[1] ఆదివారం తెల్లవారిన తరువాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు.
[2] సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండడం చూసి లోపలికి వెళ్ళారు.
[3] కానీ ప్రభు యేసు దేహం వారికి కనబడలేదు. దాంతో వారికేమీ తోచలేదు.
[4] అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు.
[5] వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు, “సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు?
[6] ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు
[7] మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారనీ, వారు ఆయనను సిలువ వేసి చంపుతారనీ, తిరిగి ఆయన మూడవ రోజున సజీవుడిగా లేస్తాడనీ మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి” అన్నారు.
[8] అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు.
[9] వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వారికందరికీ చెప్పారు.
[10] ఇలా ఈ సంగతులను అపొస్తలులకు చెప్పిన స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వారితో ఉన్న యితర స్త్రీలూ.
[11] అయితే విన్నవారికి ఈ మాటలు పిచ్చి మాటలుగా అనిపించాయి. కాబట్టి వారెవరూ వీరి మాటలు నమ్మలేదు.
[12] అయితే పేతురు లేచి, సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ సమాధిలోకి తొంగి చూశాడు. అక్కడ నారబట్టలు మాత్రం కనిపించాయి. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.
[13] ఆ రోజే ఇద్దరు శిష్యులు యెరూషలేముకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయిస్ గ్రామానికి వెళ్తున్నారు.
[14] జరిగిన ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు.
[15] అలా వారు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండగా యేసు వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నాడు.
[16] అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే వారి కళ్ళు మూతలు పడ్డట్టు అయింది.
[17] ఆయన, “మీరు నడుస్తూ పరస్పరం చర్చించుకుంటున్న విషయాలు ఏమిటి?” అని వారిని అడిగాడు. దాంతో వారు దుఃఖంతో నిండిపోయి నిలబడిపోయారు.
[18] వారిలో క్లెయొపా అనేవాడు, “యెరూషలేములో కాపురముంటూ ఈ రోజుల్లో అక్కడ జరుగుతున్న విషయాలు తెలియని వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకుంటా” అన్నాడు.
[19] ఆయన, “ఏ విషయాలు?” అని అడిగాడు. అప్పుడు వారు, “నజరేతు వాడైన యేసును గురించిన విషయాలే. ఆయన దేవుని దృష్టిలోనూ ప్రజలందరి దృష్టిలోనూ మాటల్లో పనుల్లో శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు.
[20] మన ముఖ్య యాజకులూ అధికారులూ ఆయనను మరణశిక్షకు అప్పగించి, ఎలా సిలువ వేయించారో నీకు తెలియదా?
[21] ఇశ్రాయేలు ప్రజను విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం. ఈ విషయాలన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి.
[22] అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దేహం కనిపించక తిరిగి వచ్చారు.
[23] కొందరు దేవదూతలు తమకు కనబడి, ‘ఆయన బతికే ఉన్నాడు’ అని చెప్పారు అని మాకు తెలిపినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది.
[24] మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు” అని ఆయనకు చెప్పారు.
[25] అందుకాయన, “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా,
[26] క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని వారితో అన్నాడు.
[27] ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి రాసిన మాటల అర్థాన్ని వారికి తెలియజేశాడు.
[28] ఇంతలో వారి గ్రామం వచ్చింది. ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్టు కనిపించింది.
[29] దాంతో వారు, “పొద్దు వాలుతున్నది. చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు” అంటూ ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడా ఇంట్లోకి వెళ్ళాడు.
[30] ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకుని దానికోసం కృతజ్ఞతలు చెప్పి, విరిచి తినడానికి వారికిచ్చాడు.
[31] అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి. వారు ఆయనను గుర్తు పట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా మాయమయ్యాడు.
[32] అప్పుడు వారు, “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థం అయ్యేలా చెబుతున్నప్పుడు మన హృదయాలు దహించుకు పోతున్నట్టు అనిపించ లేదూ” అని చెప్పుకున్నారు.
[33] అప్పుడే వారు లేచి తిరిగి యెరూషలేము వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులూ, వారితో ఉన్నవారూ కలుసుకుని
[34] “ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనిపించాడు” అని చెప్పుకుంటున్నారు. వారది విని
[35] దారిలో జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరిచిన వెంటనే తమకెలా ప్రత్యక్షమయ్యాడో తెలియజేశారు.
[36] వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు.
[37] అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు.
[38] అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు?
[39] నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు.
[40] అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు.
[41] అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు.
[42] వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు.
[43] ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు.
[44] తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు.
[45] అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు.
[46] “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ,
[47] యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది.
[48] మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.
[49] “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు.
[50] ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు.
[51] అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు.
[52] వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.
[53] దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.