుకు తీసుకుపోయాడు.
[13] అయితే బబులోను రాజైన కోరెషు పరిపాలించిన మొదటి సంవత్సరంలో కోరెషురాజు దేవుని ఆలయాన్ని ఇక్కడ తిరిగి కట్టడానికి ఆజ్ఞ జారీ చేశాడు.
[14] అంతేగాక, నెబుకద్‌నెజరు జెరుసలంలో ఉన్న దేవాలయంలోనుంచి బబులోనులో ఉన్న గుడికి తీసుకుపోయిన వెండి బంగారు వస్తువులను కోరెషురాజు బబులోను గుడిలోనుంచి తెప్పించాడు, తాను అధిపతిగా నియమించిన షేష్‌బజ్జరుకు అప్పగించి, ఇలా ఆజ్ఞాపించాడు:
[15] “నీవు ఈ వస్తువులను తీసుకొని, జెరుసలం నగరంలో ఉన్న దేవాలయంలో ఉంచు. దేవుని ఆలయాన్ని దాని స్థలంలో మళ్ళీ కట్టించు.”
[16] అందుచేత ఆ షేష్‌బజ్జరు వచ్చి, జెరుసలంలో దేవుని ఆలయం పునాది వేయించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు దానిని కట్టడం జరుగుతూ ఉంది, గాని పని ఇంకా అయిపోలేదు.
[17] “కనుక చక్రవర్తికి ఇష్టమైతే బబులోనులో ఉన్న రాజుల ఖజానాలో సోదా చేయించి, జెరుసలంలో దేవుని ఆలయాన్ని కట్టడానికి కోరెషు రాజు ఆజ్ఞ జారీ చేశాడో లేదో తెలుసుకోవచ్చు. అప్పుడు చక్రవర్తి ఈ సంగతిని గురించి తన నిర్ణయం మాకు తెలియజేయగలరని మనవి చేస్తున్నాం.”