Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:13

[1] దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షత, తన రాజ్యం వచ్చేటప్పుడు బతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నిన్ను ఆదేశిస్తున్నాను.

[2] వాక్యాన్ని బోధించు, అనుకూలమైనా, కాకపోయినా సిద్ధంగా ఉండు. ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా సంపూర్ణమైన సహనంతో ఉపదేశించు.

[3] ఎందుకంటే మనుషులు మంచి బోధను సహించలేని సమయం రాబోతోంది. దురద చెవులతో తమ స్వంత దురాశలకు అనుగుణంగా బోధించే వారిని పోగుచేసుకుని,

[4] సత్యం నుండి తొలిగిపోయి కట్టు కథల వైపు మళ్ళుతారు.

[5] నీవు మాత్రం అన్ని విషయాల్లో సంయమనంతో ఉండి, కష్టాలు భరించు. సువార్త ప్రచారకుని పనిచెయ్యి, నీ పరిచర్యను సంపూర్తి చెయ్యి.

[6] ఒక పానార్పణగా నేను బలి అవుతూ ఉన్నాను. నా మరణం సమీపించింది.

[7] మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.

[8] ఇప్పుడు నా కోసం నీతికిరీటం సిద్ధంగా ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు దాన్ని ఆ రోజున నాకు అనుగ్రహిస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షానికై ప్రేమతో ఎదురుచూసే వారందరికీ అనుగ్రహిస్తాడు.

[9] నా దగ్గరికి త్వరగా రావడానికి ప్రయత్నించు.

[10] దేమా ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టి తెస్సలోనిక వెళ్ళిపోయాడు. క్రేస్కే గలతీయకీ, తీతు దల్మతియకీ వెళ్ళారు.

[11] లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. మార్కును తీసుకురా. అతడు పరిచారం కోసం నాకు ఉపయోగంగా ఉంటాడు.

[12] తుకికును ఎఫెసుకు పంపాను.

[13] నువ్వు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు దగ్గర ఉంచి వచ్చిన అంగీనీ, పుస్తకాలనూ, ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసుకు రా.

[14] అలెగ్జాండర్ అనే కంసాలి నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియలకు తగిన ప్రతిఫలం ప్రభువే ఇస్తాడు.

[15] అతని విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అతడు మా బోధను తీవ్రంగా ఎదిరించాడు.

[16] నేను మొదట న్యాయస్థానం ఎదుట వాదించుకున్నపుడు నా పక్షంగా ఎవరూ నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరం కాకుండా ఉండు గాక.

[17] అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దాన్ని వినేందుకూ ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు.

[18] ప్రభువు అన్ని చెడుపనుల నుండీ నన్ను తప్పించి సురక్షితంగా తన పరలోక రాజ్యం చేరుస్తాడు. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక, ఆమేన్‌.

[19] ప్రిస్కకూ అకులకూ ఒనేసిఫోరు కుటుంబానికీ నా అభివందనాలు.

[20] ఎరస్తు కొరింథులో ఆగిపోయాడు. త్రోఫిముకు జబ్బు చేసింది. అందుకే అతణ్ణి మిలేతులో విడిచి వచ్చాను.

[21] నీవు చలికాలం రాకముందే రావడానికి ప్రయత్నం చెయ్యి. యుబూలు, పుదే, లీను, క్లౌదియ, ఇతర సోదరులంతా నీకు వందనాలు చెబుతున్నారు.

[22] ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండు గాక. కృప మీకు తోడై ఉండు గాక.

తిమోతికి రాసిన రెండవ పత్రిక — Chapters