[1] బబులోనురాజు బెల్‌షస్సరు పరిపాలించిన మొదటి సంవత్సరంలో దానియేలుకు ఒక కల వచ్చింది. పడకమీద పడుకొని ఉన్నప్పుడు దర్శనాలు కలిగాయి. అతడు ఆ కల విషయం క్లుప్తంగా వివరించి వ్రాశాడు.
[2] దానియేలు చెప్పినదేమంటే, రాత్రివేళ నా దర్శనాలలో నేను తేరిపార చూస్తూ ఉంటే, ఆకాశం నాలుగు గాలులు విసరుతూ, మహాసముద్రాన్ని కదలించివేయడం కనిపించింది.
[3] సముద్రం లోనుంచి నాలుగు బ్రహ్మాండమైన మృగాలు పైకి వచ్చాయి. అవి ఒకదానికొకటి వేరువేరుగా ఉన్నాయి.
[4] మొదటి మృగం సింహంలాంటిది. దానికి గరుడపక్షి రెక్కలున్నాయి. నేను చూస్తూ ఉన్నప్పుడు దాని రెక్కలను పీకివేసి దాన్ని లేవనెత్తి మనిషిలాగా రెండు పాదాలతో నిలబడేలా చేయడం జరిగింది. దానికి మనిషి మనసు ఇవ్వబడింది.
[5] రెండో మృగం ఎలుగుబంటిలాంటిది. దానికి ఒక ప్రక్కకంటే రెండో ప్రక్క ఎత్తుగా ఉంది. దాని నోట పళ్ళమధ్య మూడు ప్రక్కటెముకలు ఉన్నాయి. దానితో కొందరు “లే! మాంసం బాగా మ్రింగెయ్యి!” అన్నారు.
[6] తరువాత నేను చూస్తూ ఉంటే, ఇంకో మృగం కనిపించింది. అది చిరుతపులిలాంటిది. దాని వీపుకు పక్షి రెక్కలలాంటి నాలుగు రెక్కలున్నాయి. ఈ మృగానికి నాలుగు తలలున్నాయి. దానికి పరిపాలించే అధికారం ఇవ్వబడింది.
[7] తరువాత, రాత్రివేళ కలిగిన ఆ దర్శనాలను నేను చూస్తూవున్నప్పుడు, నాలుగో మృగం కనిపించింది. అది ఘోరమైనది. భయంకరమైనది, మహా బలంగలది. దానికి పెద్ద ఇనుప పళ్ళు ఉన్నాయి. ఎదురుపడ్డ వాటన్నిటినీ అది ముక్కలు చేసి మ్రింగివేసింది. మిగిలినదాన్ని కాళ్ళక్రింద త్రొక్కివేసింది. మునుపు కనిపించిన మృగాలన్నిటికీ ఈ మృగం భిన్నమైనది. దానికి పది కొమ్ములున్నాయి.
[8] ఈ కొమ్ములను చూస్తూవుంటే వాటి మధ్య మరో కొమ్ము పైకి వచ్చింది. అది చిన్నది. దాని ఎదుట ఆ మొదటి కొమ్ములలో మూడు కొమ్ములను పీకివేయడం జరిగింది. ఈ కొమ్ముకు మనిషి కండ్లలాంటి కండ్లున్నాయి. గొప్పలు చెప్పుకొనే నోరు కూడా ఉంది.
[9] నేను ఇంకా చూస్తూ ఉంటే, సింహాసనాలు నెలకొల్పడం జరిగింది. అనాది సిద్ధమైనవాడు కూర్చున్నాడు. ఆయన వస్త్రం చలిమంచంత తెలుపు. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన తెల్లని గొర్రెబొచ్చులాగా ఉన్నాయి. ఆయన సింహాసనం మంటలతో మండుతూ ఉంది. దాని చక్రాలు నిప్పులాంటివి.
[10] మంటల ప్రవాహం ఆయన ఎదుటనుంచి పారుతూ ఉంది. వేలాది వేలమంది పరిచారకులు ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు. కోటాను కోట్లమంది ఆయన ఎదుట నిలుచున్నారు. న్యాయసభ ఆరంభం అయింది, గ్రంథాలు విప్పడం జరిగింది.
[11] ఆ చిన్న కొమ్ము గొప్పలు చెప్పుకోవడం కారణంగా నేనింకా చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఆ మృగం హతం అయింది. నాశనమైనదాని శవాన్ని మండుతూ ఉన్న మంటల్లో వేయడం జరిగింది. అంతవరకు చూస్తూ ఉన్నాను.
[12] అంతకుముందు ఆ ఇతర మృగాల ప్రభుత్వం తొలగిపోయినా, అవి ఇంకా ఒక సమయం ఒక కాలం బ్రతకడానికి నిర్ణయం అయింది.
[13] రాత్రివేళ కలిగిన దర్శనాలను నేను ఇంకా చూస్తూ ఉంటే, మానవ పుత్రునిలాంటివాడు ఆకాశ మేఘాలతో రావడం కనిపించింది. ఆయన అనాది సిద్ధమైనవాణ్ణి సమీపించాడు. ఆయనను ఆయన సన్నిధానంలోకి తీసుకువచ్చారు.
