[1] యెహోవా చెప్పేదేమిటంటే “మోయాబు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నం చేశారు.
[2] మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను. అది కెరీయోతు ప్రాకారాలను కాల్చేస్తుంది. యుద్ధ ధ్వనులూ బాకానాదం వినబడుతుంటే మోయాబు హాహాకారాలు చేస్తూ అంతరించి పోతుంది.
[3] దానిలోని న్యాయమూర్తిని నిర్మూలం చేస్తాను. అతనితోపాటు వారి అధిపతులందరిని నేను చంపేస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.
[4] యెహోవా చెప్పేదేమిటంటే “యూదా మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎందుకంటే వారు తమ పూర్వీకులు అనుసరించిన వారి అబద్ధాల వలన మోసపోయి యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి, ఆయన విధులను గైకొనలేదు.
[5] యూదా మీద నేను అగ్ని పంపిస్తాను. అది యెరూషలేము రాజ భవనాలను కాల్చేస్తుంది.”
[6] యెహోవా తెలియజేసేది ఏంటంటే “ఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు నిర్దోషులను అమ్మేశారు. చెప్పుల కోసం పేదలను అమ్మేశారు.
[7] నేల మీద మట్టిని ప్రజలు తొక్కేసినట్టు దిక్కులేనివారి తలలను తొక్కేస్తున్నారు. అణగారిన వారిని అవతలికి గెంటేస్తున్నారు. తండ్రి, కొడుకు ఒకే స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుని నా పవిత్ర నామాన్ని అవమానపరుస్తున్నారు.
[8] తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా ప్రతి బలిపీఠం దగ్గర వాటి మీద పడుకుంటారు. జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షమద్యాన్ని తమ దేవుని మందిరంలో తాగుతారు.
[9] దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ సింధూర వృక్షమంత బలమున్న అమోరీయులను వారి ముందు నిలవకుండా నేను నాశనం చేశాను గదా! పైన వారి ఫలాన్నీ కింద వారి వేరులనూ నేను నాశనం చేశాను గదా!
[10] ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించి, అమోరీయుల దేశాన్ని మీకు స్వాధీనం చేయాలని నలభై ఏళ్ళు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాను.
[11] మీ కొడుకుల్లో ప్రవక్తలను నియమించాను. మీ యువకుల్లో నాజీరులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలీయులారా, ఇది నిజం కాదా?” యెహోవా వెల్లడించేది ఇదే.
[12] “అయితే నాజీరులకు మీరు ద్రాక్షమద్యం తాగించారు. ప్రవచించ వద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు.
[13] చూడండి. ధాన్యంతో నిండిన బండి ఎవరినైనా అణిచి తొక్కగలిగినట్టు నేను మిమ్మల్ని అణగదొక్కుతాను.
[14] చురుకైన వారు సైతం తప్పించుకోలేరు. బలమైనవారు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు. గొప్ప వీరుడు కూడా తన ప్రాణం కాపాడుకోలేడు.
[15] విలుకాడు నిలబడలేడు. వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు. రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు.
[16] ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా నగ్నంగా పారిపోతారు. యెహోవా ప్రకటించేది ఇదే.”