Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:05

[1] సొలొమోను యెహోవా మందిరానికి తాను చేయించిన పనంతా పూర్తి చేసి, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండినీ బంగారాన్నీ వస్తువులన్నిటినీ దేవుని మందిరం ధనాగారాల్లో ఉంచాడు.

[2] తరువాత సొలొమోను యెహోవా నిబంధన మందసాన్ని సీయోను అనే దావీదు పట్టణం నుండి తెప్పించడానికి ఇశ్రాయేలీయుల పెద్దలనూ ఇశ్రాయేలీయుల వంశాలకు అధికారులైన గోత్రాల పెద్దలందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.

[3] ఏడవ నెలలో పండగ జరిగే సమయానికి ఇశ్రాయేలీయులంతా రాజు దగ్గరికి వచ్చారు.

[4] ఆ పెద్దలంతా వచ్చిన తరువాత లేవీయులు మందసాన్ని ఎత్తుకున్నారు.

[5] సొలొమోను రాజు, ఇశ్రాయేలీయుల సమాజమంతా సమావేశమై, లెక్కించ లేనన్ని గొర్రెలనూ పశువులనూ బలిగా అర్పించారు.

[6] లేవీయులు, యాజకులు కలిసి, మందసాన్ని, సమాజపు గుడారాన్నీ దానిలో ఉండే ప్రతిష్ఠిత వస్తువులన్నిటినీ తీసుకువచ్చారు.

[7] యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని గర్భాలయమైన అతి పరిశుద్ధస్థలం లో కెరూబుల రెక్కల కింద ఉంచారు.

[8] మందసం ఉండే స్థలానికి పైగా కెరూబులు తమ రెండు రెక్కలనూ చాపి మందసాన్నీ దాని మోత కర్రలనూ కప్పాయి.

[9] మోతకర్రల కొనలు గర్భాలయం ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం లో కనబడేటంత పొడవుగా ఉన్నాయి గానీ అవి బయటికి కనబడలేదు. ఇప్పటి వరకూ అవి అక్కడే ఉన్నాయి.

[10] ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెళ్లిన తరవాత యెహోవా హోరేబులో వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసంలో ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానిలో ఇంకేమీ లేవు.

[11] యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ సమావేశమైన యాజకులంతా తమ వంతులతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.

[12] ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, సహోదరులు, గాయకులైన లేవీయులంతా, సన్నని నార వస్త్రాలు ధరించి, తాళాలు, తంబురలు, సితారాలు చేత పట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపు నిలబడ్డారు.

[13] వారితో బాటు 120 మంది బాకాలు ఊదే యాజకులు నిలబడ్డారు. బూరలూదే వారూ గాయకులూ ఒకేసారి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ గానం చేసినప్పుడు యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటికి వెళ్ళి ఆ బాకాలతో తాళాలతో ఇతర వాద్యాలతో కలిసి గొంతెత్తి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ ఉంటుంది” అని స్తోత్రం చేశారు.

[14] అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. యెహోవా తేజస్సుతో ఆ మందిరం నిండిపోవడం వలన సేవ చేయడానికి యాజకులు ఆ మేఘం దగ్గర నిలబడలేక పోయారు.

2 దినవృత్తాంతాలు — Chapters