Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:14

[1] మీకోసం, లవొదికయ పట్టణంలో ఉన్నవారికోసం, నా ముఖం చూడని వారందరి కోసమూ నేనెంత తీవ్రమైన పోరాటం అనుభవిస్తున్నానో మీరు తెలుసుకోవాలని నా కోరిక.

[2] వారి హృదయాలు ప్రేమలో ఏకమై ఉండి ప్రోత్సాహం పొందాలని వారికి అవగాహన సంపూర్ణ నిశ్చయత ఐశ్వర్యమంతా కలగాలనీ, తద్వారా వారు దేవుని రహస్య సత్యం, తండ్రి, క్రీస్తు ఉభయుల విషయమైన రహస్య సత్యం తెలిసిపోవాలనీ పోరాడుతున్నాను.

[3] క్రీస్తులో జ్ఞాన వివేకాల నిధులన్నీ మరుగై ఉన్నాయి.

[4] ఎవరూ మిమ్ములను తియ్యటి మాటలతో మోసగించకుండా ఇది చెపుతున్నాను.

[5] నేను శారీరకంగా హాజరులో లేకపోయినా ఆత్మరీతిగా మీతోకూడా ఉండి, మీ క్రమమైన ప్రవర్తన, క్రీస్తుమీద ఉన్న మీ స్థిర విశ్వాసం తెలిసి ఆనందిస్తూ ఉన్నాను.

[6] మీరు ప్రభువైన క్రీస్తు యేసును స్వీకరించిన విధంగానే ఆయనలో నడుచుకొంటూ ఉండండి.

[7] ఆయనలో వేరుపారి అభివృద్ధి పొందుతూ, మీకు ఉపదేశం వచ్చినట్టే విశ్వాసంలో సుస్థిరమై దానిలో కృతజ్ఞతతో ఉప్పొంగిపోతూ ఉండండి.

[8] ఎవ్వడూ వట్టి మోసంద్వారా తత్వశాస్త్రంతో మిమ్ములను దోచుకోకుండా జాగ్రత్త! అలాంటిది క్రీస్తుకు అనుగుణమైనది కాదు గాని మనుషుల సాంప్రదాయాలకూ ఈ లోకంలో ఉన్న ప్రాథమిక విషయాలకూ అనుగుణమైనది.

[9] క్రీస్తులోనైతే దేవుని సర్వ సంపూర్ణత శరీర రూపంలో నివసిస్తూ ఉంది.

[10] సర్వాధికారానికీ ప్రభుత్వానికీ పై అధికారి అయిన క్రీస్తులో మీరు సంపూర్ణులు.

[11] మీ శరీర స్వభావపాపాలను తొలగించడం వల్ల ఆయనలో మీకు “సున్నతి” కూడా జరిగింది. ఇది క్రీస్తు జరిగించిన సున్నతి, చేతులతో చేసినది కాదు.

[12] మీరు బాప్తిసంలో ఆయనతోకూడా పాతిపెట్టబడ్డారు. ఆయనను చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేపిన దేవుని బలప్రభావాలమీద మీరు నమ్మకం పెట్టడం ద్వారా ఆయనతో కూడా సజీవంగా లేపబడ్డారు.

[13] మీరు మీ అపరాధాలలో, శరీర సంబంధమైన సున్నతి లేని స్థితిలో ఆధ్యాత్మికంగా మరణమై ఉన్నప్పుడు దేవుడు మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు.

[14] మనకు ప్రతికూలమైన రుణపత్రంగా రాసి ఉన్నదానిని – మనకు విరుద్ధమైన నిర్ణయాలను రద్దుచేసి పూర్తిగా తీసివేసి సిలువకు మేకులతో కొట్టి మన అతిక్రమక్రియలన్నీ క్షమించాడు.

[15] ప్రధానులనూ అధికారులనూ సిలువమీద జయించి నిరాయుధులను చేసి బహిరంగంగా ప్రదర్శించాడు.

[16] అందుచేత అన్నపానాల విషయంలో, పండుగలూ అమావాస్యలూ విశ్రాంతి రోజులూ అనేవాటి విషయంలో ఎవ్వరూ మీకు తీర్పు తీర్చకుండా చూచుకోండి.

[17] అలాంటివి రాబోయేవాటికి నీడలు మాత్రమే. వాటి స్వరూపం క్రీస్తు సంబంధమైనది.

[18] కపట వినయంలో, దేవదూతలను పూజించడంలో ఇష్టమున్నవాడెవ్వడూ మీ బహుమతికి అడ్డుపడనివ్వండి. అలాంటివాడు తాను చూడని వాటిలోకి చొచ్చుకొనిపోతారు. వాడి భ్రష్ట మనసు వాణ్ణి ఊరికే ఉబ్బిస్తుంది.

[19] వాడు శిరస్సును హత్తుకోకుండా ఉన్నాడు. ఆయన వల్ల శరీరమంతా పోషణ పొందుతూ, దాని కీళ్ళచేత, నరాలచేత ఏకమై ఉండి, దేవుడు కలిగించిన వృద్ధివల్ల పెరుగుతూ ఉంది.

[20] కాబట్టి ఈ లోకానికి చెందిన ప్రాథమిక నియమాల విషయంలో మీరు క్రీస్తుతో కూడా చనిపోయారూ అంటే లోకంలో బ్రతుకుతూ ఉన్నట్టు ఈ నిర్ణయాలకు లొంగిపోవడ మెందుకు?

[21] “అది పట్టుకోకూడదు! ఇది రుచిచూడకూడదు! దానిని తాకకూడదు!” అనే నిర్ణయాలకు లొంగిపోవడ మెందుకు?

[22] ఈ నిర్ణయాలన్నీ వాడుకోవడంలోనే నశించిపోయేవాటిని గురించినవే. మనుషుల ఆజ్ఞల మీదా ఉపదేశాల మీదా ఆధారపడేవే.

[23] ఇష్టారాధనతో, కపట వినయంతో, కఠిన తపస్సుతో ఉన్న ఆ విషయాలలో జ్ఞానం ఉన్నట్టే అనిపిస్తుంది గాని శరీర స్వభావానికి చెందిన కోరికలను తీర్చుకోకుండా అవి దేనికీ పనికిరావు.

కొలస్సయివారికి లేఖ — Chapters