Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:55

[1] చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి.

[2] మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు,

[3] బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు.

[4] వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు.

[5] వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.

[6] ఇలాంటి వారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇళ్ళలోకి చొరబడి వారిని వశం చేసుకుంటారు. ఈ స్త్రీలు అపరాధ భావనలతో కుంగిపోయి రకరకాల వాంఛలతో కొట్టుకు పోయేవారుగా ఉంటారు.

[7] వాక్యాన్ని అస్తమానం నేర్చుకుంటూనే ఉన్నా వీరు సత్యం విషయమైన జ్ఞానాన్ని పొందలేరు.

[8] యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరు కూడా చెడిపోయిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారు.

[9] అయితే వారిద్దరి అవివేకం ఏ విధంగా బయటపడిందో ఆలాగే వీరిది కూడా అందరికీ వెల్లడి అవుతుంది కాబట్టి వీరు ఇంకా ముందుకి సాగలేరు.

[10] నీవు మాత్రం నా బోధనూ, ప్రవర్తననూ, ఉద్దేశాన్నీ, విశ్వాసాన్నీ, సహనాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ అనుకరించావు.

[11] అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అనే పట్టణాల్లో నేను అనుభవించిన హింసలనూ ప్రమాదాలనూ ఎరిగే నన్ను వెంబడించావు. అలాంటి హింసలు నేను సహించాను గాని, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు.

[12] క్రీస్తు యేసులో సద్భక్తితో జీవించాలని కోరేవారంతా హింస పొందుతారు.

[13] అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు.

[14] కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో.

[15] ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.

[16] దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.

తిమోతికి రాసిన రెండవ పత్రిక — Chapters