Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:17

[1] ఆ రోజుల్లో ఒకసారి ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ పెద్దలతో కూడా ఆయనకు వ్యతిరేకంగా వచ్చి,

[2] “నువ్వు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు? మాకు చెప్పు” అని ఆయనను అడిగారు.

[3] దానికి ఆయన, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నాకు జవాబివ్వండి.

[4] యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగిందా, మనుషుల్లో నుండి కలిగిందా?” అని వారినడిగాడు.

[5] వారు ఇలా ఆలోచించారు, “మనం ‘పరలోకం నుండి కలిగింది’ అంటే, ‘అలాగైతే మీరెందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు.

[6] ‘మనుషుల్లో నుండి కలిగింది’ అంటే జనం మనలను రాళ్ళతో కొడతారు. ఎందుకంటే యోహాను ఒక ప్రవక్త అని అంతా కచ్చితంగా నమ్ముతున్నారు.”

[7] ఇలా ఆలోచించుకుని వారు, “అది ఎక్కడ నుండి కలిగిందో మాకు తెలీదు” అని జవాబిచ్చారు.

[8] దానికి యేసు, “నేను కూడా ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నానో మీతో చెప్పను” అన్నాడు.

[9] ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి ద్రాక్షతోట నాటించి, దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు. ఆ తరువాత వేరే దేశానికి వెళ్ళి అక్కడ చాలా కాలం ఉన్నాడు.

[10] కోతల కాలం వచ్చినపుడు అతడు ఆ ద్రాక్ష తోటలో తన భాగం కోసం రైతుల దగ్గరికి తన పనివాడు ఒకణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపి వేశారు.

[11] మళ్ళీ అతడు మరో పనివాణ్ణి పంపాడు. వారు వాణ్ణి కూడా కొట్టి, అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు.

[12] మళ్ళీ అతడు మూడవ వాణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి గాయపరిచి బయటకు తోసివేశారు.

[13] అప్పుడా ద్రాక్షతోట యజమాని ఇలా అనుకున్నాడు, “ఇప్పుడు నేనేం చేయాలి? ఇక నా సొంత కుమారుణ్ణి పంపుతాను. వారు ఒకవేళ అతణ్ణి గౌరవిస్తారేమో.”

[14] అయితే ఆ కౌలు రైతులు అతణ్ణి చూసి, “ఇతడే వారసుడు. ఇతన్ని చంపివేస్తే ఈ పొలం మనదవుతుంది” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

[15] వారు అతణ్ణి ద్రాక్ష తోట బయటకు తోసి చంపివేశారు. ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వారినేం చేస్తాడు?

[16] అతడు వచ్చి ఆ రైతులను నాశనం చేసి తన ద్రాక్షతోటను మరొకరికి అప్పగిస్తాడు.” వారు అది విని, “అలా ఎన్నటికీ కాకూడదు” అన్నారు.

[17] ఆయన వారిని చూసి, “అలాగైతే, ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది’ అని రాసి ఉన్న మాట సంగతి ఏమిటి?

[18] ఈ రాయి పైన పడే ప్రతి వాడూ ముక్కలై పోతాడు. కానీ ఈ రాయి ఎవరిమీద పడుతుందో వాణ్ణి పిండి చేసేస్తుంది.”

[19] ఆయన తమను ఉద్దేశించే ఈ ఉపమానం చెప్పాడని ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ గ్రహించి ఆయనను ఆ సమయంలోనే పట్టుకోవాలని చూశారు కానీ ప్రజలకు భయపడ్డారు.

[20] వారాయన్ని కనిపెట్టి చూస్తూ ఉన్నారు. ఆయనను గవర్నర్ వశం చేసి అతని అధికారానికి అప్పగించడం కోసం ఆయనను మాటల్లో తప్పు పట్టుకోవాలని, నీతిపరులుగా నటించే వేగుల వారిని ఆయన దగ్గరికి పంపారు.

[21] వారు వచ్చి బోధకా, “నీవు న్యాయంగా మాటలాడుతూ ఉపదేశిస్తూ ఉన్నావు. మొహమాటం లేకుండా యథార్థంగా దేవుని మార్గం బోధిస్తున్నావని మాకు తెలుసు.

