[1] మరొకసారి ఆయన సముద్రం ఒడ్డున ఉపదేశించడం ప్రారంభించాడు. ఆయన చుట్టూ చాలా మంది ప్రజలు ఉండడం వల్ల, ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు.
[2] ఆయన ఉదాహరణల సహాయంతో అనేక విషయాలు వారికి బోధించాడు. ఆయన వారితో ఇలా అన్నాడు.
[3] “వినండి! ఒక రైతు విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు.
[4] విత్తనాలు చల్లుతూ ఉండగా, కొన్ని దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేశాయి.
[5] మరికొన్ని విత్తనాలు, మట్టి ఎక్కువగా లేని రాతినేల మీద పడ్డాయి. అవి త్వరగానే మొలకెత్తాయి.
[6] కాని వాటి వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోయాయి.
[7] ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ఆ ముళ్ళ తుప్పలు పెరిగి మొక్కలను అణచి వేయడం వల్ల అవి పంటకు రాలేదు.
[8] మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి ముప్ఫై రెట్లు, అరవై రెట్లు, వంద రెట్లు పండి కోతకు వచ్చాయి.”
[9] యేసు ఇలా చెప్పి, “వినడానికి చెవులు ఉన్నవాడు వినుగాక” అన్నాడు.
[10] తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు, ఆయన సన్నిహితులు కొందరు ఆ ఉదాహరణల గురించి ఆయనను అడిగారు.
[11] ఆయన వారితో, “దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యం మీకు చెప్పాను. కాని బయటి వారికి ప్రతి విషయమూ ఉపమానాల రూపంలోనే లభిస్తుంది.
[12] ఎందుకంటే, వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి. వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.”
[13] ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? అయితే మిగతా ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు?
[14] విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు.
[15] దారి పక్కన ఉన్నవారెవరంటే, వాక్కు వారిలో పడింది గాని, వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు.
[16] అలాగే కొంతమంది రాతినేల లాంటి వారు. వీళ్ళు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు.
[17] కానీ వారిలో వాక్కు లోతుగా వేరు పారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు.
[18] కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. దేవుని వాక్కు వింటారు.
[19] కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి.
[20] మరి కొందరు సారవంతమైన నేలలాంటి వారు, వీళ్ళు దేవుని వాక్కు విని, అంగీకరించి కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిస్తారు.”
[21] ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “దీపాన్ని తెచ్చి బోర్లించిన పాత్ర కింద, లేక మంచం కింద ఉంచుతారా? దాన్ని దీపస్తంభం మీద ఉంచుతాం గదా!
[22] దాచి ఉంచినవన్నీ బహిర్గతమౌతాయి. అన్ని రహస్యాలూ బయట పడిపోతాయి.
[23] వినడానికి చెవులు గలవాడు వినుగాక.”
[24] యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు, “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు.
[25] కలిగిన వారికి దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు.”
[26] ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఒక మనిషి భూమి మీద విత్తనాలు చల్లినట్టు ఉంటుంది.
[27] ఆ వ్యక్తి నిద్ర పోతున్నా మెలకువగా ఉన్నా రాత్రి, పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి.
[28] ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి.
[29] పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు.”
[30] ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు. “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం?
[31] అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అది చిన్నది.
[32] కాని దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి.”
[33] యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి, వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు.
[34] ఉపమానం లేకుండా వారికి ఏ ఉపదేశమూ చేయలేదు. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్నీ వివరించి చెప్పాడు.
[35] ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు.
[36] శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి.
[37] అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి.
[38] పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు.
[39] ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.
[40] అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు.
[41] వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.