Skip to content
Opens in a new window

[1] ఎజ్రా ఏడుస్తూ, దేవుని ఆలయం ఎదుట సాష్టాంగపడుతూ, దోషాలు ఒప్పుకొంటూ, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇస్రాయేల్ ప్రజలలో పురుషులూ, స్త్రీలూ చిన్నవాళ్ళూ చాలా పెద్ద గుంపుగా అతని చుట్టూ గుమికూడారు. వారు కూడా భోరున ఏడ్చారు.

[2] అప్పుడు ఏలాం కొడుకులలో ఒకడైన యెహీయేలు కొడుకు షెకనయా ఎజ్రాతో ఇలా అన్నాడు: “ఈ ప్రదేశాలలో ఉన్న పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకొని మేము మా దేవుని మీద ద్రోహం చేశాం. అయినా ఇస్రాయేల్ ప్రజల విషయం ఆశాభావం ఇంకా ఉంది.

[3] గనుక ఈ స్త్రీలందరినీ వాళ్ళ పిల్లలతోపాటు పంపిస్తామని మన దేవుని ఎదుట ఒడంబడిక చేసుకొంటాం. అది నా యజమాని నీ ఆలోచనప్రకారం, మన దేవుని ఆజ్ఞలంటే భయభక్తులు ఉన్నవారి ఆలోచనప్రకారం ధర్మశాస్త్రానుసారంగా జరగాలి.

[4] లెండి! ఈ పని మీ చేతిలో ఉంది. మేము మీకు సాయం చేస్తాం, గనుక ధైర్యం వహించి అలా జరిగించండి.”

[5] అప్పుడు ఎజ్రా లేచి, యాజులలో నాయకులూ, లేవీగోత్రికులూ, ఇస్రాయేల్ ప్రజలందరూ ఆ మాట ప్రకారం చేసేలా వారి చేత ప్రమాణం చేయించాడు. వారు ప్రమాణం చేసినతరువాత,

[6] ఎజ్రా దేవుని ఆలయం ఎదుటనుంచి బయలుదేరి, ఎల్‌యాషీబ్ కొడుకైన యోహానాను గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఉండి, చెరనుంచి వచ్చినవారి అపరాధం కారణంగా దుఃఖిస్తూ ఉన్నాడు. అతడు భోజనమేమీ చేయలేదు. నీళ్ళు త్రాగలేదు.

[7] చెరనుంచి వచ్చినవారందరూ జెరుసలంలో సమకూడాలని యూదా అంతటా జెరుసలం అంతటా ప్రకటన చేశారు.

[8] మూడు రోజులలోపల ఎవడైతే రాకపోతాడో, నాయకులూ పెద్దలూ చేసిన ఏర్పాటు ప్రకారం, వాడి ఆస్తి అంతా జప్తు చేయడమూ, చెరనుంచి వచ్చినవారి సమాజంలో నుంచి వాణ్ణి వెలి వేయడమూ జరుగుతుందని కూడా ప్రకటించారు.

[9] ఆ మూడు రోజులలోపల యూదావారంతా, బెన్యామీనువారంతా జెరుసలంలో సమకూడారు. అది తొమ్మిదో నెల, ఇరవైయో రోజు. ప్రజలంతా దేవుని ఆలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో కూర్చుని ఉన్నారు. సమకూడిన సంగతి కారణంగానూ పెద్ద వాన పడడంవల్లనూ వారు వణకుతూ ఉన్నారు.

[10] ఎజ్రాయాజి లేచి వారితో ఇలా అన్నాడు: “మీరు ద్రోహం చేశారు. పరాయి దేశ స్త్రీలను పెళ్ళిచేసుకొని, ఇస్రాయేల్ ప్రజల అపరాధాన్ని ఎక్కువ చేశారు.

[11] గనుక ఇప్పుడు పూర్వీకుల దేవుడైన యెహోవా సన్నిధిలో మీ అపరాధం ఒప్పుకోండి. ఆయన చిత్తానుసారంగా జరిగించండి. దేశంలో ఉన్న ఇతర జనాలనుంచి, పరాయి స్త్రీలనుంచి వేరుపడి ప్రత్యేకంగా ఉండండి.”

[12] అందుకు, సమకూడిన వారంతా అతనితో బిగ్గరగా చెప్పారు “సరే నీవు చెప్పినట్టే మేము చేయాలి.

[13] అయితే సమకూడిన ప్రజలు చాలామంది. ఇది వర్షకాలం. మేము బయట నిలబడి ఉండలేము. అదిగాక, ఈ పని ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదు. ఈ విషయంలో మాలో చాలామంది అపరాధం చేశారు.

