Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:04

[1] ఇశ్రాయేలీయులారా! యెహోవా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఐగుప్తుదేశం నుంచి ఆయన రప్పించిన వంశమంతటి గురించి ఆయన తెలియజేసిన మాట వినండి.

[2] లోకంలోని వంశాలన్నిటిలో మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను. కాబట్టి మీ పాపాలన్నిటికీ మిమ్మల్ని శిక్షిస్తాను.

[3] సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఏమీ దొరకకుండానే సింహం అడవిలో గర్జిస్తుందా?

[4] దేన్నీ పట్టుకోకుండానే కొదమ సింహం గుహలోనుంచి గుర్రుమంటుందా?

[5] నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా?

[6] పట్టణంలో బాకానాదం వినబడితే ప్రజలు భయపడరా? యెహోవా పంపకుండా పట్టణంలో విపత్తు వస్తుందా?

[7] తన సేవకులైన ప్రవక్తలకు తన ఆలోచనలను తెలియచేయకుండా కచ్చితంగా యెహోవా ప్రభువు ఏదీ చేయడు.

[8] సింహం గర్జించింది. భయపడని వాడెవడు? యెహోవా ప్రభువు చెప్పాడు. ప్రవచించని వాడెవడు?

[9] అష్డోదు రాజ భవనాల్లో ప్రకటించండి. ఐగుప్తుదేశపు రాజ భవనాల్లో ప్రకటించండి. వాళ్ళతో ఇలా చెప్పండి, “మీరు సమరయ పర్వతాల మీద సమావేశమై దానిలోని గందరగోళాన్ని చూడండి. అక్కడ జరిగే దౌర్జన్యాన్ని చూడండి.

[10] సరైనదాన్ని ఎలా చేయాలో వారికి తెలియదు.” యెహోవా ప్రకటించేది ఇదే. వాళ్ళు తమ రాజ భవనాల్లో దౌర్జన్యం, నాశనం దాచుకున్నారు.

[11] కాబట్టి యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, శత్రువు ఆ ప్రాంతాన్ని చుట్టుముడతాడు. అతడు నీకు పట్టున్న వాటిని పడగొడతాడు. నీ రాజ భవనాలను దోచుకుంటాడు.

[12] యెహోవా చెప్పేదేమిటంటే, “సింహం నోట్లో నుంచి కేవలం రెండు కాళ్ళు గానీ చెవి ముక్క గానీ కాపరి విడిపించేలాగా సమరయలో నివసించే ఇశ్రాయేలీయులను కాపాడతాను. కేవలం మంచం మూల, లేకపోతే దుప్పటి ముక్కను కాపాడతాను.”

[13] యాకోబు ఇంటి వారికి విరోధంగా ఇది విని ప్రకటించండి. యెహోవా ప్రభువు, సేనల దేవుడు చెప్పేదేమిటంటే,

[14] “ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు, బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను. బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి.

[15] చలికాలపు భవనాలనూ వేసవికాలపు భవనాలనూ నేను నాశనం చేస్తాను. ఏనుగు దంతంతో కట్టిన ఇళ్ళు నాశనమవుతాయి. పెద్ద భవనాలు అంతరించిపోతాయి.” యెహోవా ప్రకటించేది ఇదే.

ఆమోసు — Chapters