[22] మనం సీజరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా?” అని ఆయనను అడిగారు.

[23] ఆయన వారి కుతంత్రాన్ని గుర్తెరిగి,

[24] “ఒక నాణెం చూపించండి. దీని మీది బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని అడిగాడు. వారు, “సీజరువి” అన్నారు.

[25] అందుకాయన, “ఆలాగైతే సీజరువి సీజరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అన్నాడు.

[26] వారు ప్రజల ఎదుట ఈ మాటల్లో తప్పు పట్టడం చేతగాక ఆయన ఇచ్చిన జవాబుకు ఆశ్చర్యపడి ఊరుకున్నారు.

[27] పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఇలా అడిగారు.

[28] “బోధకా, ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోయి భార్య బతికే ఉంటే, అతని సోదరుడు అతని భార్యను వివాహమాడి తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే మనకు రాసి ఇచ్చాడు కదా,

[29] ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. మొదటివాడు ఒకామెను పెళ్ళాడి సంతానం లేకుండానే చనిపోయాడు.

[30] రెండవవాడు, మూడవవాడు కూడా ఆమెను పెళ్ళాడారు.

[31] ఆ విధంగా ఏడుగురూ ఆమెను పెళ్ళాడి పిల్లలు లేకుండానే చనిపోయారు.

[32] ఆ పైన ఆ స్త్రీ కూడా చనిపోయింది. కాబట్టి పునరుత్థానంలో ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉంటుంది?

[33] ఇక్కడ ఆ ఏడుగురికీ ఆమె భార్యగా ఉంది గదా” అన్నారు.

[34] అందుకు యేసు, “ఈ లోక ప్రజలు పెళ్ళికి ఇచ్చి పుచ్చుకుంటారు గానీ,

[35] పరలోకంలో నిత్యజీవానికీ, మృతుల పునరుత్థానానికీ అర్హులు ఆ కాలంలో పెళ్ళి చేసుకోరు, ఎవరూ వారిని పెళ్ళికి ఇయ్యరు.

[36] వారు పునరుత్థానంలో భాగస్తులు. దేవదూతలతో సమానులు, దేవుని బిడ్డలు. కాబట్టి ఇక వారికి చావు లేదు.

[37] మండుతున్న పొద గురించిన భాగంలో మోషే రాస్తూ ప్రభువు అబ్రాహాము దేవుడనీ ఇస్సాకు దేవుడనీ యాకోబు దేవుడనీ చెప్పడంలో చనిపోయినవారు లేస్తారని సూచించాడు గదా,

[38] ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. ఆయన దృష్టికి అందరూ సజీవులే” అని వారికి జవాబిచ్చాడు.

[39] ఆ మీదట వారాయన్ని మరేదీ అడగడానికి తెగించలేదు. అది చూసి శాస్త్రుల్లో కొందరు, “బోధకా, చాలా బాగా చెప్పావు” అన్నారు.

[41] ఆయన వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని మనుషులు ఎలా చెబుతున్నారు?

[42] “నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ, నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు,” అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పాడు.

[44] దావీదు ఆయనను ప్రభువని చెప్పాడంటే ఆయన అతని కుమారుడెలా అవుతాడు?” అన్నాడు.

[45] ప్రజలందరూ వింటుండగా ఆయన, “శాస్త్రులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు నిలువుటంగీలు వేసుకుని తిరుగుతూ ఉండాలని చూస్తారు.

[46] వ్యాపార వీధుల్లో వందనాలను, సమాజమందిరాల్లో పెద్ద ఆసనాలను, విందుల్లో అగ్ర స్థానాలను ఆశిస్తారు.

[47] వారు వితంతువుల ఇళ్ళు దిగమింగుతూ కపటంగా దీర్ఘప్రార్థనలు చేస్తుంటారు. వారు మరింత కఠినమైన శిక్ష పొందుతారు” అని తన శిష్యులతో చెప్పాడు.

లూకా రాసిన సువార్త — Chapters