[14] ఆయనకు పరిపాలన, ప్రతాపం, రాజ్యాధికారం ఇవ్వబడ్డాయి. సర్వప్రజలూ అన్ని దేశాలవారూ అన్ని భాషలవారూ ఆయనకు సేవకులయ్యారు. ఆయన పరిపాలన శాశ్వతమైనది. అది ఎన్నటికీ గతించదు. ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు.
[15] నేను – దానియేలును – మనసులో ఆందోళన పడ్డాను. ఆ దర్శనాలవల్ల నాకు భయం వేసింది.
[16] అక్కడ నిలుచున్నవారిలో నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దీనంతటిని గురించిన నిజం చెప్పండని మనవి చేశాను. అతడు ఆ విషయాల అర్థం తెలియజేస్తూ నాతో ఇలా అన్నాడు:
[17] “ఆ నాలుగు బ్రహ్మాండమైన మృగాలు ఈ లోకంలో బయలుదేరే నలుగురు రాజులను సూచిస్తాయి.
[18] గానీ సర్వాతీతుని పవిత్రులే రాజ్యాధికారం పొందుతారు. రాజ్యం వారికి యుగయుగాలకూ శాశ్వతంగా ఉంటుంది.”
[19] అప్పుడు ఆ ఇతర మృగాలన్నిటికీ భిన్నమైన ఆ నాలుగో మృగాన్ని గురించిన వాస్తవం తెలుసుకోవాలని కోరాను. ఆ మృగం చాలా ఘోరమైనది. దానికి ఇనుప పళ్ళూ కంచు గోళ్ళూ ఉన్నాయి. అది ఎదురుపడే వాటన్నిటినీ ముక్కలు చేసి మ్రింగివేసి మిగిలినదానిని కాళ్ళక్రింద త్రొక్కివేసేది.
[20] దాని తలకు ఉన్న పది కొమ్ముల విషయమూ తరువాత పైకివచ్చిన ఆ వేరే కొమ్ము విషయమూ కూడా తెలుసుకోవాలని కోరాను. ఆ కొమ్ములలో మూడు ఈ కొమ్ము ఎదుట కూలిపొయ్యాయి. ఆ కొమ్ములన్నిటికంటే ఈ కొమ్ముకు ఎక్కువ బలం ఉన్నట్టు కనిపించింది. దానికి కండ్లూ గొప్పలు చెప్పుకొనే నోరూ ఉన్నాయి.
[21] నేను చూస్తూవుంటే, ఈ కొమ్ము పవిత్రులతో యుద్ధం చేస్తూ, వారిని గెలుస్తూ ఉంది.
[22] అనాది సిద్ధమైనవాడు వచ్చి సర్వాతీతుని పవిత్రుల పక్షంగా తీర్పు విధించేవరకు అలా జరుగుతూనే ఉంది. అయితే ఆ సమయం వచ్చినప్పుడు పవిత్రులు రాజ్యం పొందారు.
[23] అతడు ఇలా చెప్పాడు: “ఆ నాలుగో మృగం లోకంలో ఉండబోయే నాలుగో రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ రాజ్యం ఆ ఇతర రాజ్యాలన్నిటికీ భిన్నంగా ఉంటుంది. అది లోకమంతా అణగద్రొక్కుతూ, చితగ్గొట్టివేస్తూ మ్రింగివేస్తుంది.
[24] ఆ పది కొమ్ములు ఆ రాజ్యంలో కనిపించబోయే పదిమంది రాజులను సూచిస్తాయి. వాళ్ళ తరువాత వేరొక రాజు పైకి వస్తాడు. మునుపున్న ఆ రాజులకు భిన్నంగా ఉంటాడు. వారిలో ముగ్గురు రాజులను లొంగదీస్తాడు.
[25] అతడు సర్వాతీతునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయన భక్తులను బాధిస్తాడు. నిర్ణీత కాలాలనూ శాసనాలనూ మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. పవిత్రులను ఒక కాలం, కాలాలు, అర్ధకాలం అతడి వశం చేయడం జరుగుతుంది.
[26] గానీ న్యాయసభ సమకూడుతుంది, అతడి అధికారం కొట్టివేయబడుతుంది. అది ఇంకెన్నటికీ ఉండకుండా నిర్మూలం అవుతుంది.
[27] అప్పుడు ఆకాశ మండలమంతటి క్రింద ఉన్న రాజ్యాలన్నిటికీ చెందిన పరిపాలన, అధికారం, మహత్యం సర్వాతీతుని ప్రజలైన పవిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. అధికారులందరూ ఆయనకు లోబడుతూ, సేవ చేస్తూ ఉంటారు.”
[28] ఇంతలో సంగతి సమాప్తం అయింది. నేను – దానియేలును – నా తలంపులవల్ల చాలా భయాందోళన చెందాను. నా ముఖం తెల్లబోయింది. అయినా నేను ఆ సంగతి ఎవరికీ చెప్పలేదు.