[14] మన నాయకులు సమాజమంతటి కోసం ప్రతినిధులుగా ఉండాలి. మన ఊళ్ళలో ఎవరెవరైతే పరాయిదేశ స్త్రీలను పెండ్లి చేసుకొన్నారో వాళ్ళంతా నిర్ణీతకాలంలో రావాలి. వాళ్ళ ఊళ్ళ పెద్దలూ న్యాయాధిపతులూ వాళ్ళతోకూడా రావాలి. ఈ సంగతి కారణంగా మన మీదికి వచ్చిన దేవుని తీవ్ర కోపం తొలగిపోయేవరకు ఇలా జరగాలి.”

[15] అశాహేల్ కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యాహజియా మాత్రమే ఆ మాటను వ్యతిరేకించారు. మెషుల్లాం, లేవీవాడైన షబ్బెతయి వాళ్ళకు తోడ్పడ్డారు.

[16] చెరనుంచి వచ్చినవారు ఆ ఏర్పాటుప్రకారం చేశారు. ఎజ్రాయాజి, పూర్వీకుల వంశాల నాయకులను కొందరిని పేర్ల ప్రకారం ఎన్నుకొన్నాడు. పదో నెల మొదటి రోజున ఆ విషయాన్ని పరిశీలన చేయడానికి వారు సభగా కూడారు.

[17] పరాయి దేశ స్త్రీలను పెండ్లి చేసుకొన్న వారందరి సంగతి మొదటి నెల మొదటి రోజున వారు ముగించారు.

[18] యాజుల వంశాలలో పరాయి దేశ స్త్రీలను పెండ్లి చేసుకొన్న వారెవరంటే, యోజాదాక్ కొడుకు యేషూవ వంశంలో, అతని సోదరులలో మయశేయా, ఎలియాజరు, యారీబ్, గెదలయా

[19] (వారు భార్యలను పంపివేస్తామని మాట ఇచ్చారు. తాము అపరాధులు కావడంచేత అపరాధంకోసం మందలో ఒక పొట్టేలును అర్పించారు);

[20] ఇమ్మేరు వంశంలో హనానీ, జెబదయా;

[21] హారీం వంశంలో మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయెల్, ఉజ్జియా;

[22] పషూరు వంశంలో ఎల్ యోయేనయి, మయశేయా, ఇష్మాయేల్, నెతనేల్, జోజాబాదు, ఎల్‌యాశా,

[23] లేవీగోత్రికులలో యోజాబాదు, షిమీ, కెలిథా (అంటే కెలాయా), పెతహయా, యూదా, ఎలియాజరు,

[24] గాయకులలో ఎల్‌యాషీబ్‌; ద్వారపాలకులలో షల్లూం, తేలెం, ఊరి.

[25] మిగతా ఇస్రాయేల్ ప్రజలలో వీరు ఉన్నారు: పరోషు వంశంలో రమయా, యిజ్జియా, మల్కీయా, మియామీను, ఎలియాజరు, మిల్కియా, బెనాయా;

[26] ఏలాం వంశంలో మత్తనయా, జెకర్యా, యెహీయేల్, అబ్దీ, యెరేమోతు, ఏలీయా;

[27] జత్తూ వంశంలో ఎల్‌యోయేనై, ఎల్‌యాషీబ్, మత్తనయా, యెరేమోతు, జాబాదు, అజీజా;

[28] బేబయి వంశంలో యెహోహానాను, హననయా, జబ్బయి, అత్లాయి;

[29] బానీ వంశంలో యెషూల్లాం, మల్లూకు, అదాయా యాషూబ్, షెయాల్, రామోతు;

[30] పహత్‌మోయాబు వంశంలో అద్నా, కెలాల్, బెనాయా, మయశేయా, మత్తనయా, బసెలేల్, బిన్నూయి, మనష్షే;

[31] హరీం వంశంలో ఎలియాజరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా, షిమియోను,

[32] బెన్యామీను, మల్లూకు, షెమరయా

[33] హాషుం వంశంలో మెత్తనయి, మత్తాత్తా, జాబాదు, ఎలీపలెటు, యెరేమయి, మనష్షే, షిమీ;

[34] బానీ వంశంలో మయదయి, అమ్రాం, ఊయేల్‌;

[35] బెనాయా, బేదయా, కెలూహు,

[36] వనయా, మెరేమోదతు, ఎల్‌యాషీబు,

[37] మత్తనయా, మత్తెనయి, యాశావు,

[38] బానీ, బిన్నూయి, షిమీ,

[39] షెలెమయ, నాతాను, ఆదాయా,

[40] మక్నద్భయి, షాషయి, షారాయి

[41] ఆజరేల్, షెలెమయా, షెమరయా,

[42] షల్లూం, అమరయా యోసేపు;

[43] నెబో వంశంలో యెహీయేల్, మత్తితయా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేల్, బెనాయా.

[44] వీరందరూ పరాయిదేశ స్త్రీలను పెండ్లి చేసుకొన్నవారు. ఆ స్త్రీలలో కొంతమంది పిల్లలను కన్నారు కూడా.

ఎజ్రా — Chapters