[1] యజమానులారా, పరలోకంలో మీకు కూడా యజమానుడొకడు ఉన్నాడని తెలిసి మీ దాసులపట్ల న్యాయంగా నిష్‌పక్షపాతంగా వ్యవహరించండి.
[2] మెళకువగా ఉండి కృతజ్ఞతతో ప్రార్థన చేస్తూ ఉండండి.
[3] మా కోసం కూడా ప్రార్థించండి. క్రీస్తు రహస్య సత్యం కోసం నేను సంకెళ్ళ పాలయ్యాను. మేమీ సత్యం ప్రకటించడానికి దేవుడు తన వాక్కుకోసం మాకు తలుపు తెరిచేలా,
[4] నేను మాట్లాడవలసిన విధంగానే దానిని స్పష్టం చేసేలా ప్రార్థించండి.
[5] సమయాన్ని సద్వినియోగం చేస్తూ బయటివారిపట్ల జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉండండి.
[6] ప్రతి ఒక్కరికీ ఎలా జవాబివ్వాలో అది మీరు తెలుసుకొనేలా దయతో, ఉప్పు వేస్తే రుచి కలుగుతున్నరీతిగా మీ మాటలు ఎల్లప్పుడు ఉండేలా చూడండి.
[7] నా విషయాలన్నీ తుకికస్ మీకు చెపుతాడు. ఇతడు ప్రియ సోదరుడు, ప్రభువులో నమ్మకమైన పరిచారకుడు, నా తోటి సేవకుడు.
[8] అతనికి మీ పరిస్థితులు తెలియాలనీ, ఇతడు మీ హృదయాలకు ప్రోత్సాహం కలిగించాలనీ ఈ కారణాల చేతనే నేనతణ్ణి మీదగ్గరకు పంపుతున్నాను.
[9] మన నమ్మకమైన ప్రియ సోదరుడూ మీలో ఒకడూ అయిన ఒనేసిమును అతనితోకూడా పంపుతున్నాను. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియజేస్తారు.
[10] నాతోకూడా ఖైదులో ఉన్న అరిస్తార్కస్, బర్నబాకు సమీప బంధువుడైన మార్కు మీకు అభినందనలు చెపుతున్నారు. మార్కును గురించి మీకు ఆదేశాలు వచ్చాయి. అతడు మీదగ్గరకు వస్తే అతణ్ణి స్వీకరించండి.
[11] యూస్తస్ అనే యేసు కూడా అభివందనాలు చెపుతున్నాడు. దేవుని రాజ్యంకోసం నా జతపనివారిలో వీరు మాత్రమే సున్నతి పొందినవారు. వీరివల్ల నాకు ఓదార్పు కలిగింది.
[12] క్రీస్తు దాసుడూ, మీలో ఒకడూ అయిన ఎపఫ్రామీకు అభివందనాలు చెపుతున్నాడు. మీరు దేవుని సంకల్పమంతటిలో పరిపూర్ణులుగా సంపూర్ణులుగా నిలిచి ఉండేలా అతడు మీ కోసం ఎప్పుడూ ప్రార్థనలో ఉత్సుకతతో పోరాడుతూ ఉన్నాడు.
[13] ఇతనికి మీకోసం, లవొదికయలో హియెరాపొలిలో ఉన్నవారికోసం ఎంతో ఆసక్తి ఉందని ఇతణ్ణి గురించి నా సాక్ష్యం.
[14] ప్రియ వైద్యుడైన లూకా, దేమాస్ కూడా అభివందనాలు చెపుతున్నారు.
[15] లవొదికయలో ఉన్న సోదరులకూ, నుంఫాకూ అతని ఇంట్లో ఉన్న సంఘానికీ అభివందనాలు చెప్పండి.
[16] ఈ లేఖ మీమధ్య చదివి వినిపించిన తరువాత లవొదికయ వారి సంఘంలో కూడా చదివించండి. లవొదికయనుంచి వచ్చిన లేఖ మీరు చదివి వినిపించండి.
[17] అర్కిప్పస్‌తో ఈ మాట చెప్పండి: “ప్రభువు మీకప్పగించిన పని పూర్తి చేయడానికి శ్రద్ధ వహించండి.”
[18] నేను – పౌలును – నా సొంత చేతితో ఈ అభివందనాలు రాస్తున్నాను. నేను ఖైదీనని జ్ఞాపకం ఉంచుకోండి. కృప మీకు తోడై ఉంటుంది గాక! తథాస్తు.