[1] యేసు మరోసారి సమాజమందిరంలో ప్రవేశించాడు. అక్కడ చెయ్యి చచ్చుబడిపోయిన వాడొకడు ఉన్నాడు.
[2] అక్కడివారు ఆయన మీద నేరం మోపే ఉద్దేశంతో, యేసు విశ్రాంతి దినాన ఆ మనిషిని బాగుచేస్తాడేమో అని జాగ్రత్తగా గమనిస్తున్నారు.
[3] యేసు ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, “ఇటు వచ్చి అందరి ముందూ నిలబడు” అన్నాడు.
[4] అప్పుడు ఆయన వారితో, “విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమా? కీడు చేయడమా? ప్రాణాన్ని రక్షించడం ధర్మమా? చంపడమా?” అని అన్నాడు. అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు.
[5] వారి కఠిన హృదయాలను బట్టి ఆయన నొచ్చుకుని, కోపంతో రగిలిపోతూ అందరి వైపూ చూశాడు. ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, “నీ చెయ్యి చాపు” అనగానే వాడు చెయ్యి చాపాడు. వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది.
[6] అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్ళి, హేరోదు రాజు మనుషులతో కలిసి యేసుని చంపడానికి కుట్ర పన్నారు.
[7] యేసు తన శిష్యులతో కలసి గలిలయ సరస్సు వెంబడి వెళ్తూ ఉన్నాడు. గలిలయ, యూదయ ప్రాంతం నుండి వచ్చిన చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్ళారు.
[8] యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ, యెరూషలేము, ఇదూమియ ప్రాంతాలనుండీ, యొర్దాను నది అవతలి నుండీ తూరు, సీదోను ప్రాంతాలనుండీ ఆయన దగ్గరికి వచ్చారు.
[9] ప్రజలు ఎక్కువమంది ఉన్న కారణంగా వారు తన మీద పడకుండా ఉండాలని తన కోసం ఒక పడవ సిద్ధం చేయమని ఆయన తన శిష్యులతో చెప్పాడు.
[10] ఆయన చాలామందిని బాగు చేశాడు. అందువల్ల రోగులందరూ ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు.
[11] దయ్యాలు పట్టినవారు ఆయనను చూడగానే, ఆయన ఎదుట నేలపై పడిపోయి, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేశారు.
[12] యేసు, తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు.
[13] తరువాత యేసు కొండ ఎక్కి వెళ్ళి తనను ఎవరు అనుసరించాలని ఆయన కోరుకున్నాడో వారిని పిలిచాడు. వారు ఆయన దగ్గరికి వచ్చారు.
[14] తనతో ఉండడానికీ, సువార్త ప్రకటనకు పంపడానికీ ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు.
[15] రోగాలను బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు.
[16] వారి పేర్లు, సీమోను (ఇతనికి ఆయన పేతురు అనే పేరు పెట్టాడు),
[17] జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను (వీరికి ఆయన ‘బోయనేర్గెసు’ అనే పేరు పెట్టాడు, ఆ మాటకి ‘ఉరిమేవారు’ అని అర్థం),
[18] అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,
[19] యేసును పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా.
[20] తరువాత యేసు, ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ చాలా మంది ప్రజలు గుమికూడారు. కాబట్టి వారికి భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది.
[21] ఇది తెలిసిన యేసు కుటుంబీకులు ఆయనను పట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే కొందరు “ఈయనకు మతి స్థిమితం లేదు” అన్నారు.
[22] యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు, “బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు” అన్నారు.
[23] యేసు వారిని తన దగ్గరికి పిలిచి, ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు, “సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు?
[24] చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు.
[25] చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు.
[26] అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా.
[27] నిజానికి ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టివేయాల్సిందే.
[28] నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు.
[29] కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు.”
[30] ‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.
[31] అప్పుడు యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చి, బయట నిలబడి యేసు కోసం కబురు చేశారు. యేసు చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు.
[32] వారు ఆయనతో, “నీ తల్లి, సోదరులు బయట నీ కోసం చూస్తున్నారు” అన్నారు.
[33] ఆయన వారితో, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అన్నాడు.
[34] తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు.
[35] ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం నడచుకునే వారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి” అని అన్నాడు.