[1] చక్రవర్తి, హామాను ఎస్తేరురాణి దగ్గరికి విందుకు వచ్చారు.
[2] ఆ రెండో రోజున విందులో ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నప్పుడు చక్రవర్తి “ఎస్తేరురాణీ! నీ విజ్ఞాపనం ఏమిటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగంవరకు నీకిస్తాను” అని ఎస్తేరుతో చెప్పాడు.
[3] అప్పుడు ఎస్తేరురాణి ఇలా జవాబిచ్చింది: “చక్రవర్తీ, నేను మీ దయకు పాత్రురాలినని మీరు అనుకొంటే, చక్రవర్తికి ఇష్టమైతే నా ప్రాణాన్ని దక్కించండి – నా విజ్ఞాపనం అదే. నా ప్రజలను రక్షించండి. నా మనవి అదే.
[4] నేనూ, నా ప్రజలూ సంహారానికీ హత్యకూ సమూలనాశనానికీ అమ్ముడు పోయినవాళ్ళం. మేము దాసదాసీలుగా అమ్మబడినా నేను మౌనం వహించివుండేదానినే. ఆ బాధ కారణంగా చక్రవర్తిని శ్రమ పెట్టడం తగదు గదా.”
[5] అందుకు అహష్‌వేరోషు చక్రవర్తి “ఆ విధంగా చేయడానికి తెగించినవాడెవడు? వాడేడీ?” అని ఎస్తేరురాణిని అడిగాడు.
[6] ఎస్తేరు “మా శత్రువు, మా పగవాడు ఈ దుర్మార్గుడైన హామాను” అని చెప్పింది. ఆ మాట విని హామానుకు చక్రవర్తి, రాణి ఎదుట చాలా భయం వేసింది.
[7] చక్రవర్తి కోపంతో మండిపడి, ద్రాక్షరసం త్రాగడం మాని, భవనం తోటకు వెళ్ళాడు. చక్రవర్తి వల్ల తనకు హాని తప్పదని గ్రహించి హామాను ఎస్తేరురాణి ఎదుట తన ప్రాణం కోసం విన్నవించుకోవడానికి ఉండిపోయాడు.
[8] భవనం తోటనుంచి విందుశాలకు చక్రవర్తి తిరిగి రావడంతోనే ఎస్తేరు కూర్చుని ఉన్న తల్పంమీద హామాను పడుతూ ఉన్నాడు. అది చూచి చక్రవర్తి “నేను ఇంట్లో ఉండగానే వీడు రాణిని బలవంతం చేస్తాడా?” అని చెప్పాడు. ఆ మాట చక్రవర్తి నోట రాగానే బంటులు హామాను ముఖాన్ని కప్పారు.
[9] చక్రవర్తికి సేవ చేసే నపుంసకులలో హర్‌బోనా అనేవాడు ఇలా అన్నాడు: “చిత్తగించండి. హామాను ఇంటిదగ్గర యాభై మూరల ఎత్తు గల ఉరికొయ్య ఉంది. చక్రవర్తి మేలు కోసం మాట్లాడిన మొర్‌దెకయిని ఉరితీయడానికి దానిని హామాను చేయించాడు.” చక్రవర్తి “దాని మీద హామానును ఉరి తీయండి” అని ఆజ్ఞ జారీ చేశాడు.
[10] హామాను మొర్‌దెకయిని ఉరి తీయడానికి సిద్ధం చేసిన ఉరికొయ్యమీద వాళ్ళు హామానునే ఉరితీశారు. అప్పుడు చక్రవర్తికి కోపాగ్ని చల్లారింది.