[1] మూడో రోజున ఎస్తేరు రాణుల అలంకారాలు ధరించుకొని, రాజభవనంలోపలి ఆవరణంలోకి వెళ్ళి, దర్బారు ఎదుట నిలుచుంది. చక్రవర్తి దర్బారులో ద్వారానికి ఎదురుగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.
[2] ఎస్తేరురాణి లోపలి ఆవరణంలో నిలబడి ఉండడం కనిపించినప్పుడు ఆమెను చక్రవర్తి దయ చూశాడు, తన చేతిలో ఉన్న బంగారు రాజదండం ఆమెవైపు చాపాడు. ఎస్తేరు అతనిదగ్గరికి వచ్చి రాజదండం కొనను తాకింది.
[3] అప్పుడు చక్రవర్తి “ఎస్తేరురాణీ, నీకేం కావాలి? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగంవరకు నీకిస్తాను” అని ఆమెతో చెప్పాడు.
[4] అందుకు ఎస్తేరు “చక్రవర్తికి ఇష్టమయితే, చక్రవర్తి కోసం నేను సిద్ధం చేయించిన విందుకు చక్రవర్తి హామానుతో కూడా ఈ రోజు రావాలని కోరుతున్నాను” అని జవాబిచ్చింది.
[5] చక్రవర్తి “ఎస్తేరు చెప్పినట్టు చేస్తాం. వెంటనే హామానును తీసుకురండి” అని ఆజ్ఞ జారీ చేశాడు. ఎస్తేరు సిద్ధం చేయించిన విందుకు చక్రవర్తి, హామాను వచ్చారు.
[6] విందులో ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నప్పుడు చక్రవర్తి “నీ విజ్ఞాపనం ఏమిటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగంవరకు నీకు ఇస్తాను” అని ఎస్తేరుతో చెప్పాడు.
[7] ఎస్తేరు ఇలా జవాబిచ్చింది: “నా మనవి, నా విజ్ఞాపనం ఏమిటంటే,
[8] చక్రవర్తి నన్ను దయ చూస్తూఉంటే, నా మనవి, నా విజ్ఞాపనం ప్రకారం చేయడం చక్రవర్తికి ఇష్టమైతే చక్రవర్తి కోసం, హామానుకోసం నేను చేయించబోయే విందుకు రేపు రావాలి. అప్పుడు చక్రవర్తి చెప్పినట్టు నా విన్నపం తెలియజేస్తాను.”
[9] ఆ రోజు హామాను సంతోషంతో బయలుదేరాడు. అతడి మానసిక స్థితి బాగానే ఉంది. కానీ, చక్రవర్తి ద్వారందగ్గర ఉన్న మొర్‌దెకయిని చూచి, మొర్‌దెకయి నిలబడకపోవడం తనకు భయపడకపోవడం గమనించి హామాను మొర్‌దెకయిమీద అధికంగా కోపగించాడు.
[10] అయినా హామాను కోపాన్ని అణచుకొని ఇంటికి వెళ్ళాడు. అప్పుడతడు తన మిత్రులనూ, తన భార్య జెరెష్‌నూ పిలిచి, గొప్పలు చెప్పుకోసాగాడు,
[11] తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం విషయం, తనకు పుట్టిన చాలామంది కొడుకుల విషయం చెప్పాడు. చక్రవర్తి తనను ఘనపరచి, తక్కిన నాయకులందరికంటే అధిపతులందరికంటే తనను ఏ విధంగా పై స్థితికి హెచ్చించాడో దాని గురించి కూడా గొప్పలు చెప్పుకొన్నాడు.
[12] అతడు ఇంకా అన్నాడు “ఎస్తేరురాణి విందు చేయించింది. చక్రవర్తిని, నన్ను పిలిచింది. ఇంకెవరినీ పిలవలేదు. రేపు కూడా చక్రవర్తితో కలిసి విందుకు రమ్మని నన్ను ఆహ్వానించింది.
[13] అయితే చక్రవర్తి ద్వారం దగ్గర ఆ యూదుడు మొర్‌దెకయి కూర్చుని ఉండడం నేను చూస్తున్నంత కాలం దీనంతటివల్ల నాకు తృప్తి కలగదు.”
[14] అప్పుడు హామాను భార్య జెరెష్, అతడి మిత్రులందరూ అతడితో చెప్పారు, “యాభై మూరల ఎత్తు గల ఉరికొయ్యను చేయించండి. దానిమీద మొర్‌దెకయిని ఉరి తీయించమని రేపు చక్రవర్తితో మనవి చెయ్యండి. అప్పుడు మీరు చక్రవర్తితోపాటు సంతోషంగా విందుకు వెళ్ళవచ్చు.” ఈ మాట హామానుకు నచ్చింది, గనుక అలాగే ఉరికొయ్యను చేయించాడు.