[1] పారసీక చక్రవర్తి కోరెషు పరిపాలించిన మూడో సంవత్సరంలో బెల్‌తెషాజరు అనే మారుపేరు పొందిన దానియేలుకు ఒక సంగతి వెల్లడి చేయబడింది. ఆ సంగతి నిజం. అది గొప్ప యుద్ధాన్ని గురించినది. తనకు కలిగిన దర్శనంవల్ల అతడు ఆ సంగతి గ్రహించాడు.
[2] ఆ రోజుల్లో నేను – దానియేలును – మూడు వారాలు శోకిస్తూ ఉన్నాను.
[3] ఆ మూడు వారాలు గడిచేవరకూ ఇష్టమైన ఆహారమేమీ తినలేదు. మాంసం గానీ ద్రాక్షరసం గానీ నా నోట్లో పడలేదు. స్నానాభిషేకం చేసుకోలేదు.
[4] మొదటి నెల ఇరవై నాలుగో రోజున నేను హిద్దెకెల్ అనే గొప్ప నది ఒడ్డున ఉన్నాను.
[5] నేను తలెత్తి చూస్తే, సన్నని నారబట్టలు తొడుక్కొని ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని నడిమికి మేలిమి బంగారు నడికట్టు ఉంది.
[6] అతని శరీరం గోమేధికం లాంటిది. అతని ముఖం మెరుపులాగా ఉంది. అతని కండ్లు మండుతూ ఉన్న దివిటీలలాంటివి. అతని చేతులూ కాళ్ళూ మెరుగు పెట్టిన కంచులాగా తళతళలాడుతూ ఉన్నాయి. అతని కంఠధ్వని మానవ సమూహం చేసే కలకలంలాంటిది.
[7] నేను – దానియేలును – ఒక్కణ్ణే ఈ దర్శనం చూశాను. నాతో ఉన్నవారు దానిని చూడలేదు గాని వారికి ఎంతో భయం వేసినందుచేత దాక్కొందామని పారిపోయారు.
[8] నేను ఒక్కణ్ణే మిగిలి ఈ గొప్ప దర్శనం చూశాను. నాలో బలమేమీ నిలవలేదు. నా ముఖకాంతి హరించుకుపోయింది. నా బలమంతా పోయింది.
[9] అయినా అతడు చెప్పిన మాటలు విన్నాను. వింటూ ఉంటే, నేను నిర్ఘాంతపోయి సాష్టాంగపడ్డాను.
[10] అప్పుడు ఒక చెయ్యి నన్ను తాకింది, వణకుతున్న నా మోకాళ్ళను అరచేతులను నేలమీద మోపింది.
[11] అతడు “దానియేలూ! నీవు ఎంతో ప్రియమైనవాడివి. దేవుడు పంపగా నేను నీ దగ్గరకు వచ్చాను గనుక నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పబోయే మాటలు గ్రహించు” అన్నాడు. అతడా మాటలు నాతో చెప్పగానే నేను వణకుతూ లేచి నిలబడ్డాను.
[12] అప్పుడతడు అన్నాడు, “దానియేలు! భయపడకు! అర్థం చేసుకోవడానికి మనసు పెట్టి దేవుని సన్నిధానంలో నిన్ను నీవు తగ్గించుకొన్న మొదటి రోజునుంచి నీ మాటలు వినబడ్డాయి. నీ మాటల కారణంగానే నేను వచ్చాను.
[13] కానీ పారసీకుల రాజ్యంపై ఉన్న అధిపతి ఇరవై ఒక రోజులు నన్ను ఎదిరించాడు. నేను పారసీకుల రాజు ఎదుట ఉండిపోవలసి వచ్చినందుచేత మిఖాయేల్ నా సహాయానికి వచ్చాడు. మిఖాయేల్ ప్రముఖ అధిపతులలో ఒకడు.
[14] అప్పుడు నీ ప్రజకు భవిష్యత్తులో జరగబోయేవాటిని నీకు తెలియ జేయడానికి వచ్చాను. ఈ దర్శనం రాబోయే కాలాన్ని గురించినది.”
[15] అతడా మాటలు నాతో చెపుతూ ఉండగా నేను ముఖం క్రిందకి దించుకొని మాట్లాడలేకపోయాను.
[16] వెంటనే మనిషిలాంటివాడొకడు నా పెదవులను తాకాడు. నేను నోరు తెరచి నా ఎదుట నిలుచున్న వ్యక్తితో “నా యజమానీ! ఈ దర్శనంవల్ల అల్లాడిపోతున్నాను. నా బలమంతా పోయింది.
[17] నా యజమానులైన మీతో మీ దాసుడైన నేను ఎలా మాట్లాడగలను? నాకు బలమేమీ మిగలలేదు. ఊపిరి విడవలేక ఉన్నాను” అన్నాను.
[18] మనిషిలాంటి ఆ వ్యక్తి మళ్ళీ నన్ను తాకి నాకు బలం కలిగించాడు.
[19] “నీవు ఎంతో ప్రియమైనవాడివి. భయపడకు! నీకు క్షేమం కలుగుతుంది. బలం పుంజుకో! బలం పుంజుకో!” అన్నాడతడు. అతడు నాతో ఇలా చెప్పగానే నాకు బలం కలిగింది. నేను “నా యజమానీ! మీరు నాకు బలం కలిగించారు. ఇప్పుడు మాట్లాడండి” అన్నాను.
[20] అతడు ఇలా అన్నాడు: “నేను నీదగ్గరికి వచ్చినది ఎందుకో తెలుసా? కాసేపటికి పారసీక అధిపతితో యుద్ధం చేయడానికి తిరిగి వెళ్ళిపోతాను. నేను బయలుదేరిన తరువాత గ్రీసు అధిపతి వస్తాడు.
[21] అయితే ఇప్పుడు సత్య గ్రంథంలో వ్రాసి ఉన్నదానిని నీకు తెలియజేస్తాను. (వాళ్ళను ఎదిరించడానికి నాకు ఒక్కడే సహాయకుడు. అతడు నీ ప్రజాధిపతి మిఖాయేల్. మరెవ్వరూ లేరు.