Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:07

[1] కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి.

[2] క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.

[3] మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన.

[4] కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు.

[5] మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.

[6] పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.

[7] కాబట్టి వారికి దూరంగా ఉండండి.

[8] గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.

[9] ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.

[10] కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ,

[11] పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.

[12] ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.

[13] ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?

[14] బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.

[15] బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి.

[16] సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.

[17] అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.

[18] మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.

[19] కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.

[20] ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.

[21] క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.

[22] స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి.

[23] క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు.

[24] సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.

[25] పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి.

[26] సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి,

[27] దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.

[28] అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.

[29] ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.

[30] మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.

[31] “ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు”

[32] ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.

[33] చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.

ఎఫెసీయులకు రాసిన పత్రిక — Chapters