[1] పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇది మంచిది.
[2] “నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.
[4] తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.
[5] సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి.
[6] మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ,
[7] ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి.
[8] దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.
[9] యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేని వాడనీ గ్రహించి, వారిని బెదిరించడం మానండి.
[10] చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.
[11] మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
[12] ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.
[13] అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
[14] మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం,
[15] పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి.
[16] వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి.
[17] ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.
[18] ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి.
[19] సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి.
[20] సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.
[21] నా ప్రియ సోదరుడు తుకికు ప్రభువులో నమ్మకమైన సేవకుడు. అతని ద్వారా నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో మీకు తెలుస్తుంది.
[22] మా సంగతులు మీరు తెలుసుకోడానికీ, మీ హృదయాలను ప్రోత్సహించడానికీ అతణ్ణి మీ దగ్గరికి పంపాను.
[23] తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు శాంతినీ విశ్వాసంతో కూడిన ప్రేమను సోదరులకు అనుగ్రహించు గాక
[24] మన ప్రభు యేసు క్రీస్తుపై నిత్య ప్రేమను కనపరిచే వారికందరికీ కృప తోడై ఉండుగాక.